సైనికుల్లా పని చేద్దాం
సైనికుల్లా పని చేద్దాం
Published Sat, Nov 12 2016 9:53 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
- మున్సిపల్ ఎన్నికల ఓటరు నమోదుపై దృష్టి సారించాలి
- నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా పోరాడుదాం
- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని జిల్లా అదనపు పరిశీలకుడు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం రోజురోజుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని, దానిని వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా మలుచుకునేందుకు సమష్టి కృషి అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ కలుపుగోలు తనంతో నాయకులు, కార్యకర్తలు అన్న తేడా లేకుండా పార్టీ కోసం పనిచేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో సులభంగా గెలవచ్చన్నారు. శనివారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఇటీవల ఎంపిక చేసిన డివిజన్ ఎలక‌్షన్ కమిటీలతో రవీంద్రనాథ్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్పొరేషన్ ఎన్నికలపై పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు చేపట్టనున్న ఓటర్ల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఆయా కమిటీ సభ్యులు వారివారి డివిజన్లలో ఇంటింటికి తిరిగి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. అంతేకాక వార్డుల భౌగోళిక పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించాలని కోరారు.
ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో..
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించామని జిల్లా అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఎన్నికైన డివిజన్ ఇన్‌చార్జీలు, అందులోని కమిటీ సభ్యులు ఎన్నికల అంశాలపై ఎంపీతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ముందుకు సాగాలని సూచించారు.
20న వార్డుల వారీగా సమీక్ష:
తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం ఈనెల 20వ తేదీన వార్డుల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా వార్డుల డివిజన్ ఎలక‌్షన్ కమిటీలు పూర్తి స్థాయి సమాచారంతో సమీక్షకు హాజరు కావాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడు గంటలకు సమీక్షా సమావేశం ఉంటుందని, త్వరలోనే సమావేశాన్ని ఎక్కడ నిర్వహించేదేది తెలుపుతామని పేర్కొన్నారు.
కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో: ఎంపీ
కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్‌పై వైఎస్‌ఆర్‌సీపీ జెండాను ఎగుర వేసేందుకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎంపీ బుట్టారేణుక పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను ఇవ్వడంలో టీడీపీ, బీజేపీ విఫలమైన నేపథ్యంలో ప్రజలు చూపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. నగరంలోని వార్డుల్లో సమస్యలు పేరుకుపోయాయని, అయినా టీడీపీ ప్రజా ప్రతినిధులు మాత్రం వాటి గురించి పట్టించుకోవడంలేదన్నారు. ఎంతో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పడం తప్పా వారు చేసిందేమిలేదన్నారు. కర్నూలు నగరంలో చాలా వార్డులో మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దోమల బెడదతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, సీడబ్ల్యూసీ మెంబర్ కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, సిటీ అధ్యక్షుడు నరసింహులు యాదవ్, కర్నూలు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Advertisement