♦ పెండింగ్‌లో ‘చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి’
♦ ఎత్తిపోతల చివరిదశ పనులు
♦ ఇంకా మొదలుకాని పెద్దవాగు
♦ చెక్‌డ్యాంల నిర్మాణాలు
మోర్తాడ్: మోర్తాడ్, కమ్మర్‌పల్లి మండలాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి నిర్దేశించిన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం చివరి దశ పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న విధంగా సాగుతున్నాయి. చివరి దశ పనులు పూర్తయితే ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఎత్తిపోతల పథకం నిర్వహణ, పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా పనులు ఆశాజనకంగా సాగడం లేదు.
ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించే అధికారులు బదిలీ కావడం, కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తులు సరిగా స్పందించకపోవడంతో చివరి దశ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఎత్తిపోతల పథకంలో చేర్చిన రామన్నపేట్‌కు నీరు అందించడానికి కాలువలను తవ్వాల్సి ఉంది. అంతేకాక చౌట్‌పల్లి నుంచి అమీర్‌నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్ గ్రామాలకు కూడా పైప్‌లైన్ పనులు చేపట్టాల్సి ఉంది. సుంకెట్‌కు నీరు అందించడానికి దోన్‌పాల్ నుంచి కాలువ తవ్వకం చేపట్టాల్సి ఉంది. అటవీశాఖకు సంబంధించిన భూములు ఉండటంతో అటవీశాఖ అనుమతి పొందిన తరువాతనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
అయితే ఎత్తిపోతల పథకం నిర్వహణ, పెండింగ్ పనులను పూర్తి చేయడం కోసం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి కేటాయించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. నిధులను కేటాయించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఎత్తిపోతల పథకంను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా పనులు అసంపూర్తిగా నిలచిపోవడంతో ట్రయల్న్ ్రదశలోనే పథకం ఆగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ వర్షాకాలం ఆశించిన స్థాయిలో నీరు వస్తే వచ్చే రబీ సీజనులో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించవచ్చు. కాని ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది.
చెక్‌డ్యాంల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించేనా...?
వరదల వల్ల పెద్దవాగులో చేరే నీటిని భూగర్భంలో అభివృద్ధి పరచడానికి ప్రతిపాదించిన చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు అయినా ఇంకా పనులు మొదలు కాలేదు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటనతోనైనా చెక్‌డ్యాంల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా అని రైతాంగం ఆశతో ఎదురుచూస్తోంది. మోర్తాడ్ మండలంలోని దొన్కల్, గాండ్లపేట్‌ల శివారులో ఉన్న పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మించడానికి రూ.4.84 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
వేల్పూర్, రామన్నపేట్‌ల మధ్య ఉన్న పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.4.14 కోట్లు, గోనుగొప్పుల వద్ద చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.3.53 కోట్లు, భీమ్‌గల్ వద్ద చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.4.95 కోట్లు మంజూరు అయ్యాయి. నాలుగు చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణం కోసం రూ.17.56 కోట్లు మంజూరు అయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరు అయినా పనులు ఇంతవరకు మొదలుకాలేదు. వర్షాలు కురువకముందు చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి అయితే వర్షపు నీరు వాగులో ఇంకి భూగర్బ జలాలు అభివృద్ధి చెందుతాయి.
నీటిపారుదల శాఖకు సొంత భవనాల కొరత...
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపాదుల శాఖకు సొంత భవనాల కొరత వేధిస్తోంది. తొమ్మిది సబ్ డివిజన్ కార్యాలయాకు గాను నాలుగు చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రాలలో ఏఈఈ, జేఈ ఇతర సిబ్బంది ఉండటానికి సెక్షన్ కార్యాలయాలను నిర్మించాల్సి ఉంది. సెక్షన్ కార్యాలయాలకు స్థలాలు చూపకపోవడంతో నిధులు ఉన్నా సొంత భవనాల నిర్మాణం మొదలు కాలేదు. కొన్నిచోట్ల గతంలో నిర్మించిన భవనాల్లో సెక్షన్ కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు జిల్లా పర్యటనలో ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.