ఎమ్మెల్యే కల్పనకు షాక్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు షాకిచ్చారు. ఆమె తనతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన లెక్కలన్నీ తప్పని నియోజకవర్గ నేతలు తేల్చేశారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండల కన్వీనర్లు స్పష్టం చేశారు. తాము ఉప్పులేటి కల్పన వెంట వెళ్లడం లేదని మొవ్వ, పామర్రు జడ్పీటీసీ సభ్యులు విజయశాంతి, పద్మావతి తెలిపారు.
కాగా.. చంద్రబాబు నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు పార్థసారథి మండిపడ్డారు. ఉప్పులేట కల్పన పార్టీ మారినా ఆమె వెంట ఎవరూ వెళ్లలేదని చెప్పారు. ఆమె చెప్పిన లెక్కలన్నీ అబద్ధాలేనని తెలిపారు. నిన్నటివరకు చంద్రబాబును తూర్పారబట్టిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు పచ్చ కండువా కప్పగానే చిలుక పలుకులు పలుకుతున్నారని విమర్శించారు. సర్వేలన్నీ తనకే అనుకూలమని చెబుతున్న చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికలకు సిద్ధపడతారా అని సవాలు చేశారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు చంద్రబాబు అపాయింట్‌మెంట్ దొరకడం లేదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా అనైతిక చర్యలు మానుకుని, ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని పార్థసారథి హితవు పలికారు.