
ఈ సవరణ సరిపోతుందా?
ఢిల్లీతోసహా దేశంలోని పలుచోట్ల ఈశాన్య ప్రాంత వాసులపై కొంతకాలంగా పెరుగుతున్న దాడులు, ఇతరత్రా వేధింపులు ప్రజాస్వామికవాదులను ఆందోళనపరుస్తున్నాయి. ఇలాంటి ఉదంతాలు వెల్లడైనప్పుడు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హామీలివ్వడం...కొంత వ్యవధి తర్వాత మళ్లీ ఏదో ఒకచోట మరో ఘటన చోటుచేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో భారత శిక్షా స్మృతి(ఐపీసీ)కి సవరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. నిరుడు జనవరిలో ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు నిడో తానియాను కొందరు కొట్టి చంపిన ఘటన తర్వాత ఢిల్లీ హైకోర్టు చొరవ తీసుకుని ఈశాన్యప్రాంత వాసుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సిఫార్సు చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంపీ బెజ్‌బారువా నేతృత్వంలో 11మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఇందుకోసం తీసుకోవాల్సిన ఇతరత్రా చర్యలతోపాటు ఒక పటిష్టమైన చట్టం అవసరం కూడా ఉన్నదని ఆ కమిటీ భావించింది. అయితే, కేంద్రం తాజా నిర్ణయాన్ని గమనిస్తే విడిగా చట్టం కాకుండా ఐపీసీకి సవరణలు తెస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నట్టు కనబడుతున్నది.
ప్రభుత్వ యంత్రాంగంలో అలుముకున్న అలసత్వమే ఈశాన్యవాసులపై దాడులు పెరగడానికి ప్రధాన కారణమని నిపుణులు గతంలో పలుమార్లు చెప్పారు. దాడులు జరిగిన సందర్భాల్లో కేసు నమోదు చేయడానికి, చేసినా చురుగ్గా దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించడానికి, ఆ తర్వాత న్యాయస్థానాల్లో విచారణ వేగవంతం కావడానికి పోలీసులు ప్రయత్నించడం లేదన్నది ప్రధాన అభియోగం. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ఈశాన్యప్రాంత వాసుల కోసం ఢిల్లీ పోలీసు శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసినా పెద్దగా ఫలితం కనబడటంలేదు. అయితే, ఈ అలసత్వం కేవలం పోలీసుల్లో మాత్రమే ఉన్నదని చెప్పడం అర్థ సత్యమే అవుతుంది. బెజ్‌బారువా కమిటీ సిఫార్సుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో సాగిన తాత్సారాన్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ కమిటీ నిరుడు జూలైలోనే నివేదిక సమర్పించింది. ఇంతవరకూ ఆ కమిటీ సిఫార్సులపై కేంద్రం ప్రజాభిప్రాయాన్ని సేకరించలేదు. ఇంతకు మించి ఇంకేమి చేయవచ్చునన్న విషయంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదు.
బెజ్‌బారువా కమిటీ అయిదు విలువైన సిఫార్సులు చేసింది. ఈశాన్యవాసులపై వివక్ష చూపడాన్ని బెయిల్‌కు వీలులేని నేరంగా పరిగణించాలని, ఎఫ్‌ఐఆర్ దాఖలైన రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తికావాలని...90 రోజుల్లో కేసు విచారణ ప్రారంభం కావాలని సూచించింది. అంతేకాదు...డీఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని పేర్కొంది. అలాగే, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక పోలీసు దళాలు ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేసుల విషయంలో సున్నితంగా, చురుగ్గా వ్యవహరించేలా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరింది. ఈశాన్య ప్రాంతం గురించి, అక్కడి ప్రజల జీవన విధానం గురించి అవగాహన కలిగేలా...దేశ పురోగతిలో వారి పాత్ర గురించి తెలిసేలా పాఠ్యాంశాలుండాలని అభిప్రాయపడింది. అదే సమయంలో ఈశాన్యప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలను పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే, ఈశాన్యప్రాంత వాసులు తమ హక్కులను గుర్తించి, చట్టపరంగా తమకు సమకూరే రక్షణలేమిటో తెలుసుకోవడానికి వీలుగా న్యాయ నిపుణులతో శిబిరాలు ఏర్పాటుచేయాలని తెలిపింది. వీటన్నిటితోపాటు జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటు చేయడంద్వారా దేశ పౌరులకు ఆ ప్రాంతంపై అవగాహన పెంపొందించవచ్చునని సూచించింది. వీటన్నిటిపైనా ఎలాంటి చర్యలు తీసుకోదల్చుకున్నారో ఇంతవరకూ ఎవరికీ తెలియదు.
ఢిల్లీలో ఈశాన్య ప్రాంత వాసులపై నేరాలు క్రమేపీ పెరుగుతున్నాయని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. 2011లో 27 కేసులు నమోదైతే ఆ మరుసటి ఏడాదికి అవి 44 అయ్యాయి. 2013లో వాటి సంఖ్య 73. నిరుడు ఆ సంఖ్య 139కి చేరుకుంది. ఇందులో హత్యలు, అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకొస్తామంటున్న సవరణలు ఈశాన్య ప్రాంత వాసులపై దాడుల నివారణకు ఎంతవరకూ ఉపయోగపడతాయన్నది అనుమానమే. మాటలద్వారా లేదా సంజ్ఞల ద్వారా ఒక ప్రత్యేక బృందానికి లేదా జాతికి చెందిన వ్యక్తిని, వ్యక్తులను అవమానించడానికి ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు, జరిమానా విధించాలని తాజా సవరణ నిర్దేశిస్తున్నది. కేవలం ఇలాంటి చట్టాలద్వారా మాత్రమే అంతా చక్కదిద్దవచ్చునని భావించడం పొరపాటు. ఈశాన్యప్రాంత వాసులపై వివిధ ప్రాంతాల్లో నెలకొన్న దురభిప్రాయాలను గమనిస్తే ఇది అర్ధమవుతుంది. వారిది నేరస్వభావమని, నైతిక విలువలుండవని, దురలవాట్లు అధికమని చాలామంది అభిప్రాయపడుతున్నట్టు వివిధ సర్వేలు లోగడ వెల్లడించాయి. ఈశాన్యవాసులకు చాలా నగరాల్లో ఈ కారణాలవల్ల అద్దెకు ఇళ్లు లభించడం దుర్లభమవుతున్నదని ఆ సర్వేలు తెలిపాయి.
శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నా అట్టడుగు కులాల విషయంలోనూ, మైనారిటీ మతస్తుల విషయంలోనూ గూడుకట్టుకుని ఉన్న దురభిప్రాయాలను గమనిస్తే...ఎక్కడో ఈశాన్య ప్రాంతంనుంచి వచ్చినవారిపై మెరుగైన అవగాహన ఉంటుందని భావించలేం. కనుకనే చట్ట సవరణతోపాటు కేంద్రం మరిన్ని విస్తృతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఐపీసీకి తలపెట్టిన సవరణకు సంబంధించిన బిల్లు త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదంటున్నారు. దీని సంగతెలా ఉన్నా బెజ్‌బారువా కమిటీ ఇతర సిఫార్సులపై కేంద్రం విస్తృతమైన, లోతైన అధ్యయనం చేయాలి. నిపుణుల అభిప్రాయాలను సేకరించాలి. అలాగే ఉపాధి నిమిత్తం, చదువుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఈశాన్యప్రాంత వాసుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటివేమీ జరగకుండా చట్టపరమైన చర్యలతో సరిపెడితే అది పెద్దగా ఫలితాన్నీయదు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించాలి.