పనిమంతుడు | he is a reayal hero.. he did not take a single days leave | Sakshi
Sakshi News home page

పనిమంతుడు

Published Fri, Mar 10 2017 5:38 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

పనిమంతుడు - Sakshi

పనిమంతుడు

ప్రశంసలు అందుకుంటున్న కలెక్టర్‌
► మానవీయ కోణంలోనూ స్పందన
► కుటుంబాల్లో కలహాల పరిష్కారానికి‘కుటుంబ స్నేహిత’
► ‘అన్యోన్య దాంపత్యం’పై అవగాహన సదస్సులు
► సెలవు దినాల్లోనూ పల్లెబాట
► ఒక్క రోజూ సెలవు పెట్టని అధికారి
‘నా ఎదుగుదలకు కామారెడ్డిలో చదువే ఉపకరించింది. బతుకుబాట చూపిన ఈ గడ్డ రుణం తీర్చుకునేందుకు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’. – కలెక్టర్‌ సత్యనారాయణ  
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కలెక్టర్‌ సత్యనారాయణ పనితీరుపై జిల్లాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన సామాజిక, మానవీయ కోణంలోనూ స్పందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం రోజైన అక్టోబర్‌ 11న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ ఇప్పటి వరకు ఏ ఒక్కరోజూ సెలవుపై వెళ్లలేదు.
కామారెడ్డి : రాష్ట్ర రాజధానిలో జరిగిన రివ్యూ సమావేశాలు, ఓ సారి ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళ్లినపుడు మాత్రమే కలెక్టర్‌ సత్యనారాయణ జిల్లాను వదిలిపెట్టారు. మిగతా రోజులన్నీ ఇక్కడే గడిపారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి దాకా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక్కోరోజు ఐదారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

అంతేగాక ఫీల్డ్‌ విజిట్‌లకు కూడా నిత్యం వెళుతున్నారు. కలెక్టర్‌ పనితీరును చూసి అందరూ ‘సత్తెన్న మస్తు చేస్తుండు’ 
అని మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆయా విభాగాల సిబ్బందిని కలెక్టర్‌ ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వస్తున్న వినతులు, అక్కడికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్న అమాయక జనాల వ్యథలను నిదానంగా వింటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ప్రజావాణికి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన ఘటన ఆయన్ను కలచివేసింది.

సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం ఆలోచన రావడం సరికాదని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో సమస్యలే ఆమెను ఆత్మహత్యకు పురిగొలిపాయని గుర్తించిన కలెక్టర్‌ వాటిపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, జేసీ సత్తయ్య, డీఆర్‌వో మణిమాల, డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు దేవిదాస్, గంగాధర్, రాధమ్మ తదితరులతో పలుమార్లు చర్చించి కుటుంబ సమస్యల పరిష్కారానికి ‘కుటుంబ స్నేహిత’ (ఫ్యామిలీ కౌన్సెలింగ్‌) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

డివిజన్‌ స్థాయిలో రెండు టీమ్‌లను ఏర్పాటు చేయాలని భావించారు. పోలీసు, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందంలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సీనియర్‌ సిటిజెన్, ఇద్దరు జెండర్‌ కమిటీ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి సమస్యలను ఎలా పరిష్కరించాలన్న విషయమై అవగాహన కల్పించారు. కమిటీల ఆధ్వర్యంలో కుటుంబ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అలాగే కొత్త దంపతులకు ‘అన్యోన్య దాంపత్యం’పై సదస్సులు ఏర్పాటు చేసి సైకాలజిస్టులతో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే నిరంతర విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఒత్తిడికి గురవుతుంటారని, వారికి, వారి కుటుంబ సభ్యులకు ఓ రోజు సైకాలజిస్టులతో అవగాహన తరగతులు ఇప్పించారు. ఇలా సామాజిక అంశాలపై కలెక్టర్‌ స్పందిస్తున్న తీరుకు అభినందనలు వస్తున్నాయి.

ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటుకు చర్యలు..  ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఇళ్లలోనే కాన్పులు జరగడం ద్వారా తల్లికీ, బిడ్డకీ ప్రమాదం ఉందని గుర్తించిన కలెక్టర్‌ కాన్పులన్నీ దవాఖానల్లోనే జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖలకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో సమస్యలు ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి కలెక్టర్‌ చర్యలు మొదలుపెట్టారు. విశ్రాంత ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలను అందుకోసం వినియోగించాలని భావిస్తున్నారు. త్వరలోనే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుకానున్నాయి. 
సెలవు రోజుల్లోనూ పల్లెబాట..   పండుగ రోజులు, ఇతర సెలవు రోజుల్లోనూ కలెక్టర్‌ సత్యనారాయణ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. సెలవు ఉన్న రోజున  అధికారులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదన్న భావనతో వివిధ ప్రాంతాలకు వెళ్లినపుడు వారికి సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఉపాధి హామీ పనులు, నర్సరీల పెంపకం పరిశీలిస్తున్నారు.జిల్లాలోని మారుమూల గ్రామాలను సైతం చుట్టివచ్చారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్‌ నియోజక వర్గంలో ప్రతీ నెల మొదటి వారం ఒక రోజు వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement