
బాధలు వింటూ.. భరోసా ఇస్తూ..
♦ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో సాగిన
వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర
♦ వాల్మీకి , ఫాదర్ ఫై విగ్రహాలకు పూలమాల వేసిన జగన్
♦ రోడ్డుప్రమాదంలో కార్యకర్త మృతి.... అండగా ఉంటానని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్
♦ ఐదోరోజు 3 కుటుంబాలకు పరామర్శ ..48.5 కి..మీ. యాత్ర
♦ మడకశిర నియోజకవర్గంలో నేడు 2 కుటుంబాలకు భరోసా
సాక్షిప్రతినిధి, అనంతపురం : రైతులు, రైతు కూలీల బాధలు, బాగోగులు తెలుసుకుంటూ ‘నేనున్నానని’ భరోసానిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదోరోజు రైతుభరోసా యాత్ర సాగింది. శనివారం కర్ణాటకలోని వెంకటాపురం నుంచి యాత్ర మొదలైంది. దొమ్మతమర్రి, చెరుకూరు మీదుగా పెద్దమంతూరు, రొప్పాల మీదుగా పి. కొత్తపల్లి చేరుకున్నారు. దారిలోని ప్రతీ గ్రా మంలో జగన్‌కు కోసం రైతులు, మహిళలు ఎదురు చూశారు. జగన్ కనిపించగానే ‘జై జగన్’అంటూ నినదించారు. కరచాలనం చేసేందుకు యువకులు పోటీపడ్డారు.
మహిళలు హారతి పట్టారు. పి. కొత్తపల్లి గ్రామంలోకి చేరుకోగానే గ్రామస్తులు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న లక్ష్మన్న కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అక్కడి నుండి దొమ్మతమర్రి చేరుకున్నారు. మడకశినియోజకవర్గం నేతలు జగన్‌కు స్వాగతం పలికారు. యువకులు బైక్‌ర్యాలీతో కాన్వయ్ వెంట వచ్చారు. అక్కడి నుండి ఆర్.అనంతపురానికి చేరుకున్నారు. ఫాదర్‌ఫై విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత చౌటిపల్లి మీదుగా మడకశిర చేరుకున్నారు. వాల్మీకి సర్కిల్‌లో జగన్‌ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.
వాల్మీకి విగ్రహానికి జగన్ పూలమాల వేశారు. దళితహక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం.ఆర్ హనుమంతు వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని, ఎస్సీ వర్గీకరణపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్‌కు వినతి పత్రం సమర్పించారు. తర్వాత జగన్ ప్రసంగించారు. చంద్రబాబు మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించారు. జిల్లాకు వరప్రసాది అయిన హంద్రీ-నీవాను పూర్తి చేసి ప్రతీఎకరాకు నీరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుండి టీడీపల్లి తండా మీదుగా టీడీపల్లి చేరుకున్నారు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న ఆనందప్ప కుటుంభ సభ్యులకు భరోసా ఇచ్చారు.
అక్కడి నుండి అమిదాలగొంది చేరుకున్నారు. ఇక్కడ కూడా మహిళలు భారీగా రోడ్డుపైకి తరలివచ్చారు. అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. చిన్నపిల్లలను ముద్దాడారు. మహిళలను దీవించారు. అక్కడి నుండి హెచ్‌ఆర్ పాళ్యం చేరుకున్నారు. ఇక్కడికి జగన్ రాగానే వర్షం మొదలైంది. వర్షంలోనూ మహిళలు, యువకులు జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు.
ఐదోరోజు యాత్రలో ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పేస్వామి, ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ మంత్రి నర్సేగౌడ్, రాష్ట్ర కార్యదర్శులు వైసీ గోవర్దన్‌రెడ్డి, మీసాల రంగన్న, సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖరరెడ్డి, కార్యదర్శి, వై.మధుసూదన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ శివకుమార్, జిల్లా కార్యదర్శి రంగేగౌడ్, డాక్టర్ శివప్రసాద్, జిల్లా నేత చవ్వారాజశేఖరరెడ్డి, సోమనాథరెడ్డి, మహిళనేత శ్రీదేవి పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి పరామర్శ:
రైతుభరోసాయాత్రకు వస్తూ రోడ్డుప్రమాదంలో రామాంజనేయులు అనే కార్యకర్త మృతి చెందారు. మోటర్‌సైకిల్‌పై వస్తున్న రామాంజనేయులు రోడ్డు పక్కన నెంబర్‌రాయిని ఢీకొట్టారు. తలకుపెద్ద గాయం కావడంతో మృతి చెందారు. మరో కార్యకర్త గాయపడ్డారు. విషయం తెలిసిన జగన్ మడకశిర ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రామాంజనేయులు మృతదేహనికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో బస చేశారు.
నేటి భరోసా యాత్ర ఇలా..
ఆరోరోజు రైతు భరోసా యాత్ర
వివరాలను ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ప్రకటించారు. ఉదయం మడకశిర నుంచి గుడిబండ మండలం దేవరహట్టి చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రంగప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఎస్‌ఎస్‌గుండ్లులో ఆత్మహత్య చేసుకున్న గిడ్డీరప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు.