
ఏం సాధించారని మహానాడులో సంబరాలు
►తండ్రిలాంటి మామనే మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
►అది అమరావతి కాదు భ్రమరావతి
►ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ప్లాంటుపై మహానాడులో తీర్మానం చేయాలి
►మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్
కడప కార్పొరేషన్: తెలుగుదేశం ప్రభుత్వం మూడేళ్ల కాలంలో ఏం సాధించిందని మహానాడులో సంబరాలు చేసుకుంటున్నారని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రశ్నించారు. కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సోమవారం జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రానికి ఒక్క పెద్ద పరిశ్రమ రాలేదని, ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయిందని, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకొనేవారే లేరన్నారు. జిల్లా టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా, కడప స్టీల్‌ప్లాంటు కావాలని మహానాడులో తీర్మానాలు చేయించాలని సవాల్ విసిరారు. ఇది ఒరిజినల్ టీడీపీ కాదని, 1982లో ఏ సిద్దాంతాలు, ఆశయాలతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో వాటికి ఎప్పుడో తిలోదకాలిచ్చేశారని ఎద్దేవా చేశారు. చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్లు నందమూరి వారి పార్టీ నారా వారి వశమైందని అభివర్ణించారు. ఆనాడు ఎన్టీఆర్ మృతదేహం వద్దకు వచ్చే ధైర్యం కూడా లేని చంద్రబాబు, విధిలేని పరిస్థితుల్లోనే హరికృష్ణను మంత్రిని చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని చెప్పిన బాబుకు ఆయన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. తండ్రిలాంటి మామనే మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసం చేయడం లెక్కకాదన్నారు. లోకేష్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాదన్నారు.
అమరావతి రాజధాని పేరుతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని, అక్కడ నిలబడేందుకు చెట్టుగానీ, తాగేందుకు నీరుగానీ లేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక, వర్షపాతం కరువై పంట నష్టాలతో రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. పసుపు రైతులకు క్వింటాకు రూ.10వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉల్లి, టమోటా రైతుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. రైతులను నట్టేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. భేషరతుగా రైతు రుణమాఫీ చేస్తానని, బంగారు ఆభరణాలను అసలు, వడ్డీ కట్టి విడిపిస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని దారుణంగా మోసం చేశారని దుయ్యబట్టారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పి ఐదు రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ఖరీఫ్, రబీలో రూ.4వేలు విలువగల ఎరువులను రైతులకు ఉచితంగా అందించాలని, ఈ మేరకు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలను ప్రజలకు, పార్టీ శ్రేణులకు వివరించడానికే ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జులై 8,9 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని, మే 25 నుంచి జూన్ 5వ తేదీలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు పూర్తవుతాయన్నారు. జూన్ 19,20,21 తేదీలలో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని వివరించారు.