ఆసియాలోని రెండు పెద్ద దేశాలు భారత్-చైనాలు ఎనిమిది నెలల వ్యవధిలో రెండోసారి శిఖరాగ్ర సమావేశానికి సిద్ధమవుతున్నాయి. గురువారంనుంచి చైనాలో మూడురోజులపాటు ప్రధాని నరేంద్ర మోదీ జరపబోయే పర్యటన ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్వస్థలమైన జియాన్ నగరంలో ప్రారంభమవుతుంది. బీజింగ్ వెలుపల విదేశీ అతిథికి స్వాగతం ఇవ్వడం జిన్‌పింగ్‌కు ఇదే ప్రథమం కానుంది. నిరుడు సెప్టెంబర్‌లో మన దేశ పర్యటనకొచ్చిన జిన్‌పింగ్ మోదీ స్వస్థలాన్ని తొలి మజిలీగా ఎంపిక చేసుకోవడాన్ని ఇది గుర్తుకు తెస్తుంది. ‘సుదూరంగా ఉండే బంధువులకన్నా సన్నిహితంగా ఉండే పొరుగువారే మేల’ని చైనా నానుడి ఒకటుంది.
మోదీ పర్యటన పర్యవసానంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలూ మరింత మెరుగుపడతాయని, సాన్నిహిత్యం ఇంకాస్త పెరుగుతుందని దౌత్య రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు. పుష్కరకాలంగా ఇరు దేశాల నేతలూ పరస్పర పర్యటనలు జరుపుకోవడం, అత్యున్నత స్థాయి అధికార బృందాలు వచ్చి వెళ్లడంవంటివి కొనసాగుతున్నాయి. అయితే, ఇవన్నీ నిర్నిరోధంగా, అవాంతరాలేమీ లేకుండా సాగడం లేదన్నది వాస్తవం. సరిహద్దుల్లో చైనా దళాలు అడపా దడపా చొచ్చుకురావడం, హడావుడి చేయడం...మన అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనూ, కశ్మీర్ విషయంలోనూ చైనా పేచీకోరుతనంతో వ్యవహరించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. 1962లో నాటి ప్రధాని నెహ్రూ అన్నట్టు ఇరు దేశాలమధ్యా ఉన్న సరిహద్దు వివాదం మాత్రమే ఇందుకు కారణం కాదు.
ఈ పొరపొచ్చాలకు అంతకన్నా లోతైన కారణాలే ఉన్నాయి. ఆసియా ఖండంలో రెండూ పెద్ద దేశాలు. ఆసియాలోనూ...తద్వారా అంతర్జాతీయంగానూ అవతలి వారు తమను అధిగమిస్తారేమోనన్న శంక సహజంగానే రెండు దేశాల్లోనూ ఉంటుంది. మోదీ మరో 48 గంటల్లో చైనా పర్యటించబోతుండగా... ఆ దేశం పశ్చిమ ప్రాంతంనుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా అరేబియా సముద్రానికి రహదార్లు, రైల్వేలు, పైప్‌లైన్లతో నిర్మించబోయే ఆర్థిక కారిడార్‌పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సివచ్చిందంటేనే ఇరు దేశాల సంబంధాల్లో ఉండే ఆటుపోట్లు ఎటువంటివో అర్ధమవుతుంది. ఈ ఆర్థిక కారిడార్‌పై గత నెలలో జిన్‌పింగ్ పాక్ పర్యటన సందర్భంగా ఆ రెండు దేశాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది కేవలం వాణిజ్యపరమైన ప్రాజెక్టు మాత్రమేనని చైనా వివరణనిస్తున్నా...కారిడార్‌లో భాగమైన ఆక్రమిత కశ్మీర్ వివాదాస్పదమైన భూభాగమన్న సంగతి ఆ దేశానికి తెలియనిది కాదు. మరోపక్క చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే పత్రికలో వెలువడిన వ్యాసం...అరుణాచల్‌ప్రదేశ్‌కు సంబంధించి తమ పౌరుల మనోభావాలను మోదీ గుర్తించాలంటూ వ్యాఖ్యానించింది. ఆయన గారడీలు చేస్తారంటూ ఎద్దేవాచేసింది.
తమ దేశానికి అతిథిగా వస్తున్న ఒక దేశాధినేతపై ఈ తరహా వ్యాసం ప్రచురించడం సరికాదన్న సంగతి చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలు గుర్తించకపోవడం ఆశ్చర్యకరమే. ఇలాంటి చిన్న చిన్న అంశాలు రెండు దేశాలమధ్య ఉండాల్సిన దౌత్యసంబంధాలను నిర్దేశించకపోయినా అవి అనవసర చర్చకు దారి తీస్తాయన్నది వాస్తవం.
భారత్-చైనాల మధ్య ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉన్నదని రెండు దేశాలూ గుర్తించాయి. నిరుడు సెప్టెంబర్‌లో జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా వచ్చే అయిదేళ్లలో అదనంగా 2,000 కోట్ల డాలర్లమేర భారత్‌లో తమ పెట్టుబడులుంటాయని ప్రకటించారు. ఇందులో వెయ్యి కోట్ల డాలర్లకు సంబంధించిన ఒప్పందాలపై ఈ పర్యటన సందర్భంగా సంతకాలవుతాయంటున్నారు. ఇదిగాక ద్వైపాక్షిక వాణిజ్యం 7,000 కోట్ల డాలర్లకు పెంచాలని ఇరు పక్షాలూ ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. దానికి సంబంధించి మరింత లోతైన చర్చలు జరుగుతాయి.
పాకిస్థాన్‌తో ఎంత సన్నిహితంగా ఉన్నా భారత్‌తో బంధంవల్ల లభించే స్థాయి వాణిజ్య ప్రయోజనాలు ఆ దేశంతో సాధ్యం కాదని చైనాకు తెలియనిదేమీ కాదు. ప్రధాని మోదీ ‘మేకిన్ ఇండియా’ నినాదం తమ పారిశ్రామికవేత్తలకు ఎంతగానో లాభిస్తుందని...ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో తమకు మంచి అవకాశాలుంటాయని చైనా అంచనా వేస్తోంది. ఇదే సమయంలో దాని భయాలు దానికున్నాయి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి తమ ప్రయోజనాలను దెబ్బతీసే కార్యకలాపాల్లో భారత్ పాలుపంచుకోవచ్చునని అది అనుమానిస్తోంది. సరిహద్దు వివాదంతో సహా మన ప్రయోజనాల విషయంలోనూ, భద్రత విషయంలోనూ రాజీపడకుండా వ్యవహరిస్తామని...అందులో భాగంగానే చైనా-పాక్ ఆర్థిక కారిడార్ ప్రాజెక్టును వ్యతిరేకించామని చర్చల సందర్భంగా మోదీ తెలియజెప్పే అవకాశం ఉంది. ఆసియాలో చైనా తన ప్రభావమూ, ముద్ర ప్రస్ఫుటంగా కనబడాలని చూస్తున్నది.
పాకిస్థాన్, శ్రీలంక, మాల్దీవులు వంటి దేశాలతో సన్నిహితమవుతున్నది అందుకోసమే. సెంట్రల్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో నేరుగా పటిష్టమైన వాణిజ్యబంధం ఏర్పర్చుకోవడానికి...వాటిపై తన పట్టునూ, ప్రభావాన్నీ పెంచుకోవడానికీ అది రహదారులు, రైల్వేలు, పోర్టులు వగైరాలతో ఆధునాతన సిల్క్ రూట్‌కు పునాదులు పరుస్తోంది. రెండు దేశాల అధినేతలూ నేరుగా సాగించే చర్చల్లో ఇలాంటి అంశాలపై లోతుగా చర్చించడానికీ, దురభిప్రాయాలను పోగొట్టుకోవడానికీ వీలు కలుగుతుంది. భారత్‌లో ఇప్పుడు పటిష్టమైన నాయకత్వం ఉన్నదని, క్లిష్టమైన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడానికి ఇది సరైన సమయమని చైనా నాయకత్వం విశ్వసిస్తోంది. ఇందుకు మరికొంత సమయం పట్టినా ఆ దిశగా ముందడుగేయడానికి మోదీ పర్యటన ఎంతగానో దోహద పడగలదని భావిస్తోంది. పరస్పర ప్రయోజనాలు ముడిపడివుండే భారత్- చైనా సంబంధాల్లో తాజా పర్యటన మరో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందనడంలో సందేహం లేదు.
మోదీ-జీ అనుబంధం
Published Thu, May 14 2015 12:33 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
Advertisement
Advertisement