పచ్చ నేతల మైండ్ గేమ్! | yellow leaders mind game with the ysrcp | Sakshi
Sakshi News home page

పచ్చ నేతల మైండ్ గేమ్!

Published Fri, Feb 12 2016 4:08 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

పచ్చ నేతల మైండ్ గేమ్! - Sakshi

పచ్చ నేతల మైండ్ గేమ్!

♦ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చావుదెబ్బ
♦ తెలంగాణలో తుడిచి పెట్టుకుపోతున్న టీడీపీ
♦ ఆర్భాటపు ప్రచారంతో ఏపీలో లబ్ధి పొందాలని వ్యూహం

 సాక్షి ప్రతినిధి, కడప: బోడిగుండుకు, మోకాలికి ముడి బెట్టడంలో అధికార తెలుగుదేశం పార్టీ తనకు తానే సాటి. ‘ఎద్దు ఈనింది అంటే గాటిన కట్టేయండి’ అన్న చందాన ఎల్లో మీడియా ఆ పార్టీకి వంత పాడటం పరిపాటి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోతుంటే నివారించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఉపద్రవం ఎక్కడ ముంచుకు వస్తుందోనని ముందస్తు వ్యూహంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతల వలసలంటూ హైడ్రామాకు తెరతీసింది.

అదుగో పులి.. ఇదుగో తోక అంటూ ఇందుకు ఎల్లో మీడియా వంత పాడింది. వాస్తవంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.. ప్రజల ఆదరణ ఎలా చూరగొనాలో తెలియక తల్లడిల్లుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఆ పార్టీ నేతలను నిలువరించుకోడానికి వ్యూహం రూపొందించుకుంది. ఇందులో భాగంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారంటూ ప్రచారం ప్రారంభించింది. ఇలా ప్రచారం మొదలెట్టడం ఇదే ప్రథమం కాదు.  ‘‘ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబాన్ని వీడం. వైఎస్సార్‌సీపీని వీడితే ప్రజలతోపాటు, మాకుటుంబ సభ్యులు సైతం క్షమించరు’’ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా ఎన్నో సందర్భాల్లో పేర్కొన్నారు. ఆ మాటలకు కట్టుబడి ఉన్నారు.

అయితే.. అదిగో ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు వెళ్తున్నారు.. ఇదిగో ఇక్కడ అసంతృప్తి వాదులు ఉన్నారంటూ నిత్యం ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ఉన్న విధేయత వల్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు నైతిక విలువలకు కట్టుబడి ప్రజా సేవలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో దుష్ర్పచారం చేస్తూ పబ్బం గడుపుకోడానికి టీడీపీ మైండ్‌గేమ్ ఆడుతోంది. కావాలనే ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ముందుస్తుగా పార్టీ మారుతున్నట్లు ప్రచార పర్వాన్ని కొనసాగించడం ఆనవాయితీగా పెట్టుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం ఉన్నా, తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వరుస కట్టారు. ఈ పరిణామాన్ని నియంత్రించలేని స్థితిలోనే మైండ్‌గేమ్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా, మన జిల్లాకు ముడిపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తుని ఘటనలో సైతం కడపను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించడంపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు.

టీడీపీ  మునిగిపోనున్న నావ
రాచమల్లు శివప్రసాదరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే
ప్రొద్దుటూరు: రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయి అసహనంతో, అభద్రత భావంతో ఉన్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు పేదలను నమ్మించి మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన ఎల్లో మీడియా  చేస్తున్న విష ప్రచారమే తప్ప ఇందులో వాస్తవం లేదన్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చే నాటి నుంచి ఆ జిల్లాలో ఇంత మంది, ఈ జిల్లాలో ఇంత మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు నిత్యం ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే ఇప్పటికి 20 నెలలు గడిచాయని, 20 నెలల్లో తమ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా టీడీపీలో చేరారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో దెబ్బతిని ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అక్కడ నెగ్గిన ఒకే ఒక కార్పొరేటర్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతుండటం.. టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబల్లి దయాకర్ రావు, ప్రకాష్‌గౌడ్‌లు ఇప్పటికే చేరడంతో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు.

అక్కడ మిగిలేది రేవంత్ రెడ్డి ఒక్కడేనని, అతనూ ఎంతో కాలం ఇమడలేడన్నారు. ఇంతటి బలహీనమైన స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై విష ప్రచారం మొదలు పెట్టిందన్నారు. ‘జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే మాకు ప్రాణం. ఆయన ఆరోప్రాణమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన కోసం ప్రాణాలను ఫణంగా పెడతామ’ని ఆయన వివరించారు. 

నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం
ఎస్‌బి అంజద్‌బాషా,  కడప ఎమ్మెల్యే
కడప కార్పొరేషన్ :  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా నైతిక విలువలున్నవారేనని, ఏ ఒక్కరూ పార్టీ మారే అవకాశం లేదని కడప శాసన సభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయి ఒక్క సీటుకు పరిమితమైన నేపథ్యంలో చంద్రబాబు ఈ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని, మొన్న ఒకరు, నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారన్నారు. మిగతావారు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

 ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో టీడీపీ భూస్థాపితమయ్యిందన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ర్పచారం చేయడం దారుణమన్నారు. దివంగత వైఎస్‌ఆర్ ముస్లిం, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఎంతో మేలు చేశారని, వైఎస్ జగన్ నాయకత్వంపై ఎమ్మెల్యేలందరికీ అపారమైన నమ్మకం ఉందని, ఏ ఒక్కరూ పార్టీ మారే అవకాశం లేదని కొట్టిపారేశారు.

పరువు కోసం టీడీపీ పాట్లు
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి,  ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
రాయచోటి : తెలంగాణ లో తుడిచి పెట్టుకుపోతే దిక్కుతోచక పరువు నిలుపుకోడానికి టీడీపీ ముఖ్యనేతలు మైండ్ గేమ్ మొదలు పెట్టారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు-నోటు వ్యవహారంలో చిక్కుకుని, చివరికి అక్కడి సీఎం కేసీఆర్‌తో రాజీ అయిన విషయం సామాన్యులకు సైతం అర్థమవుతోందన్నారు.

అక్కడ టీడీపీ తుడిచి పెట్టుకుపోతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నట్లు ఎల్లో మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెప్పారు. అయితే టీడీపీ మునిగిపోయే నావ అని, ఎవరూ ఆ పార్టీవైపు కన్నెత్తి చూసే ప్రసక్తేలేదన్నారు. కాబోయే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని, రాష్ట్ర అభివృద్ది ఆయనతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారన్నారు. మరో వైపు క్రి ష్ణయ్యతో బీసీ ఉద్యమం చేయించడం ఆయనకే చెల్లిందన్నారు.

రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, వృద్ధులు.. ఇలా అందరినీ మోసగించిన పార్టీలో ఎవరు చేరుతారని వారు ప్రశ్నించారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ ఎస్సీలను అవమానించడం దారుణం అన్నారు. అలాంటి సీఎం అసెంబ్లీలో అంబేడ్కర్‌ను అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement