వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో శనివారం నాలుగో రోజుకు చేరుకుంది
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా ఆయన కందుకూరు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఇచ్చిన హమీలను విస్మరించారు' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయ్యే నాటికి రాష్ట్రంలో రూ. 87,610 కోట్ల రుణాలున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు హామీతో రైతులు రుణాలు కట్టలేదనీ.. దాంతో రైతులపై రూ. 80 వేల కోట్ల వడ్డీభారం పడిందని ఆయన చెప్పారు.
చంద్రబాబు మాత్రం రుణమాఫీకి రూ. 7,300 కోట్లు మాత్రమే కేటాయించారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు కేటాయించిన డబ్బు వడ్డీకీ కూడా సరిపోలేదన్నారు. భారీ వర్షాలు పడ్డాకే చంద్రబాబు కరువు మండలాలు ప్రకటించారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీని బాబు విస్మరించారని ఆయన దుయ్యబట్టారు. పింఛన్లు సైతం కత్తిరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వకపోవడంపై లోకాయుక్తను ఆశ్రయిస్తామని, ఆధార్, రేషన్ కార్డుల ఆధారాలను లోకాయుక్తకు సమర్పిస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.