'దమ్ముంటే గెలువు.. గులాంగిరీ చేస్తా'
హైదరాబాద్: టీడీపీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా కొనసాగుతారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ తలసానికి మంత్రిగా కొనసాగే హక్కు లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...తలసాని రాజీనామా చేశారని గవర్నర్ను తప్పుదోవ పట్టించారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎలాంటి లేఖలైనా స్పీకర్ నుంచే అసెంబ్లీ కార్యదర్శికి వెళతాయని, తలసాని 420 అని ఇప్పటికే అర్థమైందని, ఈ వ్యవహారంపై సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.
గవర్నర్ ఇకనైనా తలసాని శ్రీనివాస్ యాదవ్పై చర్యలు తీసుకుని ఆ పదవికి వన్నె తేవాలని అన్నారు. అలాగే తలసాని భవిష్యత్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తలసాని, కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, గవర్నర్ నలుగురూ ముద్దాయిలే అని ఎర్రబెల్లి వ్యాఖ్యలు చేశారు. 'దమ్ముంటే రాజీనామా చేసి గెలువు...నీకు గులాంగిరీ చేస్తా' అంటూ ఎర్రబెల్లి సవాల్ విసిరారు.
కాగా సార్వత్రిక ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. మంత్రిగా మంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్లే ముందు తలసాని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ తన రాజీనామా లేఖను చూపించారు. ఆ లేఖను స్పీకర్‌కు పంపిస్తున్నట్లు ప్రకటించారు.
ఆయనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ తన రాజీనామా లేఖ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పేవారు. కానీ, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి సమాచారహక్కు చట్టం ద్వారా సేకరించిన అధికారిక సమాచారం మేరకు అసలు తలసాని ఎలాంటి రాజీనామా లేఖ రాయలేదని తేలింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి కార్యాలయం తమకు తలసాని లేఖ అందలేదని ప్రకటించింది. దీంతో తలసాని రాజీనామా వ్యవహారం ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.