అభిజిత్‌ ‘నోబెల్‌’ వెలుగు నీడలు | Guest Column On Nobel Laureate Abhijit Banerjee By ABK Prasad | Sakshi
Sakshi News home page

అభిజిత్‌ ‘నోబెల్‌’ వెలుగు నీడలు

Published Tue, Oct 22 2019 12:15 AM | Last Updated on Tue, Oct 22 2019 12:24 AM

Guest Column On Nobel Laureate Abhijit Banerjee By ABK Prasad - Sakshi

‘‘దేశాల అభివృద్ధికి దోహదం చేయగల ప్రయోగాల ద్వారా ఆర్థిక శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా దారిద్య్ర బాధల్లో ఉన్న ప్రజా బాహుళ్యానికి విముక్తి కలిగించే ప్రయోగాలు చేసినందుకు ఆర్థికవేత్తలు అభిజిత్‌ బెనర్జీ, ఆయన సతీమణి ఈస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రీమర్‌లు నోబెల్‌ బహుమతికి సంయుక్తంగా అర్హులయ్యారు’’
– నోబెల్‌ కమిటీ ప్రకటన (14–10–2019)
అయితే ‘‘దారిద్య్ర కారణాలను సునిశితమైన దృష్టికోణం నుంచి అందుకు దారితీసిన లేదా కారకులైన శక్తులు లేదా పాలకులు అనుస రించిన మార్గాలను మరింత నిశితంగా విమర్శనాత్మకంగా పరిశీలిం చాలి. ప్రజల ఆర్థిక స్థితిగతుల పరిశీలనలో మచ్చుకు జరిపే కొన్ని నియంత్రిత ప్రయోగాలను కూడా ఈ శక్తులు బరితెగించి ఉల్లంఘి స్తాయి.’’
– ప్రసిద్ధ ఆర్థిక వేత్తలు ఫర్వాసియాల్, కరొలినా ఆల్వెస్‌

అధికారం లేని ప్రజ్ఞ ఓంకారం లేని మంత్రం లాంటిదన్నది ఓ సామెత. ప్రజల దారిద్య్ర నిర్మూలనకు సామాజిక రాజకీయ పాలనా వ్యవస్థ మూలాల్లోకి వెళ్లి తరచి చూడకుండా పరిష్కారం కోసం మార్గాన్వేషణ చేయడం అర్ధసత్యంగానే మిగిలిపోతుంది. అభిజిత్‌ బెనర్జీ త్రయానికి, నోబెల్‌ కమిటీ అత్యున్నత పురస్కారం ఇవ్వడాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక ప్రసిద్ధుడు రోహన్‌ వెంకట్రావు కృష్ణన్‌ ఒక సహేతుకమైన ప్రశ్న వేశారు– దేశాభివృద్ధికి సంబంధించిన విధానా లను, మానవ నైజాన్నీ, రోగికి వాడే మందుల మంచి చెడులను పరీక్షించి నిగ్గు తేల్చినట్లుగా కొలవగలమా అని? ఇందుకు సమా ధానమా అన్నట్లు నోబెల్‌ కమిటీ ‘‘ప్రపంచ వ్యాపిత దారిద్య్ర నిర్మూలనకు జరిగే పోరాటంలో మన శక్తియుక్తులను పెంచడానికి ఈ ఏడాది బహుమాన గ్రహీతలు ఆర్థిక శాస్త్రంలో జరిపిన పరిశోధనలు తోడ్పడతాయి. ఆర్థికాభివృద్ధి పరివర్తన వైపుగా ఆర్థికవ్యవస్థల్ని మల్చ డానికి కేవలం గత రెండు దశాబ్దాల్లోనే అభిజిత్‌ ప్రభృతుల నూతన ప్రయోగాలు తోడ్పడ్డాయి. ఇకనుంచి ఈ ప్రయోగ పరిశోధనా పద్ధ తులు అభివృద్ధికి దోహదకారి కాగల అర్థశాస్త్రాన్ని శాసించను న్నాయి’’ అని జోస్యం చెబుతోంది. ఆశాభావం మంచిదే కానీ, ప్రస్తు తమున్న సామాజిక దోపిడీ వ్యవస్థా చట్రాన్ని, అందుకు పనిగట్టు కుని చేదోడువాదోడుగా ఉంటున్న రాజకీయ, ఆర్థిక పాలనా వ్యవ స్థను, పద్ధతుల్ని సమూలంగా మార్చకుండా ఆర్థిక స్థితిగతుల మంచి చెడుల గురించి మచ్చుకు (రాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్స్‌) జరిపే తాత్కాలిక ప్రయోగాల వల్ల అంతగా ప్రయోజనం లేకపోవచ్చు. బహుశా నోబెల్‌ పురస్కారం అందుకోకముందు, భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పాలకుల ఆధ్వర్యంలో గాడితప్పి పోతోందని అభిజిత్‌ భావించినట్లు కనపించినా అందుకు గల పెట్టుబడి వ్యవస్థాగత మూలాల గురించి ఎక్కడా ప్రస్తావించినట్టు కన్పించదు.

తాత్కాలిక ‘లేపనాలు’ పరిష్కారం కావు
అసలు ప్రస్తుతం దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ చట్రంలో బందీగా ఉన్న వాస్తవాన్ని గుర్తించి, దాన్ని బహిర్గతం చేయకుండా ప్రస్తుత పాలక వర్గం కార్పొరేట్‌ మోతుబరులపై తగ్గించిన పన్నుల మొత్తాల్ని గాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి, ప్రధానమంత్రి కిసాన్‌ పథకానికి మళ్లించాలని అభిజిత్‌ ప్రభృతులు (2.10.2019) సూచిం చడం మెచ్చుకోదగిన ప్రతిపాదన. అయితే అంతమాత్రాన పెట్టుబడి  దారీ వ్యవస్థ మూలాల్లో పేరుకున్న దోపిడీ లక్షణమనే ‘పుండు’ తొలగిపోదని గ్రహించాలి. ఎప్పటికప్పుడు పాలకులు గడిచిన ఐదేళ్లలో స్వయంకృత ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయ టపడవేయడంలో ఘోరంగా విఫలమై, రానున్న ఐదేళ్లలో దేశంలో రూ. 375 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని ‘ఉత్తరకుమార ప్రజ్ఞలు’ పలుకుతూ... ఉన్న ఉద్యోగాలకు ఎసరుపెడుతూ, గ్రామీణ, మధ్యతరగతి, పారిశ్రామిక, వ్యావసాయక రంగాలలో సర్వవ్యాపిత సంక్షోభాన్ని ఆవిష్కరించి కూర్చున్నారు. బహుశా అందుకే అభిజిత్‌ ప్రభృతులు మూలాలకు వెళ్లకుండా కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ‘లేపనాలు’ (చికిత్సలు) అద్దడానికి ప్రయత్నిస్తు న్నారు. అన్నీ పండించే రైతుకు అన్నం కరువు, అయినా ‘సున్నం’ తిని బతకమంటూ వ్యవస్థ మిగిలిన ‘మూలుగల’ను కూడా పాలకులు పిండేస్తున్నారు. బ్యాంకింగ్, సహకార సంస్థలు, పరపతి సంస్థలు ఒక్కటొక్కటిగా మూలపడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మూలా లన్నీ దేశ సాంస్కృతిక, చారిత్రిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, తాత్విక రంగాల పునాదులపై ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ కూలంకషంగా మథించిన తరువాతనే మానవజాతి ఉత్థాన పతనాల గురించి శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతాన్ని రూపొందించిన ఏకైక దార్శనికుడు కారల్‌మార్క్స్‌.. తత్వశాస్త్రజ్ఞులు ప్రపంచానికి భాష్యం చెబుతూ వచ్చారు. కానీ ఇకనుంచి మనం ప్రపంచ పరిణామాన్ని విలువైన మలుపు తిప్పాలన్నాడు.

టెక్నాలజీ ముసుగులో సరికొత్త దోపిడీ
కనుకనే భారతదేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన గాల్‌ బ్రెయిత్, సోవియెట్‌ యూనియన్‌లో పాలకుల వికృత విధానాల మూలంగా సోషలిజం వ్యవస్థకు చేటు మూడినప్పుడు దాన్ని మార్క్సిజం పతనంగా ప్రపంచ పెట్టుబడిదారీ వర్గమూ, వారి నాయకులూ పట్టలేని ఆనందంతో ప్రకటనలు గుప్పిస్తున్నప్పుడు ఇలా వ్యాఖ్యానించారు: ‘‘సోషలిజానికి ఒకచోట ఎన్ని అవాంతరాలొ చ్చినా, మార్క్స్‌ మార్క్సిజం మాత్రం జగజ్జేగీయమానంగా ప్రపంచం ఉన్నంతవరకూ వెలుగొందుతూనే ఉంటుందన్నాడు. దోపిడీ దౌర్జన్యా లపై ఆధారపడి మనుగడ సాగించగోరే పెట్టుబడి వ్యవస్థ మనుగడ నిరంతరం సైన్స్, టెక్నాలజీల వృద్ధిమీద ఆధారపడి కొనసాగించాల నుకుంటుంది. కానీ దాని దోపిడీ స్వరూపాన్ని విడనాడకుండానే దోపిడీని టెక్నాలజీ ముసుగులో కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే ప్రపంచవ్యాపితంగా అన్ని ఖండాలలోని బడుగు, బలహీన వర్ధమాన దేశాలను అప్పుల కుంపటిలోకి నెట్టి నిరంతర రుణాలలో మగ్గిపోయేటట్టు చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటోంది. ఇందుకు టెక్నాలజీలో ప్రవేశపెట్టిన డిజిటల్‌ యుగం మరింత రాక్షస రూపంలో ఇళ్లల్లోకే కాదు, పడక గదుల్లోకి కూడా దూరి తిష్టవేసి, పౌర సామాజి కుల గోప్యతకు రక్షణలేని దుస్థితిని ఆవిష్కరిస్తోంది. ‘ఆధునికత’ పేరిట సాగే ఈ వికృత ఆవిష్కరణలన్నీ పాత, కొత్త వలస సామ్రా జ్యాలు, వాటిపై ఆధారపడి మనుగడ సాగించజూస్తున్న కొన్ని వర్ధ మాన నయా పెట్టుబడిదారీ వ్యవస్థలు, పాలకులు తమ మనుగడను మరికొన్నాళ్లు పొడిగించుకోవడానికి తోడ్పడుతున్నాయి.

అభిజిత్‌ అభ్యుదయ కోణం పరిమితమే!
ఈ దశలో అభిజిత్‌ ప్రభృతులు నోబెల్‌ గ్రహీతలయినందుకు సంతోషిద్దాం. కానీ అభిజిత్‌ బెనర్జీలోని పరిమిత అభ్యుదయ కోణాన్ని హర్షిస్తూనే, కొద్దికాలం క్రితం ఆయనలో తొంగిచూసిన అభ్యుదయ వ్యతిరేక సామాజిక దృక్పథాన్ని కూడా ఖండించకుండా ఉండలేం. మహిళలపట్ల అభిజిత్‌ దృక్పథాన్ని, రేప్, సెక్స్‌ (లైంగిక, అత్యాచార సమస్యలపైన) విషయాలపై వెలిబుచ్చిన విస్మయకర మైన అభిప్రాయాలపైన ‘ఫ్రీప్రెస్‌ జర్నల్‌’ (16.10.2019) ఒక వ్యాసం ప్రచురించింది. దేశంలో పెరిగిపోతున్న సెక్స్, రేప్‌లకు కారణం స్త్రీ–పురుషుల మధ్య కలివిడిగా జరిపే సంభాషణలే కారణ మన్నది అభిజిత్‌ అభిప్రాయం. లైంగిక వ్యవహారాల్లో అసమానత లను సమాజం ఎలా తొలగించగలదో చూడాలని అభిజిత్‌ ఆ జర్న ల్‌లో పేర్కొన్నందుకు ‘గబ్బు’ లేచింది. సెక్స్‌ కోర్కెలు తీర్చుకోవ డంలో స్త్రీ పురుషుల మధ్య అసమానతలుండకూడదన్నది ఆయన అభిప్రాయంలా ఉంది. ఏది ఏమైనా, ఇలాంటి భావాలన్నీ బుద్ధి జాఢ్యజనితోన్మాదం కిందకు, పెడదారి కిందికి వస్తాయి. అయితే సమాజ దోపిడీపై ఆధారపడి బతుకుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తుల ఆలోచనా సరళిలో ఈ పెడదారులు సహజమై ఉండాలి. ఎందుకంటే, ఒకవైపున దారిద్య్ర బాధనుంచి సామాన్య ప్రజా బాహు ళ్యాన్ని తప్పించేందుకు ఆర్థిక శాస్త్రంలో నూతన ప్రయోగాలకు, ఆవిష్కరణలకు నడుం కట్టిన అభిజిత్‌ ప్రస్తుత విద్యా విధానంలో పిల్లల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలని కాకుండా కాంట్రాక్టు పద్ధతిపై ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌ ఉండా లని ప్రతిపాదించడం విద్యా బోధనా క్రమంలో ఎలాంటి అస్తవ్యస్త స్థితికి కారణమవుతుందో బోధపడటం లేదు. శాశ్వత ప్రాతిపదికపై ఉపాధ్యాయుల నియామకాలకన్నా కాంట్రాక్టు పద్ధతిపై టీచర్లను నియమించడమే మేలన్నది అభిజిత్‌ భావన.

నూతన ప్రయోగాలకు మౌలిక ‘బీజం’ ఎక్కడ?
ఇంతకూ అభిజిత్‌ ప్రభృతులకు, తాము పేదరిక నిర్మూలనకు గాను ఉద్దేశిస్తున్న ఆర్థిక శాస్త్రంలో ఆవిష్కరించిన ‘నూతన ప్రయోగాల’కు మౌలికమైన ఆలోచనా బీజం ఎక్కడనుంచి మొలకెత్తాలో తెలిసి ఉండాలి. ఆ మౌలిక వాస్తవాన్ని 19వ శతాబ్దిలోనే దోపిడీ సమాజంలో బతుకుతున్న ఇంగ్లండ్‌ శ్రమజీవులైన ప్రజలకు షెల్లీ మహాకవి ఇచ్చిన సందేశ కవితలో ఇలా ఆవిష్కరించారు:
‘‘పంట విత్తనం చల్లేది నీవు, కోసుకెళ్లేది వాడు!
సంపద సృష్టించేది నీవు, అప్పనంగా అనుభవించేది వాడు!
అందమైన బట్టల సృష్టి నీవు, వాటిని ధరించేది వాడు!
ఆయుధాలు తయారు చేసేది నీవు, వాటిని
నీమీదికే ఉపయోగించేది వాడు!
విత్తనం చల్లు– కానీ ఏ నిరంకుశుడూ అనుభవించకుండా చూడు!
సంపదను సృష్టించు– కానీ మరెవడో వచ్చి అనుభవించకుండా చూడు!
బట్టలు తయారుచేయి– కానీ సోమరిపోతుకు దక్కకుండా చూడు!
ఆయుధాలు తయారు చేయి– కానీ వాటిని నీ రక్షణ కోసమే వాడుకో!’’
అర్ధశాస్త్రంలో నూతన ఆవిష్కరణలు అలాంటి మహోదయానికి దారితీయగలగాలి. ఎండమావుల్ని తొలగించగలగాలి.


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement