స్త్రీ సాధికారత, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి
► జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ
► నారీ ఫౌండేషన్ ప్రతినిధులతో సమీక్ష
సాక్షి, కామారెడ్డి: స్త్రీ సాధికారత సాధించడంతో పాటు మహిళల ఆరోగ్యం విషయంలో స్వయం సహాయక సంఘాలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డితో కలిసి నారీ ఫౌండేషన్ ప్రతినిధులతో స్త్రీ సాధికారత, మహిళల ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సంఘాలు, చిన్న సంఘాల సమావేశాలు, చర్చించుకునే అంశాలపై సమీక్షించారు. జెండర్ కమిటీ సభ్యుల పనితీరుపై చర్చించారు. జిల్లా సమాఖ్య నుంచి చిన్న సంఘాల దాకా సమాచారం ఎలా చేరుస్తారన్న దానిపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్త్రీల సాధికారత, వ్యక్తిగత పరిశుభ్రత, భహిష్టు శుభ్రత, నిర్వహణ, బాలికల ఆరోగ్య విషయాలపై చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, డీఈవో మదన్‌మోహన్, నారి ఫౌండేషన్ ప్రతినిధి అంజు తదితరులు పాల్గొన్నారు.