
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పలాస : పలాస మెయిన్‌రోడ్డులో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక సంజీవ్‌నగర్‌కు చెందిన సరస్వతి బెహర(26) మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. పలాసకు చెందిన నౌగాపు సోమేశ్వరరావు ఇటీవల సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేశాడు. కారుకు పలాసలోని అన్నపూర్ణ ఆశ్రమం వీధిలో ఉన్న బడ్డిపోలమ్మ ఆలయం వద్ద శనివారం పూజలు చేయించాడు.
అనంతరం ఇంటికి కారులో డ్రైవ్ చేస్తూ వస్తూ ఎదురుగా వస్తున్న జీడి కార్మికురాలు సరస్వతిని ఢీకొన్నాడు. సరస్వతి గుండెకు బలమైన దెబ్బ తగిలి కింది పడిపోయి అపస్మారక స్థితికి వెళ్లింది. స్థానికులు వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త గోపాల బెహర, కుమార్తె శ్రావణి(10), కుమారుడు సంతోష్(5) ఉన్నారు.
భర్త గోపాల్ టిఫిన్ దుకాణంలో పని చేస్తున్నాడు. పసి పిల్లలను చూసి స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యూరు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్‌ఐ కె.వి.సురేషకుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సంఘటనకు కారణమైన డ్రైవర్ సోమేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.