మెరిసిన ‘మేడిన్ ఇండియా’
‘నీ పేరు గూగుల్ అయినట్టూ, అన్నీ తెలిసినట్టూ మాట్లాడుతున్నావే...’ కుర్రకారులో చమత్కారంగా దొర్లే సంభాషణల్లో ఇదొకటి. నిజమే... ఇరవైయ్యేళ్ల క్రితం గూగుల్ ఆవిర్భవించి ఉండకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవి కాదని, మన అవగాహనకు ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. అందులోని నిజానిజాల సంగతలా ఉంచి చాలా స్వల్ప కాలంలోనే అంతటి విశ్వసనీయతను సాధించడం అసాధారణం...అపూర్వం.
సృజనాత్మకత లోనూ, ఉన్నత సాంకేతికతలోనూ అనునిత్యం ఆధిక్యతను సాధించాలన్న తపనే ఆ రంగంలో గూగుల్ సంస్థను అత్యున్నత శిఖరాగ్రంపై నిలబెట్టింది. అదిప్పుడు 1,600 కోట్ల డాలర్ల లాభాలతో ప్రపంచంలో ఉన్నతశ్రేణి టెక్నాలజీ కంపెనీగా వెలుగులీనుతోంది. అలాంటి సంస్థకు ఒక భారతీయుడూ, అందునా దక్షిణాదివాడూ అయిన సుందర్ పిచాయ్ సీఈఓ కాబోతున్నాడంటే సహజంగానే అందరూ గర్వపడతారు.
ఇప్పటికే మరో రెండు పెద్ద సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా తెలుగు తేజం సత్య నాదెళ్ల సారథ్యాన్ని స్వీకరించారు. అలాగే హ్యాండ్‌సెట్ల వ్యాపారంలో ఉన్న ప్రముఖ సంస్థ నోకియాకు రాజీవ్ సూరి సీఈఓగా ఎంపికయ్యారు. ఈ మూడు కార్పొరేట్ సంస్థలూ నిరుడు ఆర్జించిన మొత్తాలను పరిగణనలోకి తీసుకుంటే అది ప్రపంచంలోని 140 దేశాల జీడీపీల కంటే ఎక్కువని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. నిరుడు ఈ మూడు సంస్థల ఆదాయాల మొత్తం 15,960 కోట్ల డాలర్లు!
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌ల ఎంపికతో సిలికాన్ వ్యాలీ ఏలుబడి భారతీయుల చేతుల్లోకి వచ్చినట్టయింది. భిన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో ఎదిగిన యువత మెరుగైన చదువులకూ, ఉద్యోగాలకూ ఖండాంతరాలకు వెళ్లి తమ ప్రతిభాపాటవాలతో ఎదుగుతున్న వైనం ఎందరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. పరిధి చిన్నది కావొచ్చు, ఎన్నో పరిమితులుండవచ్చు...కానీ ఏదైనా బాధ్యతను అప్పగించినప్పుడు దాన్ని అధికారంగా, ఇంకా చెప్పాలంటే పెత్తనంగా భ్రమించి ప్రవర్తించేవారు చాలాచోట్ల కనిపిస్తారు.
సహోద్యోగుల్లో స్ఫూర్తిని నింపి, ఉత్సాహం కలిగించి, కొత్త ఆలోచనలకు వారిని ప్రోత్సహించి, సృజనాత్మక ఆవిష్కరణలకు దోహదకారులుగా నిలవడం, నిజమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం అరుదుగా చూస్తాం. నిరుడు మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల అయినా, గూగుల్ సీఈఓ కాబోతున్న సుందర్ పిచాయ్ అయినా ఇలా అంకితభావంతో పనిచేయడంవల్లే ఎదగ గలిగారని వారి సన్నిహితులు చెబుతున్న మాటల్లో నిజం ఉంది.
మెకిన్సీ కంపెనీలో కొంతకాలం పనిచేసి గూగుల్ ఆవిర్భవించినప్పుడు చేరిన సుందర్ పిచాయ్ గూగుల్‌కు పేరు తెచ్చిన వెబ్ బ్రౌజర్ క్రోమ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోసహా పలు సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్‌లను రూపొందించడంలో, వాటిని జనావళికి చేరేయడంలో కీలక పాత్ర పోషించారు. గూగుల్ ప్రొడక్ట్‌లను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందకోట్లకు పైగా జనం నిత్యమూ ఉపయోగిస్తున్నారంటేనే వాటి ప్రయోజనం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు.
ఇలా కోట్లాదిమంది వినియోగంలో ఉన్న సాంకేతికతను అభివృద్ధి చేయడం దిశగా నిరంతరం ఆలోచిస్తూ పోతే తప్ప ఆ పనిలో నిమగ్నమై ఉండే సంస్థ మనుగడ సాధించలేదు. అపరిమితమైన పోటీ పెరిగిన వర్తమాన వాతావరణంలో ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా అట్టడుగుకు దిగజారే ప్రమాదం ఉంటుంది. గూగుల్‌కు చాలా ముందే వచ్చిన సంస్థలు అందుకు ఉదాహరణ. కేవలం ఇంటర్నెట్ దిగ్గజంగా ఉండటంతో సరిపెట్టుకోక, ఆ రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, ప్రపంచంలో ఏమూల ప్రతిభ కనబడినా సొంతం చేసుకుని, దాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు గూగుల్ కృషి చేస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో సైతం తనదైన ముద్రను చూపడంలో ముందుంది.
ఏ వయసువారైనా, సాంకేతికత వినియోగంలో అంతగా ప్రవేశం లేకపోయినా ఎవరైనా సులభంగా వినియోగించేలా అప్లికేషన్లు రూపొందించడం గూగుల్ సాధించిన విజయం. ఐడియా చెబితే కోటి రూపాయలిస్తామని పోటీ పెట్టడం మొదలుకొని ఈ రెండు దశాబ్దాల్లోనూ గూగుల్ చేసిన పనులు చాలా ఉన్నాయి. గ్లోబల్ ఇంపాక్ట్ పేరుతో స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించడమైనా...‘గూగుల్ ఉమన్ ఇన్ ఇంజనీరింగ్’ పేరిట అవార్డు నెలకొల్పడమైనా...మృత భాషలకు ప్రాణం పోసి అవి వర్థిల్లేందుకు భాషా నిపుణులనూ, పండితులనూ ఒకచోట చేర్చినా...గూగుల్ సైన్స్ ఫెయిర్ పేరుతో బాలబాలికల్లో సృజనాత్మకతను ప్రోత్సహించినా...గూగుల్‌ది విలక్షణ మార్గం. అవిచ్ఛిన్నంగా సాగే ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్న ముఖ్యుల్లో సుందర్ ఒకరు.
వాస్తవానికి నిరుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సారథయ్యే ముందు ఆ పదవికి ఎంపిక కావొచ్చునని వినిపించిన పేర్లలో సుందర్ పిచాయ్ పేరూ ఉందంటే ఆయన నాయకత్వ పటిమపై మార్కెట్‌లో ఉన్న విశ్వాసం ఎటువంటిదో అర్థమవుతుంది.
ఇన్నాళ్లూ తానే ఒక భారీ సంస్థగా, టెక్ దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు గడించిన గూగుల్... ఇకపై కొత్తగా ఏర్పడబోతున్న ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘అల్ఫాబెట్’ లోని పలు సంస్థల్లో ఒకటిగా ఒదిగి చిన్నబోతున్న తరుణంలో మనవాడు సీఈఓ అయ్యాడన్న అసంతృప్తి కొంతమందిలో ఉంది. కానీ సంస్థ పునర్వ్యవస్థీకరణ సమయంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో సుందర్ నియామకం కూడా ఒకటని గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ చెబుతున్నారు.
ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలకు ఎందరో సృజనశీలురను, సత్తా ఉన్నవారిని అందించగలుగుతున్న మన దేశం అభివృద్ధికి ఇంకా ఆమడ దూరంలోనే ఉంటున్నది. సామాజిక వివక్ష, ఆర్ధిక అసమానతలవంటివి మాయమై...అందరికీ సమానావకాశాలు లభించినప్పుడే ఈ స్థితి మారుతుంది. అప్పుడు సుందర్ బహువచనమవుతుంది.