అంతర్గత సమస్యలు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రవచిస్తున్న ‘అమెరికా ఫస్ట్’, రష్యా నుంచి అడపా దడపా ఎదురయ్యే చికాకులు ప్రపంచీకరణ పునాదుల్ని కదిలిస్తున్న తరుణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌లో నాలుగురోజులు పర్యటించారు. రక్షణ, భద్రత, అణు ఇంధనం వగైరా రంగాల్లో ఇరు దేశాల మధ్యా 14 ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలకు చెందిన కంపెనీల మధ్యా కుదిరిన ఒప్పందాల విలువ లక్ష కోట్ల రూపాయలపైబడే ఉంది. భారత్–ఫ్రాన్స్‌ల మధ్య ఎంతటి గాఢమైన అనుబంధం ఉన్నదో చెప్పడానికి మాక్రాన్‌కు లభించిన ఘన మైన స్వాగతసత్కారాలే తార్కాణం. అలాగని గత నెల మన దేశంలో పర్యటించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తరహాలో మాక్రాన్ సూటూ బూటూ వదిలి ఇక్కడి సంప్రదాయ దుస్తులు ధరించి మనల్ని అలరించాలని చూడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయానా విమానాశ్రయానికెళ్లి మాక్రాన్ దంపతులకు స్వాగతం పలికారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇది కొత్తగా పుట్టుకొచ్చిన అనుబంధం కాదు. రెండు దేశాలూ వ్యూహాత్మక బంధంలోనికి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు పూర్త యింది. 1998లో వాజపేయి హయాంలో మన దేశం పోఖ్రాన్‌లో అణు బాంబు పరీక్ష నిర్వహించినప్పుడు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ తీవ్ర విమ ర్శలకు దిగితే ఫ్రాన్స్ మనకు అండగా నిలబడింది. యూరప్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సులో భారత్‌పై ఆంక్షలు తెచ్చేందుకు బ్రిటన్ ప్రయత్నిస్తు న్నప్పుడు దాన్ని వీటో చేస్తానని హెచ్చరించింది ఫ్రాన్సే. అందుకు ఆనాటి భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా స్వయంగా పారిస్ వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వచ్చారు. అనంతరకాలంలో రెండు దేశాల మధ్యా వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.
నిలకడగా మాట్లాడటం, నిర్దిష్టమైన విధానాల్ని ప్రకటించి వాటికి కట్టుబడి ఉండటం డోనాల్డ్ ట్రంప్‌కు లేని కారణంగా అంతర్జాతీయంగా ఒక అనిశ్చితి ఏర్ప డింది. అమెరికాతో తమకెలాంటి సంబంధాలున్నాయో, అవి ఎటుపోతాయో తెలి యని అయోమయ స్థితిలో ప్రతి దేశమూ ఉంది. ఇటు చైనా అందుకు పూర్తి విరుద్ధం. ట్రంప్ తీరుతెన్నుల పర్యవసానంగా ఏర్పడ్డ ఈ పరిస్థితిని అది సంపూ ర్ణంగా వినియోగించుకుంటోంది. తన పలుకుబడి విస్తరించుకుంటోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తాజాగా వచ్చిన అపరిమిత అధికారాల కారణంగా ఈ దూకుడు ఉన్నకొద్దీ పెరుగుతుందే తప్ప తగ్గదు. అటు రష్యా కూడా కొత్త ఎత్తులు వేస్తోంది. చైనా, పాకిస్తాన్‌లతో అంటకాగడానికి ఉత్సాహపడుతోంది. ఈ పరిస్థి తుల్లో భారత్–ఫ్రాన్స్‌లు మరింత దగ్గరయ్యాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించగా...ఫ్రాన్స్‌తో మన దేశానికి ఇప్పుడు కుదిరిన సైనిక దళాల సహకార ఒప్పందం దాన్ని మరింత పటిష్టపరుస్తుంది. ఇరు దేశాల సైన్యాలు పరస్పరం సహకరించుకోవడానికి, ఉమ్మడి విన్యాసాలకూ, శిక్షణకూ, విపత్తుల్లో సాయం ఇచ్చిపుచ్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఫ్రాన్స్‌కు జిబౌతి, అబూ ధాబీ, రీయూనియన్ ఐలాండ్ వగైరాల్లో సైనిక స్థావరాలున్నాయి. మన దేశం కూడా సెషెల్స్, మారిషస్, ఒమన్‌లలో నావికా దళ సదుపాయాలను సమ కూర్చుకోవాలని చూస్తోంది. ఈ విషయంలో ఇప్పుడు కుదిరిన ఒప్పందం తోడ్ప డుతుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక్కో దేశంతోనే సన్నిహి తమవుతూ భారత్ పలుకుబడిని తగ్గిస్తున్న చైనా పోకడలను నిలువరించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇరు దేశాల నావికా దళాలూ ఒకరి స్థావరాలను మరొకరు వినియోగించుకునే సదుపాయం వల్ల ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతకు భరోసా ఏర్పడుతుంది. సౌరశక్తి వినియోగంలో పరస్పర సహకారం పెంచుకుని శిలాజ ఇంధనాల అవసరాన్ని గణనీయంగా తగ్గించాలన్న సంకల్పంతో రెండు దేశాల చొరవతో ఇప్పటికే అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) ఏర్పడి పనిచేస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దీన్ని మరింత సమర్ధవంతంగా వినియోగిం చాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. అలాగే రకరకాల ఆంక్షలతో ట్రంప్ అమెరికా తలుపులు మూస్తున్న తరుణంలో మన విద్యార్థులకూ, శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ ఫ్రాన్స్‌లో మెరుగైన అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటామన్న మాక్రాన్ హామీ ఆశలు రేకెత్తిస్తుంది.
ఫ్రాన్స్‌తో యూపీఏ హయాంలో 2012లో కుదిరిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపైనా, ఎన్‌డీఏ వచ్చాక ఆ యుద్ధ విమానాల కోసమే 2016లో కుదిరిన ఒప్పందంపైనా ఎన్ని వివాదాలు తలెత్తాయో అందరికీ గుర్తుంది. అప్పట్లో రూ. 1.34 లక్షల కోట్ల వ్యయంతో 126 విమానాలు కొనాలని యూపీఏ సర్కారు వాటిని ఉత్పత్తి చేసే డసాల్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 18 విమానాలను నేరుగా అందజేసి, మిగిలిన 108 విమానాలనూ బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్‌ఏఎల్)లో ఉత్పత్తి చేసేతా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తా మని అది హామీ పడింది. కానీ ఇక్కడ రేకెత్తిన వివాదాలు చూసి వెనక్కు తగ్గింది. నరేంద్ర మోదీ 2015లో ఫ్రాన్స్ పర్యటించినప్పుడు రాఫెల్ విమానాలు 36 కొనాలన్న ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఒక్కో విమానం విలువ దాదాపు రూ. 670 కోట్లు. యుద్ధ విమానాలకు సంబంధించి కుదిరిన ఒప్పందం బయట పెట్టాలని మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు ఆందోళన చేయగా యూపీఏ హయాంలో 2008లో ఇరు దేశాల మధ్యా కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా దాన్ని బయటపెట్టలేకపోతున్నామని ప్రభుత్వం జవాబిచ్చింది. దాని ప్రకారం ఏ ఒప్పందంలోని అంశాలనైనా రెండు దేశాలూ వెల్లడించకూడదు. పదేళ్లపాటు అమల్లో ఉండే ఆ క్లాజుకు మొన్న జనవరి 24తో కాలదోషం పట్టింది. కనుక రాఫెల్ ఒప్పందాన్ని వెల్లడించడానికి ఇకపై ఎలాంటి ఆటంకాలూ ఉండ వనుకునేలోగానే తాజాగా ఆ ‘గోప్యత’ క్లాజుకు రెండు దేశాలూ ప్రాణప్రతిష్ట చేశాయి. ఇది సహజంగానే ‘రాఫెల్’ చుట్టూ అల్లుకున్న వివాదాలను మరింత పెంచుతుంది. మొత్తానికి మాక్రాన్ పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత ఉన్నత స్థితికి చేర్చింది.
Comments
Please login to add a commentAdd a comment