
ఆసుపత్రి నుంచి వైఎస్ జగన్ డిశ్చార్జి
ప్రతిపక్ష నేత ఆరోగ్యం మెరుగుపడిందన్న వైద్యులు
యూరిక్ యాసిడ్ మినహా రిపోర్టులన్నీ నార్మల్‌కు చేరుకున్నాయని వెల్లడి
హైదరాబాద్‌లోని ఇంటికి చేరుకున్న జగన్
సాక్షి, గుంటూరు/విమానాశ్రయం(గన్నవరం)/ హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. తనకు రెండు రోజులుగా వైద్య సేవలందించిన వైద్యుల బృందానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రోడ్డు మార్గంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ వెళ్లారు. జగన్ వెంట మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి తదితరులు ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు పోలీసులు బలవంతంగా జీజీహెచ్‌కు తరలించిన విషయం తెలిసిందే.
ఆసుపత్రికి చేర్చే సమయానికి జగన్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని గుర్తించిన వైద్యులు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. మంగళవారం 3 ప్లస్‌గా ఉన్న కీటోన్ బాడీస్ బుధవారానికి నెగటివ్‌కు చేరాయి. దీంతో జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చింది. ఒక్క యూరిక్ యాసిడ్ మినహా మిగతా రిపోర్టులన్నీ నార్మల్‌కు చేరుకున్నాయని గుర్తించింది. యూరిక్ యాసిడ్ అదుపులోకి వచ్చేందుకు మందులు వాడాలని జగన్‌కు సూచించామని, అందుకు ఆయన అంగీకరించారని వైద్యులు తెలిపారు. గుంటూరు జీజీహెచ్‌లో వైఎస్ జగన్‌ను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కలిశారు. జగన్‌ను చూసేందుకు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఆయన వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కొందరు మహిళలు ఆసుపత్రి నుంచి వెళ్తున్న జగన్‌కు గుమ్మడికాయతో దిష్టి తీశారు.
నిలకడగా జగన్ ఆరోగ్యం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రిపోర్టులన్నీ నార్మల్‌గా రావడంతో డిశ్చార్జి చేశామని ఆయనకు వైద్య చికిత్సలు అందించిన వైద్యుల బృందం ఇన్‌చార్జి డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. బుధవారం జగన్‌కు రెండుసార్లు యూరిన్ పరీక్ష నిర్వహించామని చెప్పారు. మంగళవారం యూరిన్‌లో కీటోన్ బాడీస్ 3 ప్లస్‌గా ఉన్నాయని, బుధవారం పరీక్షించగా నెగటివ్ రిపోర్టులు వచ్చాయని పేర్కొన్నారు. మంగళవారం బీపీ 130/80, పల్స్ రేట్ 55, బ్లడ్ షుగర్ 121, యూరిక్ యాసిడ్ 13.2, బరువు 72.8గా ఉన్నాయని, బుధవారం పరీక్షలు నిర్వహించగా బీపీ 120/80, పల్స్ రేట్ 72, బ్లడ్ షుగర్ 109, యూరిక్ యాసిడ్ 9.9, బరువు 72 కేజీలుగా ఉన్నారని వివరించారు. యూరిక్ యాసిడ్ మినహా మిగతా రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయన్నారు. యూరిక్ యాసిడ్ తగ్గడానికి కొంత సమయం పడుతుందని, మందులు ఇచ్చామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జగన్ బుధవారం లిక్విడ్స్‌తోపాటు ఘన పదార్థాలు తీసుకున్నారని తెలిపారు.
ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
గన్నవరం విమానాశ్రయం నుంచి బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ లోటస్‌పాండ్‌లోని ఇంటికి చేరుకున్నారు.