పిల్లలకు అక్షరాలు నేర్పడంలో ప్రాథమిక పాఠశాలలు యధావిధిగా విఫలమవుతున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విద్యా ట్రస్టు విడుదల చేసిన సరికొత్త వార్షిక విద్యాస్థితి (ఆసర్) నివేదిక వెల్లడించింది. అయిదో తరగతి చదువుతున్న పిల్లలు రెండో తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవలేని స్థితిలో ఉన్నారని... మూడొంతులమందికి సాధారణ తీసివేతలు, భాగాహారాలు చేయడం సైతం కష్టమవుతున్నదని ఆ నివేదిక అంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారీ బడుల్లోనే ప్రధానంగా ఈ దుస్థితి నెలకొన్నదని వెల్లడించింది. దేశంలోని 577 జిల్లాల్లో వివిధ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 5,70,000 మంది పిల్లల స్థితిగతులను మదింపు వేసి ఈ నివేదికను సమర్పించింది. ఈ సంస్థ 2005 మొదలుకొని యేటా ఇలాంటి నివేదికలను రూపొందిస్తుండగా... వీటినుంచి ప్రభుత్వాలు మాత్రం ఏమీ నేర్చుకోవడం లేదని, పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడంలేదని ప్రతిసారీ నిరూపణ అవుతున్నది. ఈమధ్యలో ఎంతో ఆర్భాటంగా విద్యాహక్కు చట్టం వచ్చిచేరింది. 2010 ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చిన ఆ చట్టంవల్ల 6-14 ఏళ్ల వయసుగల విద్యార్థుల చేరిక అయితే పెరిగింది.
అయితే దీనికి దీటుగా పిల్లల హాజరు శాతం ఉండటం లేదని నివేదిక అంటున్నది. 2010లో పిల్లల హాజరు 73.4 శాతం ఉంటే అదిప్పుడు 71.1 శాతానికి చేరుకుంది. ఇక టీచర్ల హాజరు శాతానికి వస్తే అప్పుడు 86.4 శాతంగా ఉన్నది కాస్తా ఇప్పుడు 85.8 శాతానికి వచ్చింది. ఇదేదో స్వల్ప తేడాగా మాత్రమే కనిపించవచ్చుగానీ పిల్లలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాల్సిన టీచర్లను పాఠశాలలకు రప్పించడంలో విద్యా హక్కు చట్టం తగినంత ప్రభావం చూపలేకపోయిందని అర్థమవుతుంది. దీనివల్ల పిల్లలు చదువులో తగిన ప్రతిభను కనబర్చలేక పోతున్నారు. ఏడాది తిరిగేసరికి పై తరగతికి వెళ్తున్నారుగానీ అందుకవసరమైన అర్హతలు వారికి సమకూరడంలేదు. ఈ పరిస్థితికి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పిల్లలను ట్యూషన్లకు పంపి అదనంగా ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. అలాగే వ్యయప్రయాసలకోర్చి ప్రైవేటు బడుల్లో పిల్లలను చేర్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాలుగోవంతుమంది విద్యార్థులు ట్యూటర్లను ఆశ్రయించవలసి వస్తున్నది. ఇది చివరకు పిల్లలను చదువు మాన్పించే స్థితికి తీసుకెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. పాలకులు దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
మానవ వనరుల అభివృద్ధి సాధ్యం కావాలంటే మౌలిక స్థాయి విద్యను పటిష్టం చేయాలని నిపుణులంటారు. వాస్తవానికి విద్యా హక్కు చట్టం తీసుకురావడంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వానిది ఇదే ఉద్దేశం. ఆ చట్టం అమలు మొదలయ్యాక లక్షల కోట్ల రూపాయలతో విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తామని, ప్రపంచశ్రేణి విద్యకు దీటైన రీతిలో దీన్ని తయారుచేస్తామని అప్పటి కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. ఆ దిశగా సరైన అడుగులు పడటం లేదని ఆసర్ నివేదికలు అటు తర్వాత ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా ప్రభుత్వాలు మాత్రం దిద్దుబాట పట్టిన దాఖలాలు కనబడలేదు. విద్యా హక్కు చట్టం పేర్కొన్న వసతుల కల్పనలో కొద్దో గొప్పో దృష్టి పెట్టినా ప్రమాణాల విషయాన్ని మాత్రం ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని తాజా నివేదిక గణాంకాల సహితంగా వెల్లడించింది. ఇది నిజానికి ఎంతో ఆందోళన కలిగించే అంశం. సర్వశిక్షా అభియాన్ వంటి పథకాల ద్వారా పాఠశాలల్లో వసతుల కల్పన దిశగా కొంత కృషి జరిగింది. నిబంధనలకు అనుగుణంగా విద్యార్థి/ ఉపాధ్యాయుడి నిష్పత్తి ఉన్న పాఠశాలలు తాజాగా 49.3 శాతానికి చేరుకున్నాయి. అలాగే, పాఠశాలలకు అనుబంధంగా గ్రంథాలయాలు, మరుగుదొడ్లు వంటివి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. మధ్యాహ్న భోజనం, ఆటస్థలం, తాగునీరు వంటివి కూడా పిల్లలకు అందుబాటులో కొచ్చాయి. అయితే, ప్రమాణాల మెరుగుదలపై మాత్రం ఎవరూ సరిగా దృష్టి పెట్టడంలేదని నివేదిక చెబుతున్నది. రెండో తరగతి పిల్లల్లో 19.5 శాతంమంది 0-9 మధ్య అంకెలను గుర్తించలేకపోతున్నారు. అంతక్రితం ఇలాంటి పిల్లల సంఖ్య 17.6 శాతం ఉంటే అది ఇప్పుడు దాదాపు రెండు శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. గణిత బోధనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు గతంలో ఉన్న స్థానంలోనే ఉండగా చాలా రాష్ట్రాల్లో అధ్వాన్నస్థితి ఏర్పడింది. గణిత బోధనలో టీచర్లకిచ్చే శిక్షణ తగిన విధంగా లేకపోవడంవల్లే ఈ స్థితి ఏర్పడి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
సమస్యలు ఎదురైనప్పుడు నిబంధనల చట్రంనుంచి కాక సృజనాత్మకంగా ఆలోచిస్తే పరిష్కారాలు లభిస్తాయి. తమిళనాడులో అమలు చేస్తున్న ఒక విధానం ఈ విషయంలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని నివేదిక చెబుతున్నది. పిల్లల్లో చదివే సామర్థ్యం విషయంలోగానీ, గణితం విషయంలోగానీ మిగిలిన రాష్ట్రాలకంటే తమిళనాడు మెరుగ్గా ఉంది. ఇందుకు కారణం అక్కడ తరగతులను బహుళ వయస్సు పిల్లల తరగతులుగా మార్చడమేనని నిపుణులు చెబుతున్నారు. పిల్లల వయసునుబట్టి పై తరగతులకు పంపడంకాక చదవడంలో వారికుండే ప్రతిభ కొలమానంగా తరగతిని నిర్ణయించే విధానం అక్కడ అమలు చేస్తున్నారు.
భిన్న వయసులున్న వారైనా దీనివల్ల పోటీపడి చదివే మనస్తత్వం పెరిగినట్టు గుర్తించామని అక్కడి వారు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలను ఇతరచోట్ల కూడా అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చునంటున్నారు. యూపీఏ ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుత ఎన్డీయే సర్కారు కూడా ఉన్నత విద్యారంగంపై దృష్టిసారించింది. ఐఐటీలు, ఐఐఎంలవంటివి నెలకొల్పడంలో ఉత్సాహం చూపుతున్నది. పునాది స్థాయిలో పటిష్టతకు ప్రాధాన్యమివ్వకుండా తీసుకునే ఇలాంటి చర్యలవల్ల పెద్దగా ఉపయోగం ఉండదని గుర్తించాలి. ప్రాథమిక విద్యారంగంలో నెలకొన్న ఒక పెద్ద సంక్షోభాన్ని ఆసర్ నివేదిక కళ్లకు కడుతున్నది. పట్టించుకోవాల్సింది, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే.
ప్రాథమిక విద్యలో సున్నా
Published Sat, Jan 17 2015 12:38 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement
Advertisement