ఆప్‌కు భంగపాటు | Editorial on delhi muncipality elections | Sakshi
Sakshi News home page

ఆప్‌కు భంగపాటు

Published Thu, Apr 27 2017 12:17 AM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

ఆప్‌కు భంగపాటు - Sakshi

ఆప్‌కు భంగపాటు

‘ఢిల్లీ ఓటర్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌), డెంగ్యూల మధ్య దేన్ని ఎంపిక చేసుకోవాలన్న సందిగ్ధంలో పడ్డారు. చివరకు డెంగ్యూ వైపే మొగ్గుచూపారు. ఎందుకంటే డెంగ్యూనైతే ఎప్పటికైనా నయం చేసుకోవచ్చులెమ్మని వారు భావించారు’–ఇది దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని మూడు కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక బుధవారం సామాజిక మాధ్యమాల్లో షికారు చేసిన వ్యాఖ్య. మూడు కార్పొ రేషన్లనూ రెండు దఫాలుగా ఏలుతున్న బీజేపీనే ఆ నగర వాసులు మరోసారి ఎంచుకున్నారు. అన్నిచోట్లా ఆ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ లభిం చింది. పేరుకు ఆప్‌ రెండో స్థానంలో ఉన్నదన్న మాటేగానీ బీజేపీకి అది చాలా దూరంలో ఉంది.

ఇక మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఓటమి ఆ పార్టీ అసలు పేరుగా ఎప్పుడో మారింది. తుడిచి పెట్టు కుపోతామనుకున్న చోట ఈ మాత్రమైనా వచ్చాయని కాంగ్రెస్‌ ఆనందించాలి. 2015నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఏడు శాతంమేర ఓట్లు పెంచుకుంటే, ఆప్‌ ఓట్ల శాతం సగానికి పడిపోయింది. కాంగ్రెస్‌ 11 శాతంమేర పెంచుకో గలిగింది. ఢిల్లీ నగరంలో బీజేపీ ఘన విజయం అందరూ ఊహించిందే. పేరుకు మహా నగరమే అయినా అది ఏ రాష్ట్రంతో పోల్చినా చిన్నది కావడం, అక్కడి జనం దేన్నయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం లాంటి కారణాల వల్ల ఫలితం గురించి అంచనా వేయడానికి పెద్ద నైపుణ్యత అవసరం లేదు. అలాగని అక్కడి కార్పొరేషన్లు దాన్నొక సుందర నగరంగా తీర్చిదిద్దాయని, సకల సౌకర్యాలూ కల్పిస్తూ అక్కడి పౌరులపై చెరగని ముద్ర వేశాయనుకుంటే పొరపాటు. ఆ నగరం వాలకం గమనిస్తే దేశంలో మారుమూలన ఉండే మున్సిపాలిటీలకూ, దానికీ పెద్ద తేడా కనబడదు.

ఆ నగరాన్ని రెండేళ్లుగా డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. అనేకమంది మృత్యువాత పడ్డారు. సర్కారీ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు అంతంతమాత్రం. పారిశుద్ధ్యలేమి జాస్తి. మంచినీటికి ఇక్కట్లు. అన్ని నగరాల్లాగే అది కూడా మౌలిక సదుపాయాల కల్పనలో ఘోరంగా విఫలమైంది. మహిళల భద్రత ఎప్పటిలానే ఉంది. అయినా అక్కడి పౌరులు బీజేపీని ఎందుకు ఎంచుకున్నారో కేజ్రీవాల్‌కు అర్ధంకావాలి. అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిది. తమ పార్టీ ఓటమి ఖాయమని ఆయనకు ముందే తెలియబట్టి పంజాబ్‌ ఎన్నికలనాటినుంచీ ఈవీఎంలపై నింద మోపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇదే నగరంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా మరో ఎనిమిది నెలల వ్యవధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజ యఢంకా మోగించిందని కేజ్రీవాల్‌కు గుర్తుండి ఉండాలి. అప్పటికి దేశంలో నరేంద్ర మోదీ ప్రభ బ్రహ్మాండంగా వెలిగిపోతోంది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన సగంమంది ఆప్‌ను ఎంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని, అసెంబ్లీ ఎన్ని కల్లో ఆప్‌ను ఆ స్థాయిలో గెలిపించిన ఈవీఎంలు ఇప్పుడెలా ‘మారిపోయాయో’ ఆ పార్టీ సహేతుకంగా చెప్పలేకపోతోంది. ఓడినవారు ఈవీఎంలపై నెపం వేయడం ఈ దేశంలో కొత్తగాదు. ఈ విషయంలో బీజేపీ తర్వాతే ఎవరినైనా చెప్పుకోవాలి. 2009లో ఓడినప్పుడు ఆ పార్టీ ఈవీఎంలపై భారీయెత్తున వ్యతిరేక ప్రచారం చేసింది. గ్రంథాలు ప్రచురించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సైతం ఆ పనే చేసింది.

మరో అడుగు ముందుకేసి సాంకేతిక నిపుణుడనని చెప్పుకున్న ఒక వ్యక్తిని ముందుపెట్టి ‘ఇదిగో టాంపరింగ్‌’ అంటూ ఆ పార్టీ పెద్ద ప్రహసనాన్ని నడిపింది. ఆప్‌ ఈవీఎంలపై నెపం మోపడాన్ని వ్యతిరేకించేవారు ఆ యంత్రాలు మాయా జాలానికి అతీతమైనవని వాదించడం లేదు. మీ నిందకు ఆధారాలు చూపమని అడుగుతున్నారు. ఎన్నికల సంఘం కూడా నిరూపించమని సవాల్‌ చేస్తోంది. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా విభిన్నమైన పార్టీగా ప్రజల ముందుకొచ్చిన ఆప్‌ ఆరోపణలతో కాలక్షేపం చేయడం కాక దేన్నయినా ఆధారసహితంగా చెప్పాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఆప్‌కు అలాంటి ఉద్దేశం ఉన్నట్టు కనబడదు. అదే మాట పదే పదే అంటే ఎప్పటికైనా తమంతతామే అందరూ నమ్ముతారని కేజ్రీ వాల్‌ భావిస్తున్నట్టున్నారు.

ఇది సరికాదు. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పడిననాటినుంచీ అది ఎన్ని కష్టాలు ఎదుర్కొంటు న్నదో అందరికీ తెలుసు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా లోగడ పనిచేసిన నజీబ్‌జంగ్, ఇప్పుడొచ్చిన అనిల్‌ బైజాల్‌ వివిధ అంశాల్లో అడ్డుపుల్లలేయడం కూడా తెలిసిందే. కానీ ఎల్లకాలమూ వాటిని చూపిస్తూ ఉద్యమనాయకుడి ఆహార్యంలోనే పొద్దుపు చ్చడం వల్ల ఫలితం ఉండదని కేజ్రీవాల్‌ గ్రహించడం లేదు. సమర్ధవంతమైన పాలన అందిస్తూ ఏం చేసినా అవి అదనపు ఆకర్షణలవుతాయి. అసలైంది లేకుండా మిగిలినవన్నీ చేసి జనం మెప్పు పొందుదామని చూడటం మాత్రం అత్యాశ అవుతుంది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ల సంగతే చూస్తే అనేక సార్లు వాటి సిబ్బంది జీతాల కోసం రోడ్డెక్కవలసి వచ్చింది. ఢిల్లీ ఇతర రాష్ట్రాలవంటిది కాదు. అక్కడ మూడొంతుల ముప్పాతిక కేంద్రం పెత్తనం నడిస్తే మిగిలిన పావు వంతు భాగ స్వామ్యం రాష్ట్ర ప్రభుత్వానికుంటుంది. కానీ తమ వంతుగా చేయాల్సిందైనా ఆప్‌ సర్కారు చేయడం లేదన్నది సామాన్యుల ఆరోపణ.

కేంద్రంలో తమ పార్టీ నేతృ త్వంలోని ప్రభుత్వమే ఉన్నా ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్‌ సైతం ఎన్ని సమస్యలు ఎదు ర్కొన్నారో ఎవరికీ తెలియందేమీ కాదు. వాటిపై ఆమె కూడా పోరాడక తప్పలేదు. కానీ దాన్నే ఆమె వ్యాపకంగా మార్చుకోలేదు. షీలా ఆందోళన తర్వాత కేంద్రంలో తాము అధికారంలోకొస్తే మరిన్ని అధికారాలిస్తామని ఢిల్లీ ప్రజలకు బీజేపీ హామీ ఇచ్చింది. ఢిల్లీ సర్కార్‌ ఆప్‌ వశమయ్యాక ఆ ఊసెత్తలేదు. కార్పొరేషన్‌ల వైఫ ల్యంలో తమ పాత్ర పరిమితమని చెప్పడంలోగానీ, తనకెదురవుతున్న అవరోధా లను వివరించడంలోగానీ, మెరుగైన పాలన అందించడంలోగానీ ఆప్‌ సర్కారు విఫలం కావడం వల్లే తాజా ఎన్నికల్లో ఆ పార్టీ దెబ్బ తింది. దీన్ని సరైన కోణంలో విశ్లేషించుకుని తన వ్యవహార శైలిని సరిదిద్దుకుంటేనే మెరుగైన భవిష్యత్తు ఉంటుం దని కేజ్రీవాల్‌ గుర్తించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement