ఆది దంపతుల దర్శనానికి బారులు
తరలివస్తున్న పుష్కర యాత్రికులు
ఐదో రోజు కొనసాగిన రద్దీ
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకునేందుకు పుష్కర యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఐదో రోజు యాత్రికుల రద్దీ కొనసాగింది. మంగళవారం సుమారు 1.20 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వృద్దులు, వికలాంగులు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులకు గురి కావడం, మహా మండపం మీదగా కొండపైకి చేరేందకు లిఫ్టు వద్ద ఇబ్బందులకు గురి కావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా బస్సు సదుపాయాన్ని కల్పించారు. మహా మండపం వద్ద విజయనగరం సమీపంలోని జామికి చెందిన గంగాధర్ ఫిట్స్‌తో కుప్పకూలిపోయాడు. దీంతో గంగాధర్ ముఖానికి గాయం కావడంతో ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి మంగళవారం రూ. 20, 28,790 ఆదాయం సమకూరింది.
అర్జున వీధిలో అన్నప్రసాదం..
అర్జున వీధిలోని అన్నదానం షెడ్డులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుంచి గంట పాటు యాత్రికులకు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మంగళవారం సుమారు 20 వేల మందికి అన్న ప్రసాదాన్ని అందించారు.
అమ్మవారిని సన్నిధిలో ప్రముఖులు
పుష్కర స్నానాల అనంతరం పలువురు ప్రముఖులు దుర్గమ్మను దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు టీ సుబ్బిరామిరెడ్డి, ఏపీ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు, సినీ నటుడు కోట శ్రీనివాసరావు అమ్మవారిని దర్శించుకున్నారు.