పన్నెండేళ్ల తరవాత మళ్లీ తాను ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 2006లో మెల్‌బోర్న్‌లోను, తాజాగా గోల్డ్‌కోస్ట్‌లో కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యాలు– మొత్తం 198 పతకాలు మెడలో వేసుకుంది. బ్రిటన్ వలస దేశాల మధ్య నాలు గేళ్లకోసారి జరిగే ఈ క్రీడల్లో 71 దేశాలు పాల్గొనగా 36 దేశాలు కనీసం కాంస్యమైనా సాధించి పతకాల జాబితాలో తమ పేరును చూసుకున్నాయి.
మన జట్టు విషయానికొస్తే– పతకాల సంఖ్య దాదాపుగా అంతే. కానీ ప్రతిభ మెరుగుపడింది. నాలుగేళ్ల కిందట 15 స్వర్ణాలకు పరిమితమైన భారత క్రీడాకారులు ఈ సారి 26 పసిడి పతకాలు సాధించి సత్తా చూపించారు. 2014లో యూకేలోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 15 స్వర్ణాలు, 30 రజతాలు, 19 కాంస్యాలతో 64 పతకాలకే పరిమితం కాగా, ఈసారి 26– 20– 20 చొప్పున మొత్తం 66 పత కాలతో మూడో స్థానంలో నిలిచారు. ఇక గ్లాస్గోలో నిర్వహణ దేశంగా టాప్ ర్యాంక్‌లో నిలిచిన ఇంగ్లండ్ ఈసారి 45 స్వర్ణాలు, 45 రజతాలు, 46 కాంస్యాలతో 136 పతకాలు గెలిచి రెండో స్థానానికి పరిమితమయింది.
ప్రపంచమంతా పాల్గొనే ఒలింపిక్స్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇరాన్, కజకిస్థాన్ వంటి దేశాల దిగ్గజాలు పాల్గొనే ఆసియా గేమ్స్‌తో పోలిస్తే కామన్వెల్త్ క్రీడల స్థాయి తక్కువే. అయినా ఈసారి భారత క్రీడాకారుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రస్తావించాలి.
1930 నుంచీ పాల్గొంటున్న భారత్‌కు ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఎనిమిదేళ్ల కిందట సొంతగడ్డపై జరిగిన ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 39 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలు కలిపి 101 పతకాలు గెలిచి రెండో స్థానం సాధించింది. ఆ తరవాత అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీమ్ విభాగాలతో పాటుగా వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు మెరిపించి పతకాలతో మురిపించారు. అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా, షూటింగ్‌లో మను భాకర్, అనీశ్ భన్వాలా, బాక్సింగ్‌లో గౌరవ్ సోలంకి, వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్, టేబుల్ టెన్నిస్‌లో మనిక బాత్రా, బ్యాడ్మింటన్‌లో సాత్విక్ సాయి రాజ్, మహిళల రెజ్లింగ్‌లో వినేశ్ ఫొగాట్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో భారత క్రీడా భవితకు భరోసానిచ్చారు. బాక్సింగ్‌లో మేరీకోమ్, షూటింగ్‌లో తేజస్విని సావంత్, సంజీవ్ రాజ్‌పుత్, టేబుల్ టెన్నిస్‌లో ఆచంట శరత్ కమల్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ తదితరులు మూడు పదుల వయసు దాటిపోయినా యువ క్రీడాకారులకు దీటుగా రాణిస్తూ, పట్టుదల ఉంటే అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించడం సాధ్యమేనని నిరూపించారు.
గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో భారత్‌కు తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలూ ఎదు రయ్యాయి. క్రీడల ప్రారంభానికి ముందే క్రీడా గ్రామంలో భారత బాక్సర్లు బస చేసిన చోట సిరంజ్‌లు దొరకడం కలకలం రేపింది. వెంటనే బాక్సర్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అందరికీ క్లీన్‌చిట్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. క్రీడా గ్రామంలో ‘నో నీడిల్స్’ నిబంధనపై అవగాహన లేకపోవటం వల్లే ఈ పొరపాటు జరిగిందని భారత బృందం ఇచ్చిన వివరణతో నిర్వాహకులు సంతృప్తి చెంది హెచ్చరికతో వదిలేశారు. కానీ పోటీల చివర్లో అథ్లెట్స్ ఇర్ఫాన్, రాకేశ్‌బాబు గదిలో సిరంజ్‌లు దొరకడంతో వారిద్దరినీ క్రీడా గ్రామం నుంచి బహి ష్కరించారు. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపిస్తామని, దోషులుగా తేలితే వారిద్దరిపై చర్యలు తీసుకుంటామని భారత అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించింది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన తండ్రికి క్రీడా గ్రామంలో ప్రవేశం పొందేలా అక్రెడిటేషన్ జారీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
క్రీడల నుంచి వైదొ లుగుతానని సైనా హెచ్చరించడంపై విమర్శలు రేగాయి. భారత ఒలింపిక్ సంఘం అధికారులు సైనా సమస్యను పరిష్కరించటంతో వివాదం సద్దుమణిగింది. ఇక జాతీయ క్రీడ హాకీలో భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతో తిరిగి రావటం, బాస్కెట్‌బాల్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించటం, లాన్ బాల్స్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్‌లలో మనోళ్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటం... ఇవన్నీ నాణేనికి మరోవైపు.
నిజానికి కామన్వెల్త్ క్రీడల్లో కొన్నేళ్లుగా భారత్ టాప్–10లో ఉంటోంది. ముందే చెప్పుకున్నట్లు వీటికి ఒలింపిక్స్, ఆసియా క్రీడలంత స్థాయి లేదు. అక్కడా ఇలాంటి ప్రదర్శన సాధ్యం కావాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలి. స్కూల్ స్థాయి నుంచే క్రీడలను పిల్లల రోజువారీ జీవితంలో భాగం చేయాలి. అంతర్జాతీయ వేదికలపై పతకాలు గెలిచి వచ్చాక వారిపై కోట్ల వర్షం కురిపించడం రివాజైపోయింది. మరింతమంది క్రీడాకారులు తయారయ్యేందుకు, భవిష్యత్తులో విజయాలు సాధించేందుకు ఇలాంటి నజరా నాలు ఔషధంలా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. కానీ మొక్కకు నీరుపోస్తేనే కదా చెటై్ట ఫలాలిస్తుంది! చెటై్ట పళ్లు ఇచ్చాకే చుట్టూ కోట కడతామంటే ఎలా? అద్భుతమైన క్రీడాకారులుగా ఎదిగేందుకు క్షేత్రస్థాయి నుంచే క్రీడా మౌలిక వసతులు కల్పించాలి. గెలిచిన వారికి కోట్లు కాకుండా సత్తా ఉన్నవారిని గుర్తించేందుకు, వారిని గెలిచేలా తీర్చి దిద్దేందుకు కోట్లు ఖర్చుపెట్టాలి.
మట్టిలో మాణిక్యాలను వెదికే క్రీడా ప్రతిభాన్వేషణ ప్రక్రియ నిరంతర ప్రక్రియగా మారాలి. స్కూల్ స్థాయిలో ప్రతిభను గుర్తించే సదుద్దేశంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవలే ‘ఖేలో ఇండియా జాతీయ స్కూల్ గేమ్స్’కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ క్రీడల్లో 12 మంది యువ క్రీడాకారులు డోపింగ్‌లో పట్టుబడటం కలవరపరిచే అంశం. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ క్రీడల మంత్రిగా ఉన్నారు. క్రీడలపై క్రీడాకారుల సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటే క్రీడాభివృద్ధికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ‘గోల్డ్ కోస్ట్’ ప్రదర్శన గాలివాటం కాదని, భారత్ క్రీడా శక్తిగా ఎదుగుతోందనే విష యంలో నిజం ఉందని తేలాలంటే ఆగస్టు–సెప్టెంబర్‌లో జకార్తాలో జరగబోయే ఆసియా క్రీడల్లో మన ప్రతిభ మెరుగుపడాలి!
Comments
Please login to add a commentAdd a comment