సభా పర్వం | monsoon session of Parliament | Sakshi
Sakshi News home page

సభా పర్వం

Published Mon, Jul 20 2015 11:26 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

monsoon session of Parliament

వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరని నానుడి. కానీ మంగళవారం నుంచి మొదలై వచ్చే నెల 13 వరకూ 18 రోజులపాటు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల వాలకం ఎలా ఉండబోతున్నదో అందరికీ అర్థమైపోయింది. ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే మొన్న జమ్మూలో గిరిధారి లాల్ డోగ్రా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు తీర్చేశాయి. ‘ఇప్పుడిలా వేదికపై అందరమూ కనిపిస్తున్నాంగానీ... ముకాబ్‌లా (యుద్ధం) ముందుంది’ అని ఆయన చమత్కారంగానే అన్నా దేన్ని దృష్టిలో పెట్టుకుని అన్నారో అందరికీ అర్థమైంది. పార్లమెంటు సమావేశాల కోసం ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యంవహిస్తున్న బీజేపీ... కాంగ్రెస్‌తోసహా విపక్షాలూ ఇప్పటికే తమ తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి.

 చట్టసభలను ఎంతటి ప్రతికూల సమయాల్లోనైనా సజావుగా నడపడమే సమర్థతకు గీటురాయని ఒకప్పుడు పాలకపక్షం భావించేది. వివిధ రంగాల్లో పాలకపక్షం విఫలమవుతున్న తీరునూ, దాని అసమర్థతనూ ప్రజలకు చాటిచెప్పాలని విపక్షం అనుకునేది. ఇప్పుడు రోజులు మారాయి. చట్టసభలు రణ క్షేత్రాలవుతున్నాయి. సభ సజావుగా నడిస్తే అది తమ అసమర్థతగా జనం భావిస్తారని విపక్షాలు అనుకుంటుంటే...సభ వాయిదాల్లో గడిచిపోవడం ఒకందుకు మంచిదేనని అధికార పక్షం లెక్కలేసుకుంటున్నది. సభ సక్రమంగా నడిస్తే చర్చకొచ్చేవి కుంభకోణాలే అయినప్పుడు చర్చకన్నా రచ్చే మేలనుకుంటున్నది. 2011లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కనీసం ఒక్కరోజు కూడా నడవలేదు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ విషయంలో అధికార, విపక్షాలమధ్య వివాదం తలెత్తడమే అందుకు కారణం. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల నాటికల్లా ఆనాటి యూపీఏ ప్రభుత్వం దిగొచ్చి జేపీసీ విచారణకు ఒప్పుకుంది. విపక్షం సహకరించకపోతే, సభ జరగకపోతే బడ్జెట్ ఆమోదం పొందక సంక్షోభం ఏర్పడుతుందని భావించబట్టే అధికార పక్షం అప్పటికల్లా తగ్గింది. మూడేళ్లక్రితం పార్లమెంటు వజ్రోత్సవాల సందర్భంగా ప్రత్యేక సమావేశం జరిగినప్పుడు ప్రసంగించిన నాయకులంతా దేశంలోనే అత్యున్యతమైన ఈ చట్టసభ ఔన్నత్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉన్నదని అభిలషించారు. కానీ అంతకు ముందూ, ఆ తర్వాతా కూడా పార్లమెంటు సజావుగా సాగడం అరుదుగా మారింది. అక్కడ అర్థవంతమైన చర్చలకు బదులు బల ప్రదర్శనలే దర్శనమిస్తున్నాయి. చట్టసభలకు జవాబుదారీగా ఉండాలనే మౌలికాంశాన్ని అధికారంలో ఉండేవారు విస్మరిస్తున్నారు. దాంతో నిమిత్తం లేకుండా పరిపాలించవచ్చుననుకుంటున్నారు. పన్నులైనా, రైల్వే చార్జీలవంటివైనా బడ్జెట్‌లకు ముందో, తర్వాతో పెంచడం సర్వసాధారణమైంది. ఈ విషయంలో యూపీఏ సర్కారు బాటలోనే ఎన్డీయే ప్రభుత్వం కూడా వెళ్తున్నది. భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఇప్పటికి మూడుసార్లు ఆర్డినెన్స్ జారీచేయడం ఇందుకు తార్కాణం.

 దేశంలో సమస్యలకేమీ తక్కువ లేదు. వ్యవసాయ రంగం పెను సంక్షోభంలో ఉంది. ఆరుగాలం శ్రమిస్తున్నా ఫలితం దక్కకపోగా...అప్పుల ఊబిలో కూరుకుపోయి దిక్కుతోచక అన్నదాతలు ఉసురుతీసుకుంటున్నారు. సాక్షాత్తూ దేశ రాజధాని నగరంలోనే ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిరుడు అన్నదాతలు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా...తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ది ఈ విషయంలో ఏడో స్థానం. దినసరి కూలీల ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యవసాయ రంగం నుంచి నిష్ర్కమిస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఆహార ధాన్యాల సేకరణపై పరిమితులు విధించడంతోపాటు ఆ సేకరణ బాధ్యతను ఎఫ్‌సీఐనుంచి తప్పించడం రైతులకు నష్టదాయకంగా పరిణమించింది. తాము అధికారంలోకొస్తే సాగు వ్యయంపై 50 శాతం అదనంగా లెక్కేసి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను నిర్ణయిస్తామని చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు గద్దెనెక్కాక ఆ మాటే మరిచారు. యువతకు ఉపాధి కల్పనలోనూ చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. పారిశ్రామిక ఉత్పాదకత సైతం నీరసంగానే ఉన్నది.
 మరోపక్క కేంద్రంలోనూ, బీజేపీ పాలనలో ఉన్న వివిధ రాష్ట్రాల్లోనూ మంత్రులుగా ఉన్నవారిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. లలిత్ మోదీ వ్యవహారంలో విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింధియాలు... విద్యార్హతల విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీ... వ్యాపం, పీడీఎస్ కుంభకోణాల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ సర్కారు మంత్రులిద్దరిపైనా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇక బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో అభాసుపాలయింది. ఆడియో, వీడియోల్లో చంద్రబాబు,రేవంత్‌రె డ్డి అడ్డంగా దొరికిపోయారు. గోదావరి పుష్కరాల తొలిరోజునే కేవలం చంద్రబాబు తప్పిదం కారణంగా తొక్కిసలాట సంభవించి 27మంది ప్రాణాలు కోల్పోయారు.

తమ మంత్రులు, సీఎంలతోపాటు ఇలా మిత్రపక్షంగా ఉంటున్నవారి నిర్వాకాలపై జవాబివ్వడం బీజేపీ నేతలకు అంత సులభం కాదు. ఆరోపణలను ప్రత్యారోపణలతో ఎదుర్కొనవచ్చునని...విపక్షాలకు దీటుగా తామూ కంఠస్వరాన్ని పెంచవచ్చునని అనుకుంటే, అదే పరిష్కారంగా భావిస్తే అందువల్ల నష్టపోయేది ఎన్డీయే ప్రభుత్వమే. రెండో దఫా అధికారం చేపట్టాక యూపీఏ సర్కారు ఈ వ్యూహాన్ని అనుసరించబట్టే ప్రజల్లో నగుబాటు పాలైంది. అన్ని అంశాలపైనా పారదర్శకంగా వ్యవహరించి... చర్చకు చోటివ్వడం సరైందని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తేనే దాని ప్రతిష్ట ఇనుమడిస్తుంది. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరీ అవసరం. అలా కాకుండా యూపీఏ ప్రభుత్వ సంప్రదాయాన్నే కొనసాగించదల్చుకుంటే పర్యవసానాలు కూడా అందుకు తగినట్టే ఉంటాయని గుర్తించడం మంచిది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement