- మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే)
గుంటూరు : 2018 చివర నాటికి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తామని ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులు రెండు సంవత్సరాల కోసం తాత్కాలిక రాజధానికి కోట్లరూపాయల నిధులను దుబారా చేయడమెందుకని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడుతూ... ఓ వైపు ఆర్థిక లోటులో ఉన్నామంటూ బీద అరుపులు అరుస్తున్న ప్రభుత్వం తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో రూ. 4 నుంచి రూ. 5 వందల కోట్లు ఖర్చుపెట్టాల్సిన అవసరమేంటన్నారు.
20 ఎకరాలలో తాత్కాలిక రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి దానిని ఇప్పుడు ఆకస్మికంగా 45 ఎకరాలకు పెంచడం వెనుక పెద్ద అవినీతి చోటు చేసుకుందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా ఓవైపు రాజధాని నిర్మాణం శరవేగంగా జరుపుతామనే చెబుతూనే మరలా తాత్కాలిక రాజధాని పేరుతో ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక వేళ ఇక్కడ నుంచే పరిపాలన సాగించాలనుకుంటే గుంటూరు, విజయవాడలలోని ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్శిటీలను వినియోగించుకోవచ్చు కదా అన్నారు.
శాశ్వత నిర్మాణాలకే ఎంత ఖర్చు చేసినా ప్రస్తుత పరిస్థితులలో చదరపు ఆడుగుకు గరిష్టంగా రూ 1800కు మించి ఖర్చు కాదని, ఇక తాత్కాలిక నిర్మాణాలకు ఎంత ఎక్కువ ఖర్చు చేసినా రూ. 1000 నుంచి 1200కు మించి ఖర్చుకాదని, తాత్కాలిక రాజధాని నిర్మాణం కోసం బిడ్లు వేసిన సంస్థలకు మాత్రం ప్రభుత్వం రూ.3,500 నుంచి 4 ,000 కేటాయిస్తున్నారంటే వారి నుంచి ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారాయణలు వాటాలు పంచుకోవడానికేనని విమర్శించారు.
జూన్ నాటికి ఉద్యోగులను తరలిరావాల్సిందేనని చెబుతున్న ముఖ్యమంత్రి, మంత్రులు వారికి ముందుగా మౌలిక వసతులను కల్పించి అప్పడు తరలించాలని సూచించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు పుల్లారావు, నారాయణలు తమ విధానాలను మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజాధనం దోపిడీని మానుకుని ప్రజా రాజధాని నిర్మాణం కొనసాగించాలని వారికి ఆర్కే హితవు పలికారు.
తాత్కాలిక రాజధాని నిర్మాణం దోపిడీకే
Published Fri, Feb 12 2016 7:56 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement