
సాక్షి, కాకినాడ: జన్మభూమి సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానగా మారి ఆ పార్టీలో అసమ్మతికి తెరలేపింది. ఇప్పటికే ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న టీడీపీ కేడర్ ఇప్పుడు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్ల్లగక్కుతుండడం పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. ఇది కాస్తా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌కు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో ఇప్పటికే అనపర్తి జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి (దొరబాబు) పార్టీ కార్యకలాపాలకు చాలాకాలంగా దూరమయ్యారు.
ఇటీవల జరిగిన జన్మభూమి సభలకూ ఆయన గైర్హాజరయ్యారు. వారిరువురి మధ్యా ఎమ్మెల్యే తండ్రి మూలారెడ్డి కుదిర్చిన సయోధ్య ఎంతోకాలం నిలువలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పైగా ఎమ్మెల్యేపై అలకబూనిన జెడ్పీటీసీ సభ్యుడితో పాటు మరికొందరు నేతలు, కార్యకర్తలు ఇటీవల రహస్యంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, అదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఓ వైపు వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న అంతర్గత వివాదం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకుండా ఆయన బంధువర్గం నుంచి కూడా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని టీడీపీ వర్గాల సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి పదవిలో ఉన్న బంధువు ప్రస్తుతంగా అంతర్గతంగా నెలకొన్న వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులుకదుపుతున్నారంటున్నారు. ఈ వ్యవహారం అనపర్తి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందోనన్న ఆసక్తి ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment