బలి.. తప్పలేదు మరి!
బలి.. తప్పలేదు మరి!
Published Sun, Jul 9 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 3:38 PM
- జెడ్పీ చైర్మన్ పదవికి నామన రాజీనామా
- అదే బాటలో వైస్ చైర్మన్
- కలెక్టర్‌కు రాజీనామా లేఖల అందజేత
కాకినాడ సిటీ : స్వార్థ ప్రయోజనాల కోసం వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన నాయకుడి కోసం.. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న నేతలు బలవక తప్పలేదు. వైఎస్సార్ సీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు, అక్కడ అదే పార్టీ నుంచి జెడ్‌పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన నవీన్ టీడీపీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు వేళ కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా నవీన్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు టీడీపీ వ్యూహం రచించింది. ఇందులో భాగంగా జెడ్‌పీ చైర్మన్ నామన రాంబాబును బలవంతంగా ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అనంతరం ఆయనను జెడ్‌పీ పీఠం నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో నామన తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కలెక్టరేట్‌లో కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు అందజేశారు. అదేవిధంగా జెడ్‌పీ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్ కూడా తన పదవికి రాజీనామా చేసి ఆ పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
పార్టీ ఆదేశానుసారమే..
ఈ సందర్భంగా నామన మీడియాతో మాట్లాడుతూ, మూడేళ్లుగా జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. పార్టీ ఆదేశానుసారం పదవికి రాజీనామా చేశానని, తనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్‌పీటీసీ సభ్యులు, అధికారులు ఎంతగానో సహాయ సహకారాలు అందించారన్నారు. వేసవిలో నీటికొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో 42 ప్రాజెక్టులకు తాత్కాలిక మరమ్మతులు చేయించి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూశామని చెప్పారు. మారుమూల గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేశానన్నారు. తనకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులుకు కృతజ్ఞతలు తెలిపారు. తనను టీడీపీ జిల్లా అధ్యక్షునిగా నియమించడం అదృష్టంగా భావిస్తున్నానని, పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.
Advertisement