![రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/41487181110_625x300.jpg.webp?itok=LpODBNtg)
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన
– రాయలసీమ అభివృద్ధిని విస్మరించారు
– ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
– ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పిలుపు
– అట్టహాసంగా వెన్నపూస గోపాల్‌రెడ్డి నామినేషన్
అనంతపురం అర్బన్ : రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని, రాయలసీమ అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ అమలు చేయని ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) నుంచి పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎన్‌జీవో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు వెన్నపూస గోపాల్‌రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
ముందుగా అనంతపురం రెండో రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గోపాల్‌రెడ్డికి పార్టీ బీఫారంను ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తదితరులు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఒకటో రోడ్డులోని రాఘవేంద్ర స్వామి ఆలయానికి చేరుకుని.. పూజలు చేశారు. అక్కడి నుంచి సుభాష్ రోడ్డులోని మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు చేరుకుని.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కోన శశిధర్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేకుండా.. అందుకు భిన్నంగా కేంద్రానికి దాసోహమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్న గళాలను అణదొక్కేందుకు చూస్తోందన్నారు. రాష్ట్రానికి హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయఽని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెన్నపూస గోపాల్‌రెడ్డిని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు వేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ..ప్రస్తుతం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, యువత వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటు వేసి ప్రభుత్వానికి చెంపపెట్టు వంటి తీర్పు ఇవ్వాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ యువతకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేయాలన్నారు.
రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్‌ను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేసి బుద్ధి చెప్పాలన్నారు. కదిరి సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని విస్మరించిన టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్ మాట్లాడుతూ మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపలేదన్నారు.
మాజీ మేయర్ రాగేపరశురాం మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, మడకశిర సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వెన్నపూస రవీంద్రారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, బుర్రా సురేష్‌గౌడ్, గౌస్‌బేగ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, కదిరి నియోజకవర్గ నాయకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, కార్పొరేటర్ గంగన హిమబిందు, విద్యార్థి విభాగం నాయకులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, బండి పరశురాం తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు
– వెన్నపూస గోపాల్‌రెడ్డి
చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. హామీలను అమలు చేయకుండా దగా చేసింది. ముఖ్యంగా యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించలేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. కేవలం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తోంది. కేంద్రం వద్ద సాగిలబడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు రైల్వే జోన్ రాకుండా చేసింది. మహిళా సాధికార సదస్సు నిర్వహించినా.. మహిళా రిజర్వేషన్, హింసపై డిక్లరేషన్ ఇవ్వలేదు. రెండున్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోవడమే ధ్యేయంగా పని చేస్తోంది. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, యువత నాకు ఓటు వేసి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి.