-
అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్న యువతేజాలు
-
కఠోరమైన సాధనతో ప్రత్యేక గుర్తింపు
-
ఓరుగల్లు పేరును నలుదిశలా చాటుతున్న క్రీడాకారులు
-
జాతీయ స్థాయిలో అనేక పతకాలు
‘‘ఒకటే గమనం.. ఒకటే పయనం.. గెలుపు పొందే వరకూ.. అలుపులేదు మనకు..’’ అని ఓ సినీకవి రాసిన పాటను వీరు అక్షరాల పాటిస్తున్నారు. కష్టాలు వచ్చినా.. కన్నీళ్లు వచ్చినా.. వాటిని దిగమింగుకుని లక్ష్యసాధనకు పాటుపడుతున్నారు. నిత్యం కఠోరమైన సాధనతో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. క్రమశిక్షణ.. అంకితభావానికి మారుపేరుగా నిలిచే ‘జిమ్నాస్టిక్‌్స’లో జిల్లాకు చెందిన పలువురు యువతేజాలు రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
–వరంగల్ స్పోర్ట్స్
దీపా కర్మాకర్ స్ఫూర్తిగా..
మేటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ‘దీపా కర్మాకర్’ భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ. మునుపెన్నడూ లేని రీతిలో ఆమె దేశచరిత్రను తిరగరాసింది. తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శనతో జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్స్‌కు చేరడం గమనార్హం. అయితే ప్రపంచ ప్రజలందరి దృష్టిని ఆక్షరించిన 23 ఏళ్ల దీపా కర్మాకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని మన జిల్లాకు చెందిన విద్యార్థులు, యువకులు జిమ్నాస్టిక్స్‌లో సత్తాచాటుతున్నారు.
1570లో ఆవిర్భావం..
జిమ్నాస్టిక్స్ అంటే వాడుక భాషలో సర్కస్ ఫీట్లు అని అర్థం. బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పు, నియంత్రణ కలగలిపిన వ్యాయామాల ప్రదర్శనే జిమ్నాస్టిక్స్ అని చెప్పొచ్చు. ఈ క్రీడ 1570లో పురాతన గ్రీసులో ఆవిర్భవించింది. 1759–1839 మధ్య కాలంలో జర్మనీలో భౌతిక విద్యావేత్త జోహన్ ఫ్రెడరిక్ యువకులను ఉత్తేజ పరిచేందుకు ఈ ఆటను కనుగొన్నారు. అయితే అనేక పరిణామాల తర్వాత 1928లో జిమ్నాస్టిక్స్‌ను ఒలింపిక్స్ క్రీడగా గుర్తించారు. అనంతరం ప్రతిదేశం తన సొంత జాతీయ పాలకమండలిని ఏర్పాటు చేసుకుంది. జిమ్నాస్టిక్స్‌లో రిథమిక్, ట్రామ్ఫోలిన్, ఏరోబిక్స్, తదితర ఈవెంట్లు ఉంటాయి. ఈ క్రీడలో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు.
ఎనిమిదేళ్లుగా శిక్షణ
నేను ఎనిమిదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో ఉంటూ జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు 12 జాతీయ, 18 రాష్ట్రస్థాయి జూనియర్స్, సీనియర్స్ పోటీలకు హాజరయ్యాను. 2012లో తమిళనాడులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో సిల్వర్, 2013లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో సిల్వర్ మెడల్స్ సాధించాను. అలాగే 2012లో బెంగళూరులో జరిగిన సౌత్ ఇంటర్ నేషనల్స్‌లో పాల్గొన్నాను. ఇప్పటివరకు 30 టోర్నమెంట్లలో పాల్గొని 15 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించాను.
– ఈ. ప్రశాంత్, డిగ్రీ సెకండియర్
పది బంగారు పతకాలు
నేను పదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతున్నాను. 2008 నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 20 జాతీయస్థాయి, 20కి పైగా రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై 10 గోల్డ్, 12 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. భవిష్యత్‌లో మరింత సాధన చేసి అంతర్జాతీయస్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం.
– కె. ప్రవళిక, ఇంటర్ సెకండియర్
ఆర్టిస్టిక్ విభాగంలో పట్టు
నేను జిమ్నాస్టిక్స్‌లోని ఆర్టిస్టిక్ విభాగంలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఆర్టిస్టిక్‌పై మరింత పట్టు సాధించేందుకు ఉదయం, సాయంత్రం వేళలో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కోచ్‌ల సూచనలు పాటిస్తూ అంతర్జాతీయస్థాయిలో రాణించే విధంగా శిక్షణ పొందుతున్నాను. ఇప్పటివరకు 20 జాతీయ, 15 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో 10 బంగారు, 20 సిల్వర్ మెడల్స్ సాధించాను.
– బి. సంజయ్‌కుమార్, డిగ్రీ సెకండియర్