పెనువిషాదం
పెనువిషాదం
Published Wed, Aug 3 2016 9:43 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృత్యువాత
బంధువు మరణించడంతో చూసేందుకు వెళ్లగా ఘటన
పెదతుమ్మిడిలో విషాద చాయలు
పెదతుమ్మిడి(బంటుమిల్లి) :
తమ బంధువు మరణించగా, చూసేందుకు వెళ్లిన ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు... పెదతుమ్మిడి గ్రామానికి చెందిన గొర్ల భూలక్ష్మి(50) అనారోగ్యం కారణంగా బుధవారం మరణించారు. భూలక్ష్మి మృతదేహాన్ని చూసేందుకు అదే గ్రామంలో నివసించే ఆమె బంధువు గాలం వీర్రాజు(30) వెళ్లాడు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులు వచ్చే వరకు భూలక్ష్మి మృతదేహాన్ని జాగ్రత్తగా ఉంచేందుకు ముదినేపల్లి మండలం శింగరాయపాలెం నుంచి మార్చురీ బాక్స్ తీసుకొచ్చారు. ఆ బాక్స్‌ను స్థానికులతో కలసి వీర్రాజు లోపల పెట్టాడు. ఆ తర్వాత కూడా అతను అక్కడే మార్చురీ బాక్స్‌పై చేయి వేసి నిలుచున్నాడు. మార్చురీ బాక్స్ వైర్లు సక్రమంగా కలపకుండానే విత్యుత్ స్విచ్ వేయడంతో వీర్రాజు షాక్‌కు గురయ్యాడు. అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఈ విషయం తెలియడంతో అతని భార్య, తల్లి సొమ్మసిల్లిపడిపోయారు. వీర్రాజుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. గ్రామ సర్పంచ్ సంపూర్ణ భర్త బొల్లా దుర్గాస్వామి తదితరులు వీర్రాజు కుటుంబ సభ్యులను పరామర్శించి రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బందరు తరిలించారు.
Advertisement
Advertisement