యువభేరి
ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ జగన్ పోరు
- కర్నూలు వేదికగా యువతకు దిశా నిర్దేశం
– నేటి ఉదయం 10 గంటలకు వీజేఆర్ ఫంక‌్షన్ హాల్‌లో కార్యక్రమం
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం
- హోదా ఆకాంక్షను చాటాలని వైఎస్‌ఆర్‌సీపీ నేతల పిలుపు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో నేడు(25వ తేదీ) కర్నూలులో యువభేరి జరగనుంది. నేటి ఉదయం 10 గంటలకు గుత్తిరోడ్డులోని వీజేఆర్ ఫంక‌్షన్ హాల్‌లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. అంతేకాకుండా వారితో మాటామంతీ నిర్వహిస్తారని పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయమే బయలుదేరి పంచలింగాల చెక్‌పోస్టు వద్దకు 9 గంటలకు చేరుకుంటారని పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. అక్కడి నుంచి నేరుగా వేదికకు చేరుకుంటారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను తెలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి ప్రత్యేక హోదా ఆకాంక్షను చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
హోదాతోనే జిల్లాకు పరిశ్రమలు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే మొత్తంగా రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకించి జిల్లాలో భారీ భూ బ్యాంకుతో పాటు నీటి వసతి కూడా ఉండటంతో పరిశ్రమలకు జిల్లా కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఉన్న సహజ వనరులన్నీ పూర్తిగా వినియోగంలోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటున్నారు. పత్తి సాగు ఎక్కువగా ఉన్నందున టెక్స్‌టైల్ పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా ఉంటుందని.. సున్నపురాయి గనుల అపార నిల్వల నేపథ్యంలో సిమెంటు పరిశ్రమలు మరిన్ని క్యూ కడతాయని పరిశ్రమలశాఖ అధికారులే అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్, అటు బెంగళూరుతో పాటు రాష్ట్ర రాజధాని అమరావతికి కర్నూలు జిల్లా మధ్యలో ఉండటం వల్ల అభివృద్ధికి కేంద్రంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశ్రమలశాఖ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. తద్వారా జిల్లాలో ఉపాధి లేక వలసలు లేకుండా పోతాయని.. ప్రధానంగా చదువుకున్న యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు(మేథోవలస) వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని వాదిస్తున్నారు.
ఊరిస్తున్నా....!
జిల్లాలో భారీ భూబ్యాంకు నేపథ్యంలో అనేక పరిశ్రమలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చాయి. అయితే, ఇప్పటివరకు పెద్దగా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. వస్తామని ఊరిస్తూనే ఉన్నప్పటికీ పెద్దగా పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తే జిల్లాకు పెట్టుబడుల వరద పారుతుందని నిపుణులు అంటున్నారు. యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సిమెంటు కంపెనీలతో పాటు డీఆర్‌డీవో, ఎన్‌ఎఫ్‌సీతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలు ఏమాత్రమూ ఆలస్యం చేయకుండా తమ యూనిట్లను నెలకొల్పుతాయని అధికారవర్గాలూ పేర్కొంటున్నాయి. తద్వారా కేవలం కర్నూలు జిల్లాలోనే లక్ష కోట్లకు పైబడి పెట్టుబడులు తరలివచ్చి.. 4–5 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఈ వర్గాల ప్రాథమిక అంచనా. అంతేకాకుండా 65 రకాల సబ్సిడీలు రైతాంగానికి కూడా అందుతాయని ఈ వర్గాలు తెలిపాయి. మొత్తంగా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కీలకమనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.