వైఎస్ జగన్ ఉదయించే సూర్యుడు: ఉప్పులేటి
విజయవాడ : తాను టీడీపీలో చేరతానంటు వస్తున్న వార్తలు అవాస్తవమని ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ తన చివరి శ్వాస వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ఆమె తెలిపారు. 'చంద్రబాబు అస్తమించే సూర్యుడు.. జగన్ ఉదయించే సూర్యుడు. భవిష్యత్ కావాలనుకునేవారు వైఎస్ఆర్ సీపీని వీడరు' అని ఉప్పులేటి కల్పన అన్నారు.
చివరి వరకూ జగన్తోనే: ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
ప్రకాశం జిల్లాలో తాము ఎవరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడటం లేదని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. వైఎస్ జగన్ వల్లే తాము గెలిచామని, చివర వరకూ జగన్తోనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఖాళీ అయిన విషయాన్ని దృష్టి మల్లించడానికే టీడీపీ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
నాపై దుష్ప్రచారం: ఎమ్మెల్యే ముత్యాలనాయుడు
తెలుగుదేశం పార్టీలో చేరతానంటు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ పార్టీ మారేంత నీతిమాలిన రాజకీయాలు చేయనని ఆయన తెలిపారు. చివరివరకూ వైఎస్ జగన్తోనే ఉంటానని ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.