దొంగ ఓట్ల బెడద | CEC Sunil Arora Reacts On Voters Names Removing In AP | Sakshi
Sakshi News home page

దొంగ ఓట్ల బెడద

Published Thu, Feb 14 2019 12:45 AM | Last Updated on Thu, Feb 14 2019 12:55 AM

CEC Sunil Arora Reacts On Voters Names Removing In AP - Sakshi

ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్ప క్షపాతంగా నిర్వహించడం ఈ సంస్థ నైతిక బాధ్యత. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాకు క్షేత్రవాస్తవికత చూచాయగా తెలిసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్ట్‌–డేటెడ్‌ చెక్కుల విషయం, సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న సంగతీ ఆయన అమరావతిలో ప్రస్తావించారు. ఎన్నికలలో అవకతవకలకు పాల్పడిన అధికారులు ఎంతవారైనా వారిపైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

బదిలీలూ. పదోన్నతుల పైనా, దొంగ ఓట్ల నమోదుపైనా, ఓటర్ల జాబితాలో తప్పులపైనా ఫిర్యాదులు అందాయనీ, అన్నిం టినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా లలో రెండు చోట్లా ఓటర్ల జాబితాలలో ఉన్న పేర్లపైనా దృష్టి పెడతామని చెప్పారు.  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) ఆర్‌పీ ఠాకూర్‌నూ, ఇంటెలిజెన్స్‌ శాఖ అధిపతి, అడిషనల్‌ డీజీపీ వెంక టేశ్వరరావునూ, కొత్తగా సృష్టించిన కోఆర్డినేటర్, లా అండ్‌ ఆర్డర్‌ పదవిలో నియమించిన ఘట్టమ నేని శ్రీనివాస్‌నూ ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టకపోతే ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే ప్రసక్తే ఉండదంటూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనను కూడా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ప్రస్తావించారు.

అన్ని ఫిర్యాదులపైనా తగిన చర్యలు తీసుకుంటానంటూ నమ్మబలికారు. కానీ ప్రజలను కొన్ని సందేహాలు పట్టిపీడిస్తూనే ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపైనా, రాష్ట్రప్రభుత్వ సిబ్బందిపైనా ఆధారపడి చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర అధికారులు సహజంగానే అధికారపార్టీకి విధేయంగా ఉంటారు. అటువంట ప్పుడు అధికారపార్టీ బుద్ధిపూర్వకంగా రకరకాల ఎన్నికల అక్రమాలకు ఒడిగట్టితే వాటిని ఎన్నికల కమిషన్‌ ఏవిధంగా నివారించగలదనే సందేహం వేధిస్తున్నది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల ప్రమేయం లేకుండా ఈవీఎంలు (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌) భద్రపరచిన స్ట్రాంగ్‌రూంలోకి ప్రవేశించినందుకు వికారాబాద్‌ కలెక్టర్‌ను సస్పెండ్‌ చేయడం వల్ల అధికారులలో కొంత భయం పెరిగింది. దొంగ ఓట్ల విషయంలో కొన్ని ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది అధికారులను పంపుతుందని సునీల్‌ అరోరా చెప్పారు. అధికారుల పరిశీలనలో దొంగ ఓట్లు నమోదైనట్టు రుజువైతే అందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన తక్షణమే చర్య తీసుకుంటే తక్కిన అధికార యంత్రాంగం జాగ్రత్తగా ఉంటుంది. నామినేషన్‌ వేయడానికి గడువు ముగిసే క్షణం వరకూ కొత్త ఓట్లను చేర్చుకునే ప్రక్రియ కొనసాగుతుంది.

కొన్ని రాజకీయ పక్షాలు అదే పని మీద ఉంటాయి. ఉదాహరణకు కర్నూలు జిల్లాలో అధికారపార్టీ నేతలు బోగస్‌ ఓట్లను చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారనీ, నవంబర్‌ 1 నుంచి ఫిబ్ర  వరి 11 వరకూ ఫారం–6 కింద ఓటరు నమోదు కోసం 1,43,568 మంది దరఖాస్తు చేసుకున్నారనీ సమాచారం. అంతకుముందే జిల్లాలో 1,36,000 మంది కొత్త ఓటర్లు నమోదైనారు. ఏవిధంగా చూసినా ఇది పెద్ద సంఖ్య. సర్వేల పేరిట జరుగుతున్న తతంగం కూడా తెలుగుదేశంపార్టీ (టీడీపీ) నాయకుల పర్యవేక్షణలోనే సాగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రెవెన్యూ అధికారులు ఎటు వంటి విచారణ లేకుండానే బోగస్‌ ఓటర్లను నమోదు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వస్తు న్నాయి. దొంగ ఓట్లు ఫలానా ప్రాంతంలో ఉన్నాయనీ, దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలనీ ఎన్నికల ప్రధానాధికారి జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్‌)ని ఆదేశిస్తే, కలెక్టర్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ఆఫీసర్‌ (ఆర్డీవో)ను పురమాయిస్తే, ఆర్డీవో అసిస్టెంట్‌ ఎలక్టోరల్‌ రోల్‌ ఆఫీసర్‌ (ఎంఆర్‌వో)కు చెబుతారు. ఎంఆర్‌ఓ బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ (బీఎస్‌వో)కి బాధ్యత అప్పగిస్తారు. 

సర్వసాధారణంగా ఎవ్వరూ ఏమీ పరిశీలించకుండా, తనిఖీ చేయకుండా అంతా సవ్యంగా ఉన్నట్టు నివేదికలు పంపుతారు. తెలంగాణలో ఇదే జరిగింది. ఒక నియోజకవర్గంలో సెప్టెంబర్‌ 10న మొదటి జాబితా విడుదల చేశారు. అక్టోబర్‌ 12న మొదటి అనుబంధ జాబితా (సప్లి మెంట్‌–1) జారీ చేశారు.  నవంబర్‌ మూడో వారంలో రెండో అనుబంధ జాబితా (సప్లిమెంట్‌–2) విడుదలైంది. రెండున్నర మాసాల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో 47 వేల ఓట్లు పెరిగాయి. హైకో ర్టులో పిటిషన్‌ వేసినా, న్యాయమూర్తులు ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించినా బోగస్‌ ఓట్లను అరి కట్టలేకపోయారు. అంతా సవ్యంగానే ఉన్నదంటూ న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేశారు. చివరికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ రజత్‌కుమార్‌ ‘సారీ’తో సరిపుచ్చారు.

దొంగ ఓట్లను తొలగించాలనే పట్టుదల కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నిజంగా ఉంటే అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. అంకితభావంతో పనిచేసే సిబ్బందిని తగి నంతగా సమకూర్చాలని రాష్ట్రపతిని అభ్యర్థించాలి. నామినేషన్ల గడువు ముగియడానికి ముందు కొద్దివారాలలో అంతదాకా ఉన్న ఓట్లకు పదిహేను లేదా ఇరవై శాతం కొత్త ఓట్లు నమోదు చేస్తు న్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. నామినేషన్లు ముగిసిన తర్వాత  దొంగ ఓట్లను గుర్తించి, తొలగించడానికి తగిన సమయం ఉండటం లేదు. అక్రమాలు జరిగినట్టు తెలుసుకొని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అధికారులపైన ఎటువంటి చర్య తీసుకున్నా అది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందమే అవుతుంది. శేష¯Œ  లగాయతు చీఫ్‌ ఎలక్షన్‌ కమి షనర్లకు మంచి పేరు ఉన్నప్పటికీ ఎన్నికలలో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. అక్రమాలకు అంతులేకుండా పోతున్నది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం యథావిధిగా జరు గుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ప్రాణప్రదమైనవి. ఓటర్ల జాబితాలు ఎంత స్వచ్ఛంగా, దోషరహితంగా ఉంటే ఎన్నికలు అంత సవ్యంగా జరుగుతాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement