అధికార పగ్గాలు మీ చేతికే వస్తాయని సర్వేలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నవేళ... పర్యవసానంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబుకుతున్నవేళ క్షమాపణ చెప్పడంలాంటి అంశాలు చర్చలోకి చొరబడటం కమలనాథులకు కాస్తంత బాధగానే ఉంటుంది. కానీ 2002లో జరిగిన గుజరాత్ ఊచకోత ఘటనలపై ఈమధ్యకాలంలో రెండుసార్లు సమాధానం చెప్పుకోవాల్సిరావడం, క్షమాపణ ప్రస్తావన రావడం ఆ పార్టీకి తప్పలేదు. తాజాగా ఎలాంటి తప్పు జరిగినా క్షమాపణ కోరడానికి తాము సిద్ధమని పార్టీ మైనారిటీ మోర్చా సదస్సునుద్దేశించి మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మొన్నటి డిసెంబర్‌లో తొలిసారి గుజరాత్ మారణహోమంపై ఒక బ్లాగ్‌లో తన మనోవేదనను వ్యక్తపరిచారు. ఆనాటి ఘటనలపై తన భావాలు వ్యక్తంచేయడానికి భాషలోని ఏ పదాలూ సరిపోవని అన్నారు. దాదాపు పుష్కరకాలంనాటి ఆ దారుణంపై ఆయన నోరు విప్పి తన అభిప్రాయాన్ని చెప్పడం అదే ప్రథమం. అంతవరకూ ఆయన ఆ ఘటనపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్ సొసైటీ హత్యాకాండలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీని కొందరు దుండగులు సజీవదహనం చేసిన ఘటనలో నరేంద్ర మోడీ ప్రమేయంపై సాక్ష్యాధారాలు లభించలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అందజేసిన నివేదికను మేజిస్ట్రేట్ కోర్టు అంగీకరించిన తర్వాత మోడీ ఆ బ్లాగ్‌లో గుజరాత్ మారణకాండపై తొలిసారి తన అభిప్రాయం చెప్పారు. అలాగని ఆయన నేరుగా క్షమాపణ కోరలేదు. పశ్చాత్తాపమూ వ్యక్తంచేయలేదు. ఆ ఘటనలతో సంబంధం ఉన్నదా, లేదా అనే సంగతి పక్కనబెట్టి అప్పుడు తానే సీఎం కనుక తనకు నైతిక బాధ్యత ఉంటుందని ఆయన అనుకోలేదు. ఆనాటి ప్రధాని, బీజేపీ అగ్రనేత వాజపేయి అప్పట్లో ‘రాజధర్మం’పాటించాలని బహిరంగంగానే మోడీకి సలహా ఇచ్చిన వైనం ఎవరూ మరిచిపోరు.
రాజ్‌నాథ్‌సింగ్ మైనారిటీ మోర్చా సదస్సులో ముస్లింలతో మనసువిప్పి మాట్లాడారు. ‘ఎన్నడైనా, ఎప్పుడైనా ఏమైనా తప్పంటూ జరిగితే, మావైపునుంచి ఏమైనా లోటుపాట్లుంటే మీ ముందు తలవంచి క్షమాపణ కోరతామని హామీ ఇస్తున్నాను’ అని చెప్పారు. అంతేతప్ప గుజరాత్ ప్రస్తావన తీసుకురాలేదు. ‘మీ ఆశలకు అనుగుణంగా మేం పాలించలేకపోతే అటు తర్వాత మావైపు ఎప్పుడూ చూడనవసరంలేద’ని భరోసా ఇచ్చారు. ఈ మాటల సంగతలా ఉంచి తన క్షమాపణ దేనికోసమో ఆయన వివరించడానికి ప్రయత్నించలేదు. క్షమాపణ చెప్పేవారు సాధారణంగా అందుకు కారణమైన పరిస్థితులను వివరిస్తారు. ఎక్కడ తప్పు జరిగిందో చెబుతారు. అందుకు బాధ్యతవహిస్తారు. అటుతర్వాతే క్షమాపణ ప్రసక్తి వస్తుంది. ఇవేమీ లేకుండా చెప్పే క్షమాపణకు పెద్ద విలువేమీ ఉండదు. అసలు తన క్షమాపణకు ఇంత అస్పష్టతను ఎందుకు జోడించవలసివచ్చిందో రాజ్‌నాథ్ మాత్రమే చెప్పగలరు. కానీ, అదంతా అన్యుల ఊహాగానాలకే ఆయన వదిలేశారు. ఫలితంగా దానికి రకరకాల భాష్యాలు వెలువడుతున్నాయి. బీజేపీ దీనికి కొత్త అర్ధం లాగుతున్నది. ఆయన చెప్పిన క్షమాపణలు గత కాలానికి సంబంధించినవి కాదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా తప్పులు జరిగే పరిస్థితులు ఏర్పడితే క్షమాపణ చెబుతామన్నదే ఆయన మాటల్లోని ఆంతర్యమని వారు చెబుతున్నారు. ఆ ప్రసంగంలోనే గుజరాత్ మారణహోమం సమయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. తమ ఏలుబడిలో భవిష్యత్తు ఎంతో బాగుంటుందని, ప్రపంచపటంలో దేశాన్ని అగ్రభాగాన నిలుపుతామని నరేంద్ర మోడీ హామీ ఇస్తుంటే... భవిష్యత్తులో ‘ఏదైనా జరిగితే’ క్షమాపణ చెబుతామన్నదే రాజ్‌నాథ్ ఆంతర్యంగా అర్ధం చేసుకోమని చెప్పడం హాస్యాస్పదమవుతుంది.
లోక్‌సభలో కనీస మెజారిటీ 272 స్థానాలకన్నా ఎక్కువ సాధించాలంటే అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నదని బీజేపీ భావిస్తోంది. ఈ కృషిలో తమకున్న అవరోధాలేమిటో ఆ పార్టీ సరిగానే గుర్తించింది. గుజరాత్ ఘటనల అనంతరం ముస్లింలు తమకు దూరమయ్యారని, వారిని తిరిగి గెలుచుకోగలిగితే తమ జైత్రయాత్రకు తిరుగుండదని అనుకుంటున్నది. అందువల్లే ఆ విశ్వాసరాహిత్యాన్ని తగ్గించే క్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ నోటివెంట ‘క్షమాపణ’ ప్రస్తావన వచ్చిందన్నది నిజం. ఆ పనిచేశాక కూడా బీజేపీ నేతలు దాన్ని దాచడానికి ప్రయత్నించడమే వింతగొలుపుతుంది. తమవైపుగా ఇంతవరకూ ఎలాంటి తప్పు జరగలేదని, అందువల్ల క్షమాపణ చెప్పే ప్రసక్తే తలెత్తదని బీజేపీ నేత షా నవాజ్ హుస్సేన్ అంటున్నారు. తాము అధికారంలోకొస్తే అంతా బాగుంటుందని, అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందని అరచేతిలో వైకుంఠం చూపే నాయకులు...ఒకవేళ తప్పులంటూ జరిగితే క్షమాపణ కూడా చెబుతామని ముందే హామీ ఇస్తున్నారంటే మన ప్రజాస్వామ్యం చాలా పరిణతి సాధించినట్టే లెక్క. వ్యక్తులైనా, సంస్థలైనా, దేశాలైనా జరిగిన ఘటనలపై పశ్చాత్తాపపడినప్పుడో, మనోవేదనకు గురైనప్పుడో క్షమాపణల ప్రసక్తి వస్తుంది. కానీ రెండునెలలనాడు నరేంద్రమోడీ అయినా, ఇప్పుడు రాజ్‌నాథ్‌సింగ్ అయినా... ఇలా అస్పష్టంగా మాట్లాడటంవల్ల ఆయా వర్గాలు సన్నిహితంకావడం మాట అటుంచి వారిలో మరిన్ని సంశయాలు పుట్టుకొస్తాయి. కనుక ఇలాంటి అంశాల్లో సూటిగా, స్పష్టంగా మాట్లాడటమే ఉత్తమమని బీజేపీ నాయకులు గ్రహించాలి.
‘క్షమా’ రాజకీయం!
Published Wed, Feb 26 2014 11:46 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement