ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సోమవారం రష్యాలోని సోచిలో జరిగిన అనధికార శిఖరాగ్ర సమావేశం... గతంతో పోలిస్తే అంతంత మాత్రంగానే ఉన్న భారత్–రష్యా సంబంధాల్లో కీలక పరిణామం. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ మొన్న ఏప్రిల్ నెలాఖరున ఇలాంటి సమావేశమే జరిపారు. దేశాధినేతల మధ్య జరిగే శిఖరాగ్ర సమావేశాలకు పకడ్బందీ ఎజెండాలుంటాయి. అనేకానేక పత్రాలను పరస్పరం మార్చుకోవడం ఉంటుంది. ఖరారు చేసుకోవాల్సిన ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు, విదేశాంగ మంత్రులు చాలా ముందుగా భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. సంయుక్త ప్రకటనలు సరేసరి. కానీ అనధి కార శిఖరాగ్ర సమావేశాలకు ఇవేమీ ఉండవు. అధినేతలిద్దరూ ఏ అంశంపైన అయినా స్వేచ్ఛగా మాట్లాడుకుంటారు. విభేదిస్తున్న అంశాల్లో ఎవరి వైఖరేమిటి... అది ఎంతవరకూ సహేతుకమన్న విషయాలు చర్చించుకుంటారు. పర్యవసానంగా పరస్పర అవగాహన పెరిగి, విభేదాలు తగ్గే అవ కాశం ఏర్పడుతుంది.
అన్నిటికన్నా ముఖ్యంగా అధినేతల మధ్య స్నేహసంబంధాలు నెలకొనడానికి ఇలాంటి అనధికార శిఖరాగ్ర సమావేశాలు తోడ్పడతాయి. అయితే చైనాతో శిఖరాగ్ర సమావేశం రెండు రోజులు కొనసాగితే మోదీ–పుతిన్‌ల సమావేశం ఒక్కరోజుతో ముగిసింది. ఇరు దేశాలూ పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మన దేశం అమెరికాతో సన్నిహితమవుతున్నదని రష్యా అనుమానిస్తోంది. అందువల్లే తనతో అంత క్రితం కుదుర్చుకున్న యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుందని భావిం చింది. దీనికి ప్రతీకారంగా అది పాకిస్తాన్‌కు తొలిసారి ఎంఐ–35ఏ రకం సైనిక హెలికాప్టర్లను విక్ర యించింది. ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. కశ్మీర్ విషయంలోనూ కొత్త రాగం అందు కుంది. అలాగే చైనాతో బంధాన్ని పెంచుకుంది. ఈ విషయంలో ఏర్పడ్డ అపోహలను నివృత్తి చేసి మళ్లీ గతం మాదిరి రష్యాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని మన దేశం భావిస్తోంది.
అయితే అంతర్జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాతో అనుబంధం పెంచుకోవడం కత్తి మీద సామే. ఎందుకంటే తమ గడ్డపై ఒక పౌరుడిపైనా, ఆయన కుమార్తెపైనా విష రసాయనం ప్రయోగించి హతమార్చడానికి జరిగిన ప్రయత్నం వెనక నేరుగా పుతిన్ హస్తమున్నదని బ్రిటన్ ఆరోపించింది. ఆ ఘటన తర్వాత రష్యాకు చెందిన దౌత్య అధికారులు పలువురిని బహిష్కరిం చింది. దానికి ప్రతీకారంగా రష్యా కూడా అదే పని చేసింది. యూరప్ దేశాలతో అప్పటికే అంతం తమాత్రంగా ఉన్న రష్యా సంబంధాలు ఆ తర్వాత మరింత క్షీణించాయి.
నిరుడు రష్యాపై పలు ఆంక్షలు తీసుకొస్తూ అమెరికా చట్టం చేసింది. దాని ప్రకారం రష్యాతో రక్షణ, నిఘా రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. మనకు రక్షణ సామగ్రి అమ్మే దేశాల్లో రష్యా ప్రధానమైనది. మన రక్షణ కొనుగోళ్లలో దాని వాటా 62 శాతం. అమెరికా ఆంక్షలు విధించడానికి ముందే మన దేశం ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. 4,500 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందం పర్యవసానంగా బాలిస్టిక్ క్షిపణుల దాడిని, రహస్య విమానాల దాడులను ముందే పసిగట్టి ఎదుర్కొనే శక్తి మన దళాలకు సమకూరుతుంది. దీంతోపాటు కెఏ–226టి రకం మిలిటరీ హెలికాప్టర్లను ఇక్కడే తయారు చేసేందుకు ఒప్పందానికి సిద్ధమని రష్యా ప్రకటించింది. అలాగే ప్రాజెక్ట్ 751 జలంతర్గా ములు అమ్మడానికి ముందుకొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో ఇవి ఎంతవరకూ సాకారమవుతాయన్న అనుమానాలున్నాయి. అయితే దేశ రక్షణ విషయంలో రాజీపడబోమని మన దేశం చెబుతోంది. అమెరికా చట్టం ప్రకారం ఇరాన్‌తో లావాదేవీలు నెరపినా ఈ మాదిరి ఆంక్షలే వర్తిస్తాయి. అయితే మన దేశంపై చర్య తీసుకుంటే అధికంగా నష్టపోయేది అమెరికాయే. ఎందు కంటే ఆ దేశంతో మనకు రక్షణతోసహా పలు ఒప్పందాలున్నాయి.
సోచి సమావేశం తర్వాత రెండు దేశాలూ విడివిడిగా విడుదల చేసిన ప్రకటనలు గమనిస్తే ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ఇరు దేశాలూ సుముఖంగా ఉన్నాయని అర్ధమవుతుంది. ‘ఇండో–పసిఫిక్ ప్రాంతం’లో భారత్ పాత్ర కీలకమైనదని భావిస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు. ఆసియా–పసిఫిక్ పదబంధం స్థానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఈ కొత్త మాటపై చైనాకు అసంతృప్తి ఉన్న సంగతి తెలిసినా ఆయన దీన్ని ఉప యోగించారు. అమెరికా ఆంక్షల మాటెలా ఉన్నా తాము రష్యానుంచి ఆయుధాలు, ఇంధనం కొనడానికి సిద్ధమని ఈ చర్చల సందర్భంగా మన దేశం చెప్పడం కూడా రష్యాకు సంతృప్తి కలిగించింది. ట్రంప్ వచ్చాక నిలకడలేని అమెరికా విధానాల పర్యవసానంగా అంతర్జాతీయ రంగంలో ఒక అనిశ్చితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఏ దేశానికి ఆ దేశం స్వీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానాలు రూపొందించుకుంటోంది. మన దేశం కూడా అందుకు మిన హాయింపు కాదు. అందువల్లే లోగడ ఉహాన్‌లో చైనాతోనూ, ఇప్పుడు సోచిలో రష్యాతోనూ నరేంద్ర మోదీ శిఖరాగ్ర సమావేశాలు జరిపారు. భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వం, అణు సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం వంటి అంశాల్లో రష్యా మనకు మద్దతునిస్తోంది. మొత్తానికి సోచి శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలూ తిరిగి సన్నిహితం కావడానికి ఒక ప్రాతిపదికను ఏర్పరుస్తుందని ఆశించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment