ఎన్నికలు జరగబోతున్న బిహార్ నుంచి అన్నీ శుభ వార్తలే వింటున్న బీజేపీకి ఇది ఊహించని షాక్. దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించే సమయం ఆసన్నమైందంటూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆయన అభిప్రాయాలతో తమకు ఏకీభావం లేదని బీజేపీ నేతలు ఆదరా బాదరాగా ప్రకటన చేసిన మాట వాస్తవమే అయినా అప్పటికే బిహార్‌లోని ప్రత్యర్థి పక్షాల నాయకులు అందుకున్నారు. మీ వైఖరేమిటో చెప్పాలని బీజేపీ నేతల్ని డిమాండ్ చేశారు. ఆమధ్య కాంగ్రెస్ నాయకుడు జితిన్ ప్రసాద కూడా మండల్ రాజకీయాలను సమీక్షించాలని తమ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ఇప్పుడు భాగవత్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్‌కే చెందిన సీనియర్ నేత మనీశ్ తివారీ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు.
బిహార్ ఎన్నికల్లో భాగవత్ వ్యాఖ్యలు బీజేపీకి కలిగించగల నష్టం సంగతలా ఉంచి అసలు రిజర్వేషన్లపై పదే పదే వెలువడుతున్న ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వెనక ఆ రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర దాగి ఉన్నదని అణగారిన వర్గాలకు చెందిన నాయకులు భావిస్తున్నారు. చిత్రమేమంటే ఈ వివాదాలకు సమాంతరంగా తమకూ కోటా కల్పించాలంటూ కొత్త కులాలు రోడ్డెక్కుతున్నాయి. బీసీల జాబితాలో ఉన్న కొన్ని కులాలు తమను ఎస్సీల్లో లేదా ఎస్టీల్లో చేర్చాలని కోరుతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు కోరుతున్న కులాలన్నీ గతంలో కోటా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించినవే. గుజరాత్‌లో ఒకప్పుడు ఉధృతంగా సాగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలకు ఊపిరిగా నిలిచింది పటేళ్లే.
రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే చర్చ ఈనాటిది కాదు. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాతా కూడా దీనిపై విస్తృతంగా చర్చలు సాగాయి. సాగుతున్నాయి. మోహన్ భాగవత్ లేవనెత్తింది కూడా దానిలో భాగమే. అయితే చె ప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం వేరు. అలా చెబితే ఆ చెప్పేవారి ఉద్దేశాలేమిటో వెల్లడవుతాయి. భాగవత్ ఆ పని చేయలేదు. సామాజికంగా వెనకబడిన వర్గాలకు మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించినట్టుగా రిజర్వేషన్లు అమలు చేయడం మాని...మన నేతలు మొదటినుంచీ వాటిపై రాజకీయం నెరపుతున్నారని ఆరోపించారు. అంతటితో ఆగలేదు. ఎవరికి రిజర్వేషన్లు అవసరమో, ఎంతకాలం అవసరమో తేల్చడానికి ఒక ‘రాజకీయేతర సంఘాన్ని’ ఏర్పాటు చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. దీనిపై పెద్దయెత్తున రగడ రాజుకున్నాక ఆయనసలు కోటా వ్యవస్థపైనే మాట్లాడలేదని ఆరెస్సెస్ అంటున్నది. బలహీన వర్గాలన్నీ ప్రయోజనాలు పొందేలా చూడటమే అందరి ధ్యేయం కావాలన్నది ఆయన మాటల్లోని ఆంతర్యమంటున్నది. నిజానికి రిజర్వేషన్లు ఎవరికి అవసరం... ఎంతకాలం అవసరం అన్నవి అంత జటిలమైన ప్రశ్నలే మీ కాదు. సమాజంలో కుల వివక్ష ఎదుర్కొంటున్నవారికి రిజర్వేషన్లు అవసరం.
ఆ కుల వివక్ష ఉన్నంతవరకూ అవి కొనసాగడం అవసరం. మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం అదే. దేశంలో శతాబ్దాలుగా ఉన్న కుల వ్యవస్థ కారణంగా సామాజిక అణచివేతకు గురవుతూ విద్యాగంధానికి దూరంగా ఉన్న అట్టడుగు కులాలు సహజంగానే ఉన్నతోద్యోగాలకు దూరంగా ఉన్నాయి. ఈ స్థితిని గమనించి విద్య, ఉద్యోగాల్లో అలాంటి కులాలకు అవకాశం దక్కేవిధంగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బ్రిటిష్ పాలకులు సంకల్పించారు. శతాబ్దాల అసమానతలు సృష్టించిన అంతరాన్ని వీలైనంత తగ్గించాలంటే అవకాశాలను అందుకోవడంలో విఫలమవుతున్న వర్గాలకు ఆలంబనగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నదే ఈ విధానంలోని పరమోద్దేశం.
స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగంలో సైతం ఈ రిజర్వేషన్లను పొందుపరిచింది అందుకే. నిజానికి ఎస్సీ, ఎస్టీలతోపాటు సామాజికంగా వెనకబడిన కులాలకు కూడా అప్పుడే రిజర్వేషన్లు కల్పించి ఉంటే వేరుగా ఉండేది. రాజ్యాంగంలోని 15, 16 అధికరణలు ప్రభుత్వానికి అందుకు అవకాశం ఇచ్చాయి. కానీ అలా చేయడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. కుల వివక్ష కారణంగా సామాజికంగా వెనకబడి ఉన్న కులాలను గుర్తించేందుకు 1979లో ఆనాటి జనతాపార్టీ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను నియమించింది. మండల్ కమిషన్ చురుగ్గా పనిచేసి మరుసటి ఏడాదికల్లా నివేదికను సమర్పించినా మరో తొమ్మిదేళ్లు దాన్ని మూలనపడేశారు. చివరకు 1989లో ఆనాటి వీపీ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని నిర్ణయించడం, దేశంలో పలుచోట్ల దానికి వ్యతిరేకంగా ఆందోళనలు రాజుకోవడం చరిత్ర. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగబద్ధమేనని 2008లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.
దేశ జనాభాలో ఎస్సీలు 16.6 శాతం, ఎస్టీలు 8.6 శాతం ఉండగా ఓబీసీల శాతం దాదాపు 56. రిజర్వేషన్లు అమలవుతున్నా ఈ నిష్పత్తిలో ఆయా వర్గాలు విద్యా, ఉద్యోగ అవకాశాలను పొందలేకపోతున్నాయి. అసలు ఇంతవరకూ రిజర్వేషన్ల ఫలాన్నే అందుకోని అత్యంత వెనకబడిన కులాలు, అట్టడుగు దళిత కులాలు ఉన్నాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్థితిలో భాగవత్ లాంటి ప్రభావవంతమైన నాయకుడినుంచి రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం అన్న ప్రశ్న వెలువడటం సహజంగానే ఆయా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే అగ్రవర్ణాల్లో పేదలు లేరా...వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా అన్న ప్రశ్నలూ ఉన్నాయి. అలాంటివారికి కూడా కోటా కల్పించి ఆదుకోవాలనుకుంటే కాదనేవారెవరూ ఉండరు. అందుకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలనూ...ఆర్థికంగా దుర్బలంగా ఉన్నవారినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. పార్టీలైనా, ఆరెస్సెస్‌లాంటి సంస్థలైనా ఎన్నికల ప్రయోజనాలకు అతీతంగా తమ మనోగతమేమిటో వెల్లడించడం...విలువైన చర్చలకు చోటీయడం అవసరం.
కోటాపై దుమారం
Published Wed, Sep 23 2015 1:47 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement