![ఆదుకుంటుందనే నమ్మకంలేదు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/71462833182_625x300.jpg.webp?itok=K7dwL2dj)
ఆదుకుంటుందనే నమ్మకంలేదు
♦ సర్కారుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
♦ అకాల వర్షాలతో నిలువునా నష్టపోయిన అరటి రైతులు
♦ పులివెందుల, లింగాల మండలాల్లో పర్యటన
♦ అరటి రైతుల దుస్థితి చూసి చలించిపోయిన జననేత
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి. పంట ఏపుగా ఉంది. ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఫలసాయం దక్కుతుందని అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా వడగండ్ల వాన రావడం, గంటలో అరటి తోటలు నేలపాలు కావడం జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో మానవత్వంతో రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆదుకుంటుందనే నమ్మకం రైతులకు లేదు. పంటనష్ట పరిహారం లేదు, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వరు, తుదకు పంటల బీమా సొమ్ము సైతం ఇవ్వకపోవడమే’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
వైఎస్సార్ జిల్లా పులివెందుల, లింగాల మండలాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కళింగర పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. నేలమట్టమైన అరటితోటల రైతన్నల ఆవేదనను చూసిన ప్రతిపక్ష నేత చలించిపోయారు. నల్లపురెడ్డిపల్లెలో పంటలు పరిశీలిస్తున్న తరుణంలో ఆదినారాయణ అనే రైతు బోరున విలపిస్తూ తన ఆవేదనను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చే పరిహారం తోటలు చదును చేసుకునేందుకు కూడా సరిపోదని తెలిపారు.
అకాల వర్షాలు వల్ల అరటి రైతులకు పంట నష్టం సంభవిస్తే కనీసం రూ.50వేలకు పైబడి పరిహారం అందేలా విధివిధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షంతో నిలువునా నష్టపోయిన రైతులను ప్రభుత్వం పెద్ద మనసుతో ఆదుకోవాలని జగన్ కోరారు. అధికారులు అంచనాలు రూపొందించడం మినహా పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతోనే రైతులకు విపత్తుల పరిహారం అందలేదని ఆరోపించారు. ఇదే విషయమై కలెక్టర్, ముఖ్యమంత్రికి లేఖలు రాయనున్నట్లు తెలిపారు. అవసరమైతే రైతుల పక్షాన ధర్నా సైతం నిర్వహిస్తానని జగన్ చెప్పారు. పర్యటనలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాష, కడప మేయర్ కె.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.