ఆ రాత్రి ఏం జరిగింది..? | youth suicide case mystery in Ananthapur district | Sakshi
Sakshi News home page

ఆ రాత్రి ఏం జరిగింది..?

Published Mon, Jan 25 2016 9:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఆ రాత్రి ఏం జరిగింది..? - Sakshi

ఆ రాత్రి ఏం జరిగింది..?

► నరసాపురంలో యువకుడి అనుమానాస్పద మృతి
► డబ్బు కోసం వదినకు మరిది వేధింపులు
► తెల్లవారే సరికి ఉరికి వేలాడిన నిందితుడు
► అనుమానాలకు బలం చేకూరుస్తున్న గాయాలు


అనంతపురం: పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం తెల్లవారుజామున కలకలం రేగింది. గ్రామానికి చెందిన పవన్‌కుమార్(28) అనుమానాస్పద స్థితిలో మరణించడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడన్న సమాచారం క్షణాల్లో  అందరికీ తెలిసిపోయింది. అప్పుడప్పుడే నిద్ర నుంచి మేల్కొంటున్న గ్రామస్తులు ఏం జరిగిందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు.

మద్యానికి బానిసై...
ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసే పవన్‌కుమార్ అన్న ఓబులేసు, వదిన ఎరుకలమ్మతో కలసి జీవించేవాడు. ఏడాది కిందట అనారోగ్యంతో అన్న చనిపోయినా వదినతో కలసే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసయ్యాడు. మందు కోసం తెలిసిన వారి దగ్గర చిల్లర అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వదినను వేధించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటలకు డబ్బుల కోసం వదినతో గొడవకు దిగాడు. అంతటితో ఆగక ఆమెపై చేయి చేసుకున్నాడు.

పుట్టింటోళ్లకు విషయం తెలిపి..
మరిది పవన్‌కుమార్ చేతిలో దెబ్బలు తిన్న ఎరుకలమ్మ తన పరిస్థితిని తండ్రితో పాటు అన్నలకు ఫోన్‌లో తెలిపి విలపించింది.  అక్కడి నుంచి వారు బైక్‌లో వచ్చి రాత్రికి రాత్రే పవన్‌తో గొడవపెట్టుకున్నారు. ఆ తరువాత ఎరుకలమ్మను పొరుగింట్లో ఉంచి వెళ్లిపోయారు.
తెల్లారేసరికి ఉరికి వేలాడిన పవన్ ఆ రాత్రి ఏం జరిగిందో ఏమో గానీ తెల్లారేసరికి ఇంట్లోనే ఫ్యాన్‌కు  పవన్‌కుమార్ ఉరి వేసు కున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ శ్రీహర్ష తమ సిబ్బందితో కలసి గ్రామానికి చేరుకున్నారు.

మృతుని తల, వీపు, కాళ్లపై గాయాలుండడాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ కేసులో  పోస్టుమార్టం రిపోర్టు కీలకం కానుంది. పోలీ సులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజనిజాలు వెల్లడవుతాయని గ్రామస్తులు అంటున్నారు.  మృతుని వదిన ఎరుకలమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement