పుస్తకాలు మొదలుకొని చలనచిత్రాలు, ఛాయాచిత్రాల వరకూ సృజనాత్మక రంగంలోని సకల పార్శా్వల్లోనికీ జొరబడి తమ మాటే చెల్లుబాటు కావాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే ధోరణి ఉన్నకొద్దీ పెరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెప్పినా ఈ విషయంలో ఏ మార్పూ రావడం లేదు. తాజాగా వివిధ భాషల్లో విడుదలైన తమిళ చిత్రం ‘సర్కార్’ చుట్టూ ఆ మాదిరి వివాదమే రాజుకుంది. అందులోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీ అధినేత జయలలితను, ఆమె తీసుకొచ్చిన జన సంక్షేమ పథకాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ పాలక అన్నా డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని థియేటర్లపై పడ్డారు. ఆ చిత్రం బ్యానర్లు, పోస్టర్లు చించి కటౌట్లు ధ్వంసం చేశారు. మంత్రులు ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు మురుగదాస్‌లకు వ్యతిరేకంగా ప్రకటనలి చ్చారు. ఒక మంత్రి ‘దేశద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని సన్నివేశాలు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది అన్నాడీఎంకే నేతల అభియోగం.
మురుగ దాస్‌పై ఫిర్యాదు రావడం తరవాయిగా ఆయన ఇంటిపై రాత్రికి రాత్రే పోలీసులు దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సాధారణ పౌరుడెవరైనా తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంత వేగంగా కదులుతారా? మురుగదాస్ తెల్లారి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు అన్నా డీఎంకే కార్యకర్తలకు అభ్యంతరకరం అనిపించిన సన్నివేశాల తొలగింపునకు, కొన్ని పదాలు వినబడకుండా చేసేందుకు చిత్ర నిర్మాతలు అంగీ కరించాల్సి వచ్చింది. తమ అధినేతను అవమానించినవారిని సాష్టాంగపడేలా చేయగలిగామన్న సంతృప్తి అన్నా డీఎంకే నేతలకు ఉండొచ్చు. కానీ సాధారణ ప్రజలకు ఇదెలాంటి సందేశాన్ని పంపు తుంది? బలప్రయోగంతో దేన్నయినా సాధించుకోగలమన్న అభిప్రాయం కలిగించదా? ప్రభుత్వా నికి సారథ్యం వహించే పార్టీకి ఇది మంచి చేస్తుందా? రేపెవరైనా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని అనుసరిస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి ఏం చేస్తారు? ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధి కారం కట్టబెట్టేది తమ సమస్యలు పరిష్కరించడానికి. అంతేతప్ప తమకు శిరోభారం కలిగించమని కాదు. కానీ అది పుస్తకం కావొచ్చు, అయ్యప్ప సన్నిధికి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం కావొచ్చు... దేన్లోనైనా వివాదం రెచ్చగొట్టి లబ్ధిపొందుదామని చూసే ధోరణి రాజ కీయ నాయకుల్లో పెరుగుతోంది.
ఏదైనా కళారూపంపై అందరికీ ఏకీభావం ఉండాలని లేదు. దాన్ని మెచ్చేవారున్నట్టే, అదంటే నచ్చనివారు కూడా ఉంటారు. రచయితలైనా, కళాకారులైనా సమాజంలో జరిగేవాటిని విమర్శ నాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప దేన్నీ గాల్లోంచి సృష్టించలేరు. మనకు రోజూ తారసపడేదే అయినా, అది మన అనుభవంలోకి పదే పదే వస్తున్నా మనం చూడని భిన్న కోణాన్ని వారు అందులో స్పృశించి ఉండొచ్చు. అది సరైంది కాదనుకునేవారు దాన్ని నిశితంగా విమర్శించవచ్చు. నిరసన వ్యక్తం చేయొచ్చు. అదెలా తప్పో నిరూపించవచ్చు. న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించ వచ్చు. కానీ ఈ మార్గాలను వదిలిపెట్టి ఆవేశంతో రోడ్లెక్కి వ్యక్తులపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తుంది. కానీ చిత్రమేమంటే ఆవేశంతో చెలరేగే గుంపులు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే నేతలు సైతం ఇలాంటి పనులు చేయడానికి వెరవడం లేదు.
జనాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించి వారి మెప్పు పొందాలని ఒకప్పుడు పార్టీలు తహతహలాడేవి. ఇప్పుడు రోజులు మారాయి. తామను కునే అభిప్రాయాన్ని వారిపై రుద్ది, దాన్ని జనాభిప్రాయంగా చలామణి చేసి ఆ వంకన ‘బ్లాక్‌మెయి లింగ్’కు దిగే ధోరణి పెరిగిపోయింది. ‘పద్మావత్’ చిత్రం పడిన కష్టాలు ఇందుకు ఉదాహరణ. షూటింగ్ జరుపుకునే దశ నుంచి దానిపై కర్ణి సేన దాడులు చేస్తూ వచ్చింది. ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలు తీసుకొచ్చినవారికి రూ. 5 కోట్లిస్తామనే వరకూ వ్యవహారం వెళ్లింది. చివరకు ఆ చిత్రంలో తామనుకున్నట్టు ఎలాంటి అభ్యంతరకర సన్నివే శాలూ లేవని తెలిసినా ఈ గుంపు విధ్వంస పోకడల్ని విడనాడలేదు. తమిళనాడు థియేటర్ యజ మానుల సంఘం నాయకుడు సుబ్రమణియమ్ ఆవేదన గమనించదగ్గది. రాజకీయ పార్టీలకూ, నటులకూ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా తమ ఆస్తులు ధ్వంసమవుతున్నాయని, వ్యాపారం దెబ్బతింటున్నదని ఆయన చెప్పారు.
నిజమే... ప్రముఖ నటుడు రజనీకాంత్ చిత్రం ‘కాలా’పై ఆర్నెల్లక్రితం ఇలాంటి వివాదమే చెలరేగింది. అనేక కారణాలు చెప్పి ‘కాలా’కు అడ్డంకులు సృష్టిం చేందుకు అటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో అనేక సంఘాలు ప్రయత్నించాయి. చివరకు ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. ఇప్పుడు ‘సర్కార్’కు కూడా అవరోధాలు తప్పలేదు. మన కున్న కళారూపాల్లో సినిమా అనేది కోట్లాది రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపారం. ఏవో సాకులు చెప్పి అడ్డుకోవాలని చూడటం భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడం మాత్రమే కాదు... దానిపై ఆధారపడి ఉన్న వందల కుటుంబాల జీవికను దెబ్బతీయడం. తమిళనాడు ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. చలనచిత్రాలను చూసి, అవి ప్రదర్శనయోగ్యంగా లేవనుకుంటే కత్తిరించడానికి లేదా మొత్తంగా అనుమతి నిరా కరించడానికి ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు వంటివి ఉన్నాయి. వాటిపై ఆఖరి మాట చెప్పడానికి న్యాయస్థానాలున్నాయి. అసలు ప్రజాస్వామ్యంలో ఈ సెన్సారింగ్ విధానమే సరికాదని వాద నలొస్తున్న తరుణంలో...రాజకీయ పార్టీలు, కులసంఘాలు సెన్సారింగ్ బాధ్యతను తమ భుజాలకెత్తుకుని అధికారం అండతో గొడవలు సృష్టించడం, బెదిరింపులకు దిగడం దారుణం. రాజ్యాంగంపై, చట్టాలపై విశ్వాసమున్నదని చెబుతున్నవారు ఇలాంటి పోకడలకు పోవడం సరికాదు.
Comments
Please login to add a commentAdd a comment