యనమల ద్వయానికి ఘాతం
-
ఒకేరోజు రెండు ఎదురుదెబ్బలు
-
దివీస్ భూ సేకరణపై హైకోర్టు స్టే
-
టీడీపీకి మాజీ జెడ్పీటీసీ గుడ్‌బై
-
జిల్లా ‘దేశం’లో చర్చనీయాంశమైన పరిణామాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
దివీస్ భూ సేకరణలో బుధవారం చోటుచేసుకున్న రెండు పరిణామాలతో తునిలో యనమల సోదర ద్వయానికి భంగపాటు ఎదురైంది. అధికారం చేతిలో ఉందని బరితెగించి పోలీసు బలప్రయోగంతో రైతుల నోళ్లు నొక్కే స్తూ దివీస్ రసాయన పరిశ్రమ యాజమాన్యం కొమ్ముకాస్తున్న వీరికి ఈ పరిణామాలు చెంపపెట్టు. తుని నియోజ కవర్గంలో యనమల సోదరుల అప్రజాస్వామిక వైఖరినీ, ధాష్టీకాన్నీ ‘సాక్షి’ అనేక కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దివీస్ పరిశ్రమకు అడ్డగోలుగా జరుపుతున్న భూ సేకరణను ఒకపక్క న్యాయస్థానం తప్పుపట్టగా, మరోవైపు మత్స్యకార నాయకుడు, మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశిఈశ్వరరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ రెండు పరిణామాలు యనమల సోదరులకు తుని నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బే. బలవంతపు భూ సేకరణలో యనమల సోదరుల వ్యవహార శైలికి నిరసనగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పార్టీకి రాజీనామా చేయడం జిల్లా టీడీపీలో చర్చనీయాంశమైంది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, అతనికి వరుసకు సోదరుడైన కృష్ణుడిని మూడు దశాబ్దాలపాటు అందలమెక్కిస్తే తమ గుండెలపై దివీస్ కుంపటి పెడుతున్నారని ఆ నియోజకవర్గంలో అట్టడుగు వర్గాలైన యాదవులు, మత్స్యకారులు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దివీస్ రసాయన పరిశ్రమకు 500 ఎకరాలు నిరుపేద రైతుల నుంచి బలవంతంగా లాగేసుకునేందుకు గడచిన నాలుగైదు నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలకు హైకోర్టు బుధవారం ముకుతాడు వేయడంతో సోదర ద్వయం కంగుతింది.
జనంలో వ్యతిరేకత
తొండంగి మండలం కొత్తపాకలు, పంపాదిపేట, శృంగవృక్షంపేట, తాటాకులపాలెం, ఒంటిమామిడి తదితర 13 గ్రామాల ప్రజలు దివీస్ బలవంతపు భూ సేకరణకు ప్రయత్నిస్తున్న తీరుపై ఇటీవల దివీస్ ప్రతిపాదిత ప్రాంతంలో భారీ బహిరంగ సభ పెట్టి యనమల సోదరులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భూ సేకరణకు వ్యతిరేకంగా నాలుగైదు నెలలుగా జరుగుతున్న ఆందోళనలపై సోదరుల సిఫార్సులతో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించి గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టించారు. 144 సెక్షన్ అమలు చేయడంతో ఆగకుండా అత్యవసర పరిస్థితిని తలపించేలా ప్రజల దైనందిన జీవనాన్ని కూడా నియంత్రించే పరిస్థితుల వెనుక యనమల సోదరుల పాత్రను స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు.
బీసీల్లోనూ ఈసడింపు
30 ఏళ్లు యనమల సోదరులు చెప్పినట్టే ఓట్లు వేస్తూ వచ్చినందుకు ఇప్పుడు సరైన గుణపాఠం చెప్పారంటూ దివీస్ బాధిత రైతులు మండిపడుతున్నారు. జీడితోటలు, కొబ్బరి తోటలు, సపోటా చెట్లు సాగుచేసుకుంటూ, 250 హేచరీల్లో పనిచేసుకుంటూ సుమారు 20వేల మంది బతుకు బండి లాగిస్తున్నారు. వారంతా అల్పాదాయ వర్గాలైన రైతులనే విషయాన్ని కూడా విస్మరించి బడా సంస్థలకు కొమ్ము కాయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు యనమల సోదరులను ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాకినాడ ఎస్‌ఈజెడ్‌కు భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఇదే యనమల సోదరులు టీడీపీ అధికారంలోకి వచ్చాక దివీస్ కోసం 500 ఎకరాలు బలవంతపు భూ సేకరణకు కొమ్ముకాయడంతో అక్కడి బీసీ సామాజికవర్గాల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
తునిలో పార్టీకి నష్టం
ప్రాథమికంగా రూ.600 కోట్లతో ప్లాంట్ ప్రారంభించి భవిష్యత్‌లో దీనిని రూ.11వేల కోట్లతో విస్తరించాలనే ప్రయత్నాల్లో దివీస్ ఉంది. సేకరిస్తున్న 500 ఎకరాలలో 300 ఎకరాలు డి పట్టాభూములనే విషయం వారికి తెలియంది కాదంటున్నారు. సముద్రం ఒడ్డున ఇచ్చిన ఆ భూములను లాగేసుకోవాలనుకునే ప్రయత్నాలతో సొంత యాదవ సామాజికవర్గమే గుర్రుగా ఉంది. ఇటువంటి వ్యవహారశైలి కారణంగానే యనమల సోదరులకు రాజకీయంగా తునిలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికైనా వారిలో మార్పు వస్తుందని ఎదురుచూశామని, కానీ మార్పు కన్పించడం లేదని దివీస్‌కు వంత పాడటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. వారి వ్యవహార శైలితో పార్టీ తునిలో మరింత పతనమైపోతోందని జిల్లాలో టీడీపీ నేతల మధ్య చర్చ జరుగుతోంది.