చాయ్‌వాలా అసలు ఛాయ
విశ్లేషణ
నరమేధం తర్వాత గుజరాత్‌కు అంతకుముందులా దేశ విదేశీ కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు రావడం లేదు. ఈ ‘వికాస పురుషుడి’ ‘ప్రగతి’ పథకాలు ముందుకు నడవాలంటే అన్నివైపుల నుంచి పెట్టుబడులు రావాలి. తాను దేశ ప్రధాని పదవిలోకి వస్తే తప్ప ఆ పెట్టుబడుల్ని ధారాళంగా ఆహ్వానించడం కుదరదు.
‘ధర్మరాజు’ అని పేరు తగిలించుకున్న వాళ్లంతా ధర్మరాజులు కారు. తాను ‘చాయ్‌వాలా’నని పాత పట్టా దులిపి మీద తగిలించుకున్న రాజకీయవేత్త కూడా నిజమైన చాయ్‌వాలా కాదు. 2002 సంవత్సరంలో గుజరాత్‌లో మైనారిటీల నరమేధాన్ని సాగించి దేశవ్యాప్తంగానూ, విదేశాలలోనూ అప్పుడు అభాసుపాలై,గా నేడు దేశం ముందు నిలబడిన నరేంద్ర మోడీ ‘చాయ్‌వాలా’ పేరుతో మోసగించ జూస్తున్నారు.
తండ్రి చాయ్ దుకాణంలో చిన్నప్పుడు సాయపడే వాడేగానీ, మోడీయే చాయ్‌వాలా కాదని కూడా కథనాలు ఉన్నాయి. గుజరాత్ మారణకాండకు గత పదేళ్లుగానే కాదు, 2014 ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ క్షణం దాకా కూడా ముఖ్యమంత్రి నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పకుండా కాలం డొల్లించుకుంటూ వస్తున్నాడు. అతని ‘నాజీ’ మనస్తత్వాన్ని కనబడనివ్వకుండా బీజేపీ నాయకత్వంలోని కొందరు అతని తరఫున పరోక్షంగా ‘క్షమాపణలు’ చెబుతూ తప్పించుకుంటు న్నారు. ఆ చెప్పేవారు కూడా ‘గుజరాత్ మారణకాండ’ను ప్రస్తా వించకుండా ‘టు హూమ్ సో యెవ్వర్!’ అన్నట్టుగా ‘గాయపడిన హృదయాలకు’ అని వదిలేస్తున్నారు. బీజేపీ, పరివార్ పనిగట్టు కొని పాటించిన ఈ మౌనం అర్థం అప్పటి ఊచకోతలను మోడీ ప్రధాన మంత్రిత్వం కోసం మరచిపొమ్మని చెప్పడాని కేనా? తాను కిందిస్థాయి, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినందుకూ, చిన్నతనంలో అడపాదడపా చాయ్ దుకాణంలో కూర్చున్నం దుకూ, ‘చాయ్‌వాలా’ పేరుతో చలామణీలోకి వచ్చినందుకూ ఆ నరమేధాన్ని ఇకనైనా జనం మరచిపోవచ్చనీ, తనను ఢిల్లీ గద్దెపైన కూర్చోబెట్టవచ్చుననీ మోడీ భావిస్తున్నాడా?
వాజపేయినీ పట్టించుకోలేదు
గుజరాత్ మరణకాండపై వ్యాఖ్యానిస్తూ నాటి ఎన్డీఏ ప్రధాని వాజ్‌పేయి అయినా, ‘ఇది దుర్లభం, దుస్సహం, నీవు రాజధర్మం, నీతి తప్పావు. గద్దెపై ఉండదగవ’ని బాహాటంగానూ, లోపాయికారీగానూ హెచ్చరించారు. ఆ మాటను కూడా మోడీ తోసిపుచ్చాడు. మోడీ మీద వచ్చిన ‘ఆరోపణల’ను పరిశీలించి నివేదిక అందించాలని రాఘవన్ అధ్యక్షతన నియమించిన స్పె షల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్‌ను కోర్టు ఆదేశించింది. ఆ విచారణ సంస్థ పరస్పరం ప్రతికూల నిర్ణయాల మధ్య నివేదికను సమర్పిస్తూ, అనేక మంది గుజరాత్ ఉన్నతాధికారులు 2002 నాటి నరమేధానికి కారకులని పేర్కొన్నప్పటికీ, మోడీని నిర్దోషిగా పేర్కొనడం ఒక ప్రహసనం. ఈ అంశాలనే సుప్రసిద్ధ పాత్రికేయుడు, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సీనియర్ సంపాదకుడుగా ఎన్నో న్యాయ సంబంధమైన, మానవహక్కుల గురించిన సమస్యలపై పాఠకుల్ని చైతన్యవంతుల్ని చేసిన మనోజ్‌మిట్టా (‘ది ఫిక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్‌ఫైండింగ్: మోడీ అండ్ గోధ్రా’) వెలుగులోకి తెచ్చారు. 1984 నాటి ఢిల్లీ ఘోరకలి గురించీ, 2002 నాటి గుజరాత్ కిరాతకాల గురించీ, మోడీ హయాంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉన్నదీ వివరించడమే కాకుండా, ‘నిజనిర్ధారణ’కు నియమించిన కమిటీల నివేదికలు ఇటీవలి కాలంలో ఎలా కట్టు కథలుగా ముగుస్తున్నాయో కూడా బయటపెట్టాడు.
గుజరాత్‌లో, ఆ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిన 2,000 మంది ఊచకోత ఘటనలో గుజరాత్ పాలనా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తోడు దొంగలయిన సన్నివేశంపైన నిజనిర్ధారణ చేయమని సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. కాగా ఈ ‘బృందం తుది నివేదిక మా త్రం ఒక న్యాయ వ్యవస్థగా సుప్రీంకోర్టు పరువును కాస్తా పూడ్చిపెట్టేసింద’ని మనోజ్ మిట్టా వెల్లడించారు. సరిగ్గా ఈ అవకాశం కోసమే మోడీ చూస్తున్నాడు. ఆ అనుకూల ముహూర్తాన్ని ‘సిట్’ విచారణ సంస్థ కల్పిం చింది. చివరికి సుప్రీంకోర్టు కూడా ‘సిట్’ నిర్వహించిన తీరుకు విస్తుపోవాల్సి వచ్చింది. సుప్రీం అచేతనత్వాన్ని అవకాశంగా తీసుకున్న మోడీ తాను నిర్దో షిగా దేశం ఎదుట నిలబడాలని భావించాడు. సుప్రీం న్యాయస్థానం మౌనా న్ని అవకాశంగా తీసుకుని ‘భారత సుప్రీంకోర్టు ప్రపంచంలోనే మంచి కోర్టుగా పేరొందింది. ‘సిట్’ సంస్థలో పని చేసే వారంతా చాలా తెలివిగల అధికారులు. వారి నివేదిక వచ్చింది. నాకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఎలాంటి మచ్చలేని క్లీన్‌చిట్ ఇచ్చేశారుగదా’ అని (2003లో రాయిటర్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ) చెప్పుకున్నాడు. అయినా మోడీ ‘చాయ్‌వాలా’ గానే చెప్పుకుం టూ తిరుగుతున్నాడు. నరమేధం తర్వాత గుజరాత్‌కు అంతకు ముందులా దేశ విదేశీ కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు రావడం లేదు. ఈ ‘వికాస పురు షుడి’ ‘ప్రగతి’ పథకాలు ముందుకు నడవాలంటే అన్నివైపుల నుంచి పెట్టు బడులు రావాలి. తాను దేశ ప్రధాని పదవిలోకి వస్తే తప్ప ఆ పెట్టుబడుల్ని ధారాళంగా ఆహ్వానించడం కుదరదు.
పెట్టుబడుల కోసమే..
మోడీ గుజరాత్ ప్రజలను మోసం చేశాడు. 60,000 మందికి పైగా రైతులను భూముల నుంచి ‘బేదఖత్’ చే సి వాటిని ‘సెజ్’ల పేరిట కార్పొరేట్ సంస్థల భారీ వ్యాపారం కోసం కుదువ పెట్టాడు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడా ల్సిన పరిస్థితులు కల్పించాడు. అయినా ‘చాయ్‌వాలా’నేనంటాడు. ‘గుజరాత్ లోకి రాకుండా ఆగిపోయినా పెట్టుబడులు’ తిరిగి రావడానికి దారులు వెతు క్కుంటున్న మోడీని, 2003 జనవరిలో ముంబై - ఢిల్లీ సభల్లో భయం మధ్యనే దేశ బడా గుత్త పెట్టుబడి వర్గాలు, వారి ప్రతినిధులు వ్యాపార పరి భాషలో ‘దార్శనిక ముఖ్యమంత్రి’ అని ఆకాశానికెత్తారు. గుజరాత్ నరమేధ ప్రయోగం దెబ్బకి జడిసిపోయిన గుత్తవర్గాలు కొందరు, కాలం గడిచిపోతు న్న కొద్దీ ప్రజల జ్ఞాపకశక్తి కూడా కొడిగట్టుకుపోతుందన్న విశ్వాసం గల కార్పొరేట్ సంస్థలు మరికొన్ని గుజరాత్‌లో పెట్టుబడుల కోసం సిద్ధమై ఈ సభకు వచ్చారు. వారిలో అదానీలు, అంబానీలు, విదేశీ గుత్తేదార్లు ఉన్నారు.
ఇంతకూ, సుమారు 20 ఏళ్లుగా చెవులు చిల్లులుపడేలా స్వదేశీ సరుకు గురించీ, స్వదేశీ ఉద్యమ ప్రాధాన్యం గురించీ అనుకూలంగానూ, విదేశీ సరుకు దిగుమతులకు వ్యతిరేకంగానూ ప్రచారం చేస్తూ వచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ - బీజేపీ పరివార్ సంస్థ ‘స్వదేశీ జాగరణ్ మంచ్’ ఇప్పుడు నోళ్లు కుట్టేసుకుంది. బీజేపీ, మోడీల గుత్తేదారు అనుకూల విధానాలపై మంచ్ విరుచుకుపడడం లేదు. అందుకే మోడీ ముంబై - ఢిల్లీ సభల్లో ఇలా ప్రకటించగలిగాడు: ‘వ్యాపార రంగంతో, వ్యాపార సంస్థల వ్యవహారాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. జోక్యం కూడదు. ఎక్కడైతే వ్యాపార లావాదేవీలు సాగకుండా అడ్డంకులు (రెడ్‌టేపిజం) ఉంటాయో అక్కడల్లా నేను వాటిని తొలగించి స్వాగతం పలుకుతాను’ అన్నాడు! ‘వ్యాపారం వ్యాపారమే’ అని అనూ ఆఘా నిర్వచించింది! ‘దేశం వెలిగిపోతుంది’ అన్న సంపన్న వర్గాల పాలక రాజకీయుల నినాద భేరీలకు మహా రచయిత చెహోవ్ ఇచ్చిన సమాధానం చాలు. అది: చంద్రుడు వెలిగిపోతున్నాడని నాకు చెప్పకు. ముక్కచెక్కలైపోతున్న జీవాల పైన ప్రసరించాల్సిన కాంతిరేఖను చూపించు!’ అందుకే, నాటి ‘చాయ్‌వాలా’ నేటి కార్పొరేట్ల ‘ఛాయా’మాత్రం గానే మిగులుతాడని అనిపిస్తుంది.
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు)
ఏబీకే ప్రసాద్