చంద్రబాబుది నియంత పాలన : ఎమ్మెల్యే ఆర్కే | ysrcp mla ramakrishna reddy fires on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది నియంత పాలన : ఎమ్మెల్యే ఆర్కే

Published Thu, Dec 3 2015 6:54 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

చంద్రబాబుది నియంత పాలన : ఎమ్మెల్యే ఆర్కే - Sakshi

చంద్రబాబుది నియంత పాలన : ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: భూముల సర్వేను లైసైన్స్‌డ్ సర్వేయర్లకు అప్పగిస్తే భూ వివాదాలు మరింత పెరగడంతో పాటు అవినీతి విచ్చలవిడిగా మారే అవకాశం ఉందని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని తన కార్యాలయంలో ఆర్కే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లైసైన్స్‌డ్ సర్వేయర్ల కు సర్వే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు.

 

ముఖ్యంగా రాజధాని ప్రాంత పేదలకు చెందిన లంక అసైన్డ్‌భూములను కొట్టేసేందుకే ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలో భాగమే లెసైన్స్‌డ్ సర్వేయర్లను ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. అధికారపార్టీ నేతలు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటికే అక్రమాలు చేయిస్తూ రెవెన్యూ కార్యాలయాల్లో దళారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మాటవినని అధికారులను సైతం బదిలీ చేయిస్తామని, అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తామంటూ బెదిరిస్తూ.. పనులు చేయించుకుంటూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక సర్వేలను తమ ఇష్టానుసారంగా నిర్వహించి భూములు కాజేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

 

కీలకమైన రెవెన్యూ శాఖలో నూతన రిక్రూట్‌మెంట్‌తో ఉద్యోగాలను భర్తీచేసి ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. ఇలా ప్రైవేటు వ్యక్తులకు సర్వే బాధ్యతలను అప్పగించి అవినీతిని ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన రెవెన్యూ మంత్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు రెవెన్యూశాఖలో నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రివర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అవేమీ పట్టించుకోని ముఖ్యమంత్రి నియంతపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలగానే లెసైన్స్ సర్వేయర్లతో అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నందున వెంటనే జీవోను ఉపసంహకరించుకోకపోతే కోర్టులో పిల్ వేస్తానని స్పష్టం చేశారు.

తన సామాజికవర్గానికి దోచిపెట్టేందుకే..
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుండగా, అది కాదని అధికార యంత్రాంగాన్ని హడావుడిగా తరలించాలని అనుకోవడం వెనుక చంద్రబాబు అద్దె నివాసాల పేరుతో తన అనుకూల సామాజిక వర్గానికి దోచిపెట్టేందుకేనని విమర్శించారు. అందులో భాగంగా తనకు అక్రమ కట్టడమైన అతిథి గృహాన్ని అద్దెకు ఇచ్చిన వారికి బహుమతిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు వున్న అపార్ట్‌మెంట్లు, విల్లాలకు భారీ అద్దెలు చెల్లించి దోచిపెడుతున్నారని ఆర్కే ఆరోపించారు. ఉద్యోగులను తరలించాలని విజయవాడ చుట్టుపక్కల అద్దెలకు తీసుకుంటున్న అపార్ట్‌మెంట్లు, అతిథి గృహాలు అన్ని తన బినామీలు, సామాజిక వర్గానికి చెందినవేనని, వాటికి అత్యధిక అద్దెలు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement