రాజమహేంద్రవరంలోని రైల్వేక్వార్టర్స్‌లో అపస్మారక స్థితిలో లభించిన మహిళ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందింది. ఈనెల ఏడోతేదీన రైల్వేకార్టర్‌లోని ఓ గదిలో చేతులు కట్టివేసిన స్థితిలో ఆమె కనిపించింది. క్వార్టర్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన స్వీపర్లు.. ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్
-
అపస్మాకరస్థితిలోని మహిళ మృతి
-
వీడని మిస్టరీ
రాజమహేంద్రవరం క్రైం :
రాజమహేంద్రవరంలోని రైల్వేక్వార్టర్స్‌లో అపస్మారక స్థితిలో లభించిన మహిళ కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందింది. ఈనెల ఏడోతేదీన రైల్వేకార్టర్‌లోని ఓ గదిలో చేతులు కట్టివేసిన స్థితిలో ఆమె కనిపించింది. క్వార్టర్‌ను శుభ్రం చేయడానికి వెళ్లిన స్వీపర్లు.. ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో కాకినాడకు తీసుకువెళ్లారు. ఆమె వైద్యచికిత్స పొందుతూ మృతి చెందింది.
వీడని మిస్టరీ
పేపర్లలో వచ్చిన వార్తను చూసి ఆమె బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. వారి చెప్పిన వివరాల ప్రకారం.. ఆలమూరు మండలం పెద్దపళ్ల గ్రామానికి చెందిన చిలుకూరి భవాని గత నెల 30న బాకీలు వసూలు చేసుకొని వస్తానని చెప్పి మండపేట వెళ్లింది. అనంతరం ఆమె ఆచూకీ లభించలేదు. ఈనెల 7న రాజమహేంద్రవరం రైల్వేక్వార్టర్లలో అపస్మారకస్థితిలో లభించింది. గత నెల 30వ తేదీ నుంచి ఈనెల 7వ తేదీ వరకు ఆమె ఏమైందో, ఎలా రాజమహేంద్రవరం వచ్చిందో తెలియలేదు.
పలు అనుమానాలు
ఇప్పటి వరకు ఈ కేసులో ఎవ్వరినీ పోలీసులు అరెస్టు చేయలేదు. భవానీని మండపేట నుంచి కిడ్నాప్ చేసి తీసుకువచ్చారా లేక రాజమహేంద్రవరం వచ్చిన తరువాత కిడ్నాప్ చేసి రైల్వే క్వార్టర్లలో బంధించారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎక్కువరోజులు బంధించి ఉండడంతో అవయవాలు పనిచేయడం మానేసి కోమాలోకి వెళ్లిపోయింది. ఆ స్థితిలోనే ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. మెదడులో నరాలు దెబ్బతినడంతో పాటు చాలా రోజులు ఆహారం, నీరు అందక డీ హైడ్రేషన్‌తో ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెబుతున్నారు. భవానీ మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు, రైల్వే క్వార్టర్లలో ఎప్పుడు బంధించారు, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో తెలియదు. ఇప్పటికే పోలీసులు ఆమె బంధువులను, అనుమానితులను ప్రశ్నించారు. రాజమహేంద్రవరానికి చెందిన జ్యోతిషుడిని పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం.