రానున్నది వైఎస్‌ఆర్ స్వర్ణయుగం
– ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు: ఏడాది పాటు కష్టపడితే వైఎస్‌ఆర్ స్వర‍్ణయుగం తథ్యమని పాణ్యం ఎమ్మెల్యే తెలిపారు. మంగళవారం స్థానిక పాతకల్లూరులోని శ్రీసాయిశ్రీనివాస గార్డెన్‌లో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన పాణ్యం నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ బూత్ కమిటీ కన్వీనర్ ఆధ్వర్యంలో నవరత్నాల గురించి ప్రతి ఇంటికి తెలియజేయాలన్నారు.
వైఎస్‌ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలన్నారు. వైఎస్‌ఆర్ హయాంలోని సంక్షేమ పథకాలును వివరిస్తూ, చంద్రబాబు సాగిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని వర్గాలను ఎలా మోసం చేశారో తెలియజేయాలన్నారు. రాజన్న ఆశయసాధనకు శ్రమిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట ప్రతిఒక్కరూ నడిచేలా చైతన్యం చేయాలన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాంపులను ప్రోత్సహించడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అధికారంలోకి వచ్చింది ప్రజలకు సేవలందించడానికే గాని పార్టీ ప్రయోజనాలకు కాదని వైఎస్సార్ చెప్పేవాడని గుర్తు చేశారు. జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయని గుర్తుచేశారు.
ఓర్వకల్లు మండల నాయకుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేసి చూపించిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కిందన్నారు. మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, కల్లూరు అర్బన్ కన్వీనర్ బెల్లం మహేశ్వరరెడ్డి, పాణ్యం ఎంపీపీ చిన్న సంజీవ, పాణ్యం మండల కన్వీనర్ పాలం చంద్రశేఖరరెడ్డి, గడివేముల మండల కన్వీనర్ సత్యనారాయణ రెడ్డి ప్రసంగించారు. అనంతరం బూత్ కమిటీ కన్వీనర్‌లకు వైఎస్‌ఆర్ కుటుంబం కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఓర్వకల్లు, గడివేముల, కల్లూరు అర్బన్, రూరల్, పాణ్యం మండలాల బూత్ కమిటీల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.