ఆ దాడి చేసింది బీజేపీ, టీడీపీకి చెందినవాళ్లే
విజయవాడ: ఆవును దొంగిలించి, చర్మం వొలిచారన్న నెపంతో ముగ్గురు దళితులపై విచక్షణా రహితంగా దాడి చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. గోసంరక్షకుల ముసుగులో బీజేపీ, టీడీపీకి చెందినవారే దళితులపై దాడి చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. బుధవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడిన ఆమె.. ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా ప్రభుత్వంగానీ, అధికార పార్టీ నేతలుకానీ స్పందించకపోవడం దారుణమన్నారు. (అమలాపురంలో 'ఆవు'వివాదం: ఉద్రిక్తత)
'బీజేపీ, టీడీపీకి చెందినవారు కావాలనే దళితులను హింసించారు. వాళ్ల ఆవులు తప్పిపోయింది అబద్ధమని తెలిసింది. కొన్ని రాష్ట్రాల్లో గోవధపై నిషేధం ఉండొచ్చు. కానీ ఏపీలో లేదు. నిషేధం ఉన్నా, లేకున్నా గోసంరక్షకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దళితులపై దాడులు చేయడం దారుణం. ఇది ముమ్మాటికి బీజేపీ- టీడీపీల కుట్రే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న గిరిజన దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. డాన్స్ చేయడం కంటే దళిత, గిరిజనులకు బాబు చేసిన మేలు ఏదైనా ఉందా?'అని కల్పన ప్రశ్నించారు.
మమ్మల్నెవరూ ఏమీ చెయ్యలేరనే దైర్యంతో టీడీపీవారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, దాడి జరిగి రెండు రోజులైనా పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వవైఫల్యమేనని కల్పన వ్యాఖ్యానించారు.పలు ప్రజా సంఘాలు, వేదికలు బాధితులను పరామర్శించాయి. కానీ ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క టీడీపీ నాయకుడు కూడా దళితులను పట్టించుకోకపోడం దారుణమని అన్నారు.