
గర్భవతినని నమ్మించేందుకే..!
వేములవాడ: గర్భంరాకున్నా.. ఉందని చెప్పుకుని.. దానిని నిజం చేసేందుకే కొడిమ్యాలకు చెందిన లావణ్య రాజన్న ఆలయం వద్ద నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసిందని పోలీసులు గుర్తించారు. ఆమెను శుక్రవారం విలేకరుల ఎదుట అరెస్టు చూపారు. సంఘటన వివరాలను సీఐ శ్రీనివాస్ తన కార్యాలయంలో వెల్లడించారు. హుజూరాబాద్‌కు చెందిన లావణ్యకు 2000 సంవత్సరంలో వివాహమైంది. మూడేళ్ల అనంతరం రోడ్డు ప్రమాదంలో భర్త చనిపోయాడు. దీంతో అమ్మమ్మగారి ఊరైన కొడిమ్యాలకు వచ్చిపోయేది. ఈక్రమంలో సందిరెడ్డి రవీందర్‌రెడ్డి అనే వీడియోగ్రాఫర్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. వారికో పాప పుట్టింది. దీంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. అత్త, ఆడపడుచులు సూటిపోటీ మాటలు పడలేక.. తనకు ఎలాగైనా కొడుకు కావాలని ప్లాన్ వేసుకుంది. ఇటీవల ఆమె గర్భందాల్చినా.. అబార్షన్ అయ్యింది.
ఈ విషయాన్ని దాచిపెట్టి తన గర్భవతినని అందరికీ చెప్పుకుంది. మే ఎనిమిదిన తన డెలీవరి అని, పుట్టింటికి వెళ్తున్నానని గత నెల 4న బయల్దేరింది. గర్భం లేకపోవడం.. సమయం దగ్గరపడుతుండడంతో బాలుడి కోసం వెదకడం ప్రారంభించింది. గతనెల 29న వేములవాడ చేరుకుని రాజన్న ఆలయ ఆవరణలో వెదికినా.. బాలురు కనిపించకపోవడంతో వెనుదిరిగింది. తిరిగి ఈనెల 3న మళ్లీ రాజన్న గుడికి చేరుకుంది. అప్పటికే నల్లగొండ జిల్లా నుంచి వచ్చిన కొమ్ము కల్పన ఒడిలో ఉన్న నాలుగు నెలల చిన్నారిని గమనించింది. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కల్పన తల్లి ధర్మగుండం వైపు వెళ్లాక బాలుడితో పరారయ్యింది. అక్కడ్నుంచి ఓ ఆటోలు కరీంనగర్ చేరుకుంది. కరీంనగర్‌లో తనకు నార్మల్ డెలవరీ అయ్యిందంటూ కుటుంబసభ్యులందరికీ ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అందరూ కలిసి కొడిమ్యాలకు చేరుకున్నారు. అందరితో కలిసి సంబరాలు జరుపుకుంది. అయితే బాలుడు కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పెషల్ టీం రంగంలోకి దిగింది. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా లావణ్యను గుర్తించి నేరుగా కొడిమ్యాల చేరుకుని బాలుడిని తీసుకొచ్చి కల్పనకు అప్పగించామని సీఐ వివరించారు. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు తమ వస్తువులు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, 100 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.