మహిళ హత్య
నర్సింగపేట (చింతూరు):
కలహాల నేపథ్యంలో ఓ మహిళను ఉరేసి హతమార్చిన సంఘటన నర్సింగపేట గ్రామంలో బుధవారం అర్థరాత్రి జరిగింది. చింతూరు సీఐ దుర్గారావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం నర్సింగపేట గ్రామానికి చెందిన సున్నం పోలమ్మ (30) భర్త రాజు నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె భద్రాచలానికి చెందిన బాషా అనే వ్యక్తితో సహజీవనం గడుపుతోంది. బుధవారం రాత్రి వీరిద్దరి నడుమ ఏదో విషయంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలమ్మ కొడుకు, సోదరుడు జోక్యం చేసుకుని వారిద్దరిని వారించడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. వీరిద్దరికీ అనుమానం వచ్చి అర్థరాత్రి వెళ్లి చూడగా పోలమ్మ ఇంట్లో దూలానికి వేలాడుతూ కన్పించింది.
వారు ఆమెను పరిశీలించగా మృతిచెందినట్టు గుర్తించారు. అ సమయంలో బాషా కూడా వారికి అక్కడ కనిపించలేదు. దాంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని చింతూరు సీఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి గొంతు నులిమిన ఆనవాళ్లు ఉండడంతో ఘర్షణ అనంతరం పోలమ్మను హతమార్చి ఇంట్లో ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాషా ప్రయత్నించి ఉండవచ్చని సీఐ అన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం చింతూరు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు బాషా పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు.