వరంగల్: వరంగల్ ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వరద పరిస్థితులపై ఆరా తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వరద బాధితులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఆదుకోవాలని జగన్ సూచించారు. జనజీవనాన్ని వర్షాలు బాగా ఇబ్బంది పెట్టాయని, రహదారులు బాగా దెబ్బ తిన్నాయని జిల్లా అధ్యక్షులు జగన్‌కు వివరించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.