జేసీకి మతిస్థితిమితం లేదు | ysrcp fires on tdp mp jc | Sakshi
Sakshi News home page

జేసీకి మతిస్థితిమితం లేదు

Published Tue, Jan 3 2017 11:18 PM | Last Updated on Fri, Aug 10 2018 7:07 PM

జేసీకి మతిస్థితిమితం లేదు - Sakshi

జేసీకి మతిస్థితిమితం లేదు

అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మతిస్థిమితం లేదని, స్వయంగా ముఖ్యమంత్రి సభలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వే‍శ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ప్రొటోకాల్‌  పాటించలేదన్నారు. స్వయంగా సీఎం జిల్లా నాయకులను పరిచయం చేయడం, అధ్యక్షత వహించడం, వ్యాఖ్యాతగా, ఉపన్యాసకుడిగా వ్యవహరించడం ఆయన నియంతృత్వ పోకడను గుర్తు చేస్తోందన్నారు.

స్థానిక దళిత శాసనసభ్యుడు ఐజయ్య ప్రొటోకాల్‌ ప్రకారం అధ్యక్షత వహించాల్సి ఉందన్నారు. పైగా ఆయన మాట్లాడుతుంటే మైకు లాక్కోవడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే ఎందుకు భయపడ్డారని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులను ప్రారంభించింది వైఎస్‌ అని గుర్తు చేశారు.జలయజ్ఞం పేరిట రాష్ట్రంలో 80 ప్రాజెక్టులు ప్రారంభించి, కోటి ఎకరాలకు నీరు తీసుకురావాలని పరితపించిన మహా నేత వైఎస్‌ఆర్‌ అని అన్నారు.పోలవరం కుడికాలువ వైఎస్‌ హయాంలో 140 కిలో మీటర్లు తవ్వారన్నారు. హంద్రీ–నీవాలో మీ చరిత్ర ఏమిటో గుర్తు చేసుకోవాలని అన్నారు. రెండుసార్లు శంకుస్థాపన చేసి తొమ్మిదేళ్లు కాలం గడిపారన్నారు. ప్రతిపక్షం మాట్లాడుతుంటే  ఎందుకు వణికిపోతున్నారని  ప్రశ్నించారు.

జేసీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి వికృత ఆనందం పొందారన్నారు. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడడం ఆయన వయసుకు తగదని హితవు పలికారు.మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాటలు అసహించుకునేలా ఉన్నాయన్నారు. వైఎస్‌ హయాంలో ప్రారంభమైన నీటి ప్రాజెక్టులను మిగులు పనులను ప్రారంభించి, తానే చేశానని సీఎం చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.  ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకుని జేసీ మాట్లాడడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఎంత దిగిజారిపోయారో అర్థమవుతుందన్నారు.

జేసీకి మతిస్థిమితం లేదా? లేకుండా చంద్రబాబుతో పనులు చేయించుకునేందుకు ఇలా మాట్లాడారా? అనే అనుమానం వస్తోందన్నారు. ఆయన మాటలతో రెడ్డి కులస్తులే కాదు అన్ని కులాల వారూ బాధపడుతున్నారన్నారు. ఆయన మాటల వెనుక సీఎం ఉన్నారనేది స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా జేసీ తన మాటలను వెనక్కు తీసుకోవాలన్నారు. లేదంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 70 ఏళ్ల వయసులో ఏం ఆశించి పార్టీ మారావని జేసీని ప్రశ్నించారు. సమావేశంలో మైనార్టీ విభాగం నాయకులు ముక్తియార్‌ పాల్గొన్నారు.

జేసీ రాజకీయ వ్యభిచారి
అనంతపురం : ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ వ్యభిచారి అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, విద్యార్థి విభాగం నాయకులు ధ్వజమెత్తారు. ఆయన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, నగర అధ్యక్షుడు ఎల్లుట్ల మారుతీనాయుడు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల కోసం పని చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు.

ఇది జీర్ణించుకోలేని జేసీ దివాకర్‌రెడ్డి మతిభ్రమించి, తన వ్యాపారాల కోసం ముఖ్యమంత్రి వద్ద మెప్పుపొందేందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.  కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు రఫీ, జిల్లా ప్రధానకార్యదర్శులు లోకేష్‌శెట్టి, సుధీర్‌రెడ్డి, యుజవన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, నూర్‌బాషా, అనిల్, హరి, షారుఖాన్, యూపీ నాగిరెడ్డి, మార్కెట్‌మల్లి పాల్గొన్నారు.

జేసీకి పిచ్చి ముదిరింది!
పెనుకొండ :
ఎంపీ జేసీ దివాకరరెడ్డికి పిచ్చి ముదిరిందని, ఇలాంటి వ్యక్తి పెద్దల సభకు ఎలా ఎన్నికయ్యాడో అర్థం కాలేదని  వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎంతో కలసి పాల్గొన్న ఎంపీ జేసీ.. ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆయనకు పిచ్చి ముదిరిందనడానికి నిదర్శనమన్నారు. గౌరవహోదాను మరచి, ప్రతిపక్షనేత జగన్‌పై వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ముఖ్యమంత్రిని కాకాపట్టడానికేననిపిస్తోందన్నారు.

అనంతపురంలో గతంలో ఇలానే మాట్లాడినప్పుడు మేధావులు, ప్రజలు, విద్యావంతులు జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారన్నారు. హోదాకు, వయసుకు తగ్గట్టుగా జేసీ వ్యవహరించాలని, లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. జిల్లాలో సైతం జేసీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోవడంతో మానసిక సైకోగా మారాడని శంకరనారాయణ విమర్శించారు. సమావేశంలో బీసీసెల్‌ జిల్లా కార్యదర్శి గుట్టూరు శ్రీరాములు, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ నాగలూరుబాబు తదితరులు పాల్గొన్నారు.

జేసీ రాజకీయాలకు పనికిరాడు
అనంతపురం సెంట్రల్‌ :
జేసీ దివాకర్‌రెడ్డికి వయస్సు మీద పడుతోంది..ఆయనకు అపార రాజకీయ అనుభవం ఉందని అంటుంటారుగానీ బహిరంగ సమావేశాల్లో ప్రతిపక్షనేతపై ఇలా వ్యాఖ్యానించడాన్ని ప్రజలు హర్షించరు అని పీసీసీ అధికార ప్రతినిధి రమణ అన్నారు.ఇటీవల కాలంలో జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన రాజకీయాలకు పనికిరాడు అని అర్థమవుతోందన్నారు.
 
ఎంపీ జేసీ దిష్టిబొమ్మ దహనం
ఎస్కేయూ :
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం వద్ద సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. వైఎస్‌ఆర్‌ విద్యార్థి విభాగం నాయకులు మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వయసుమళ్లి, పిచ్చిముదిరి ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని రీతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి విభాగం అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి, క్రాంతి కిరణ్, జయచంద్రారెడ్డి, అమర్‌నాథ్, రాంబాబు, హేమంత్‌కుమార్, మహేంద్ర, శ్రీనివాసరెడ్డి, నాగేంద్ర, చార్లెస్, ప్రతాప్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, లోకేష్, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement