ఈయూకు ఆశాభంగం | Editorial About Online Summit Between India And European Union | Sakshi
Sakshi News home page

ఈయూకు ఆశాభంగం

Published Fri, Jul 17 2020 12:41 AM | Last Updated on Fri, Jul 17 2020 12:41 AM

Editorial About Online Summit Between India And European Union - Sakshi

భారత్‌–యూరప్‌ యూనియన్‌(ఈయూ)ల మధ్య ఆన్‌లైన్‌ శిఖరాగ్ర సమావేశం బుధవారం ముగిసింది. ఇది వాస్తవానికి ఏటా జరగాలి. కానీ వాణిజ్యం, పెట్టుబడులు వగైరా అంశాల్లో ఇరు పక్షాల మధ్యా ఏకాభిప్రాయం కొరవడటంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ శిఖరాగ్ర సమా వేశం జరిగింది. సమావేశానికి ముందు పౌర అణు ఇంధన సహకార ఒప్పందంపై సంతకా లయ్యాయి. వాణిజ్యం, పెట్టుబడుల్లో సమతూకం సాధించాలని, వాణిజ్య అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే అందరూ అనుకున్నట్టు ఈసారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ప్రస్తావన రాలేదు. దానిపై తదుపరి చర్చలు ఎప్పుడుం టాయన్న అంశంలోనూ స్పష్టత లేదు.

వాణిజ్య రంగంలో ఈయూ మనకు అతి పెద్ద భాగస్వామి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) అంశంలోనూ ఈయూదే పైచేయి. మన దేశంలో ఆ ఎఫ్‌డీఐలు 9,100 కోట్ల డాలర్ల పైమాటే. అయితే ఈయూ దేశాల విదేశీ వాణిజ్యంలో భారత్‌ వాటా 2 శాతం మాత్రమే. దీన్నింకా పెంచాలన్నది తమ ఉద్దేశమని ఈయూ అధ్యక్షుడు చార్లెస్‌ మైకేల్‌ ప్రకటించారు. భారత్‌–ఈయూ దేశాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే వున్నాయి. ఇటీవలి కాలంలో భారత్‌ ఆత్మరక్షణ విధానాలు అవలంబిస్తూ భారీగా టారిఫ్‌లు విధిస్తోందని ఈయూ అభ్యంతరం చెబుతోంది.

 2013లో చివరిసారి ఇరుపక్షాల మధ్యా చర్చలు జరిగినప్పుడు అంగీ కరించిన అంశాలపై మన దేశం ఆ తర్వాత వెనక్కి తగ్గిందన్నది ఈయూ ఆరోపణ. తాము ఉత్పత్తి చేసే కార్లు, మద్యం వగైరాలపై విధించిన భారీ టారిఫ్‌లు సమ్మతం కాదని ఈయూ అప్పట్లో వాదించింది. సేవల రంగాన్ని కూడా ఒప్పందంలో చేర్చాలని, సాఫ్ట్‌వేర్‌ రంగ నిపుణులకు వీసాలు మంజూరును పెంచాలని  మన దేశం కోరింది. అలాగే మన ఆహారోత్పత్తులు, ముఖ్యంగా చేపలు, పాడి ఉత్పత్తులకు ఈయూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ నిబంధనల్ని సరళం చేయాలని కోరింది.

ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2016లో మన దేశం ఈయూలోని 22 దేశాలతో అంతక్రితం కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను రద్దుచేసింది. ఈ చర్యతో ఈయూ సభ్య దేశాలకు అపనమ్మకం ఏర్పడిందని, కనుక సమగ్ర ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కుదరాలని తాజా సమావేశం సందర్భంగా ఈయూ ప్రతిపాదించింది. ఆ మాదిరి ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసిన పక్షంలో తీసుకునే చర్యలే ఈ ప్రతిపాదన సారాంశం. అయితే అందుకు మన దేశం సిద్ధపడలేదు. దీనికి బదుల పరస్పరం ఆసక్తిగల రంగాల్లో అంగీకారం కుదుర్చుకుని, వాటికి పరిమితమై వాణిజ్యాన్ని కొనసాగిం చవచ్చునని సూచించింది. ఇందువల్ల రెండు పక్షాలకూ పెద్దగా ఉపయోగం ఉండదని ఈయూ భావన. అయితే ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడుల ఒప్పందంపై భారత్‌–ఈయూల మధ్య మరిన్ని చర్చలు జరగాలని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాలని తాజా శిఖరాగ్ర చర్చల్లో నిర్ణయించారు. 

ఈయూతో ఎఫ్‌టీఏ కుదర్చుకోవడంపై మన దేశంలో వివిధ వర్గాలు మొదటినుంచీ తీవ్ర వ్యతిరేకతతో వున్నాయి. నిరుడు నవంబర్‌లో మన దేశం చైనాకు పెద్దగా మేలు చేకూర్చే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సీఈపీ) చర్చల నుంచి బయటకు రావాలని నిర్ణయింది. ఆర్‌సీఈపీ వల్ల మన సరుకులను అమ్ముకోవడానికి అవకాశాలు ముమ్మరమవుతాయని కొందరు నిపుణులు చెప్పినా, ఆరోగ్య, వ్యవసాయ, పాడిపరిశ్రమ, తయారీ రంగాలను తీవ్రంగా నష్టపరిచే ఆ ఒప్పందం జోలికి వెళ్లవద్దని అనేకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్‌సీఈపీ నుంచి బయటి కొచ్చినట్టే ఎఫ్‌టీఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని భిన్న వర్గాలు కోరుతున్నాయి. లేనట్ట యితే మేకిన్‌ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందంటున్నాయి.

ఇంతక్రితం ఆర్‌సీఈపీ నుంచి బయటి కొచ్చినా, ఇప్పుడు ఎఫ్‌టీఏ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అదంతా ఆత్మరక్షణ విధా నాల పర్యవసానమేనని ఈయూ అంటుండగా మన దేశం కొట్టిపారేసింది. వాణిజ్య ఒప్పందం ఏదైనా పరస్పర ప్రయోజనాలు ముడిపడి వుండాలి తప్ప, ఒకరికి భారీయెత్తున మేలు చేకూర్చేలా, మరొకరు నష్టపోయేలా వుండరాదన్నదే ఆ అభ్యంతరాల్లోని ఆంతర్యమని మన దేశం చెప్పింది. ఇది పూర్తిగా సహేతుకం. 2013లో భారత్‌–ఈయూల మధ్య ఎఫ్‌టీఏపై రహస్య చర్చలు జరిగాయి. అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ఎఫ్‌టీఏ నిబంధనలు కొన్నింటిని బయటపెట్టాయి. అవి అమల్లోకి వస్తే ప్రజారోగ్య రంగంపై దారుణమైన ప్రభావం పడుతుందని అప్పట్లో ఆక్స్‌ఫాం వంటి సంస్థలు హెచ్చరించాయి. ఈయూ సభ్యదేశాల్లోని ఫార్మా రంగ సంస్థల ప్రయోజనాలను కాపాడ టానికే ఆ నిబంధనలు పొందుపరిచినట్టు కనబడుతుంది.

ఎఫ్‌టీఏపై సంతకాలైతే మన దేశంలో ప్రాణావసరమైన జెనరిక్‌ మందుల ఉత్పత్తి నిలిచిపోతుంది. వాటి బదులు విదేశాల్లో తయారైన ఖరీదైన మందులే దిక్కవుతాయి. హెచ్‌ఐవీ వంటి వ్యాధుల నియంత్రణకు వాడే ఔషధాల్లో 80 శాతం మన దేశంలో తయారవుతాయి. అవి వర్ధమాన దేశాల నిరుపేదలకు అందుబాటు ధరల్లో వుంటున్నాయి. కానీ మేధోహక్కుల పేరిట వాటిని అందకుండా చేయడమే ఎఫ్‌టీఏ లక్ష్యం. ఈ అంశాల సంగతలా వుంచి మొన్న ఏప్రిల్‌లో మొబైల్‌ ఫోన్‌లు, ఇతర విడిభాగాలు, హెడ్‌ సెట్లు, కెమెరాలు వగైరాలపై  మన దేశం అదనంగా 7.5 శాతం నుంచి 20శాతం వరకూ టారిఫ్‌లు పెంచ డంపై ఇటీవలే  ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)కు ఈయూ ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే 370 అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వగైరాలపై అది అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో జరిగిన భారత్‌–ఈయూ శిఖరాగ్ర సమావేశం చెప్పుకోదగ్గ పురో గతి సాధించకపోవడంలో వింతేమీ లేదు. ఏ ఒప్పందమైనా మన అభివృద్ధికి తోడ్పడాలి. మన ప్రయోజనాలు నెరవేర్చాలి. వాటికి గండికొట్టేలా వుంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే ఉత్తమం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement