నేరాలు తగ్గినట్టేనా? | NCRB 2018 Crime Report Released | Sakshi
Sakshi News home page

నేరాలు తగ్గినట్టేనా?

Published Thu, Jan 16 2020 11:51 PM | Last Updated on Thu, Jan 16 2020 11:51 PM

NCRB 2018 Crime Report Released - Sakshi

జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) 2017నాటి నివేదిక వెలువరించిన మూడు నెలల్లోనే 2018 సంవత్సరం నివేదికను విడుదల చేసింది.  ముగియబోయే సంవత్సరం నివేదికను ఏడాది చివరిలోనో, ఆ మరుసటి ఏడాది మొదట్లోనో విడుదల చేయడం రివాజు. దాన్ననుసరించి 2017 వార్షిక నివేదిక 2018లో రావాల్సివుండగా, ఏడాది ఆలస్యమై నిరుడు విడుదలైంది. అంత జాప్యం చోటుచేసుకున్నందుకు వచ్చిన విమర్శల వల్లకావొచ్చు... 2019 ముగిసిన కొన్ని రోజులకే 2018 నివేదిక బయటికొచ్చింది. స్థూలంగా చూస్తే నేరాల రేటు తగ్గినట్టు కనిపించినా మహిళలపై జరుగు తున్న నేరాలు పెరిగాయి. నేరాల రేటును గణించడంలో కొత్త విధానం అనుసరిస్తూ, దాని ద్వారా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న అభిప్రాయం కలిగిస్తున్నారని నిపుణుల విమర్శ. లక్షమంది జనాభాకు జరిగే నేరాల సంఖ్యను బట్టి ఈ నేరాల రేటును లెక్కేయడం ఎప్పటినుంచో ఆనవాయితీ. అయితే 2016 మొదలుకొని ఈ విధానం మారింది. దాని ప్రకారం ఒక ఎఫ్‌ఐఆర్‌లో వేర్వేరు నేరాలు నమోదైనప్పుడు వాటిల్లో గరిష్టంగా శిక్షపడగల తీవ్రమైన నేరాలను మాత్రమే పరిగణనలోకి తీసు కుంటారు. దాంతో ఇతర నేరాలన్నీ లెక్కలోకి రాకుండా పోతున్నాయి.

ఒక బాలుడిని అపహరించి, గుర్తుతెలియని చోట నిర్బంధించి, అతన్ని హింసించి హత్య చేసిన సందర్భాలున్నప్పుడు ఎన్‌సీ ఆర్‌బీ ఇందులో అపహరణ, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు పెట్టడం, హత్య చేయడం వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని గణాంకాల్లో చూపేది. కొత్త విధానం ప్రకారం గరిష్టకాలం శిక్ష పడే అవకాశంవున్న హత్యా నేరాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందువల్ల దేశంలో జరిగే నేరాల స్వభావంపైనా, వాటి తీరుపైనా అవగాహనకు రావడం కష్టమవుతుంది. నిరుడు అక్టోబర్‌లో విడుదలైన 2017నాటి నివేదిక తొలిసారి మహిళలు, పిల్లలపై జరిగే అఘాయిత్యాలను, దళితులపై జరిగే అఘాయిత్యాలను, అవినీతి ఉదంతాలను భిన్నవిధాలుగా వర్గీకరించారు. నకిలీ నోట్లనూ, నల్లధనాన్ని అరికట్టడానికి 2016లో పెద్ద నోట్లు రద్దు చేశాక విడుదల చేసిన రూ. 2,000 నోట్లపై నేరగాళ్ల దృష్టి పడిందని ఈ నివేదిక వెల్లడిస్తోంది. దేశంలో వేర్వేరు చోట్ల పట్టుబడిన నకిలీ కరెన్సీలో ఈ నోట్ల వాటా 61.01శాతం వున్నదంటే పరిస్థితి ఏవిధంగా వున్నదో అర్థం చేసుకోవచ్చు. 2017లో ఈ నోట్ల వాటా 53.30 శాతంవుంటే, ఇప్పుడది మరింత పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్‌లో రూ. 2,000 నకిలీ నోట్లు అధికంగా పట్టుబడగా, తదనంతర స్థానాల్లో పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ వున్నాయి. ఆ నోటును అనుకరించడం అసాధ్యమని అప్పట్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ప్ర

కటించడం గమనార్హం. సగటున రోజూ దేశవ్యాప్తంగా 80 హత్యలు, 91 అత్యాచారాలు, 289 అపహరణలు జరుగు తున్నాయని తాజా నివేదిక వెల్లడిస్తోంది. 2017లో ఈ నేరాల సంఖ్య 3,45,989 కాగా, 2018లో అవి 3,78,277కి చేరుకున్నాయి. అంటే నేరాలు 1.3 శాతంమేర పెరిగాయి. ఉత్తరాది ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరిగాయి. ఆ రాష్ట్రంలో మహిళలపై మొత్తం 59,445 నేరాలు జరిగాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇవి దాదాపు 3,500 అధికం. అత్యాచారాలకు పాల్పడిన నేరగాళ్లలో 93.7శాతం మంది బాధితులకు తెలిసినవారే. 2017నాటి నివేదిక కూడా ఈ సంగతినే నిర్ధారించింది.  మహిళలు గతంతో పోలిస్తే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసే తీరు పెరిగినందువల్ల అత్యాచార కేసుల సంఖ్యలో పెరుగుదల కనబడుతోందన్నది వాస్తవం. అయితే ఇప్పటికీ బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకురాని స్థితి సమాజంలో వుంది. కనుక ఎన్‌సీఆర్‌బీ నివేదికలు వెల్లడించే సంఖ్యను మించి ఈ నేరాలు ఉండొచ్చుననే భావించాలి. ప్రభుత్వాల వైఖరి మారితే తప్ప ఈ నేరాలు తగ్గే అవకాశం వుండదు.

అత్యాచారం జరి గినట్టు ఫిర్యాదు అందినప్పుడు వెనువెంటనే కదిలి నేరగాళ్లను అదుపులోనికి తీసుకుని, త్వరితగతిన దర్యాప్తు చేసినప్పుడు, న్యాయస్థానాల్లో సాధ్యమైనంత త్వరగా నేరగాళ్లకు శిక్షలు పడినప్పుడు మాత్రమే ఇవి అంతరిస్తాయి. అలాగే బాధితులను బాధితులుగా చూడకుండా, తప్పంతా వారిదే అయినట్టు ప్రశ్నించే పోలీసుల తీరు కూడా ఫిర్యాదు చేయడానికి బాధితులు వెనకాడేలా చేస్తోంది. పోలీసు గస్తీ పెంచడం, సమాచారం అందినవెంటనే స్పందించడం, ప్రజారవాణా విభాగాన్ని పటిష్టం చేయడం అత్యవసరం. మహిళలను చిన్నచూపు చూసే సామాజిక, సాంస్కృతిక ధోర ణులను అరికట్టడం అన్నిటికన్నా ముఖ్యం. మహిళలపై నేరాలను అరికట్టడం ప్రభుత్వాలకూ,  పోలీసు విభాగాలకూ ప్రాధాన్యతాంశంగా మారినప్పుడు ఇవన్నీ సరిచేయడం సులభమవుతుంది. అంతక్రితంతో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గాయని గణాంకాలు చెప్పడం ఊరటనిస్తుంది. అయితే వాటిని తరచి చూస్తే పంటలు సరిగా పండని ప్రాంతాల్లో, వర్షపాతం సరిగాలేని ప్రాంతాల్లో ఈ ఆత్మహత్యలు ఇప్పటికీ గణనీయంగా వున్నాయని బోధపడుతుంది.

రైతుల కష్టాలను తీర్చడంలో ప్రభుత్వాల చూపు మరింత నిశితం కావాల్సిన అవసరాన్ని ఇది ఎత్తిచూపుతోంది. దేశంలోని రైతుల్లో పది శాతంమంది భూమిలేనివారే. కౌలుకు తీసుకున్న భూముల్లో సాగు చేస్తూ, అందుకవసరమైన అప్పు బ్యాంకుల్లో దొరక్క, అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడతారు. దాంతో అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ఈమాదిరి అప్పులు సాగు ఉత్పత్తుల విలువలో సగానికిపైగా వుంటాయి. ఇలాంటి రైతులకు సైతం బ్యాంకు రుణాలు లభించేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంటల బీమా, ప్రకృతి విపత్తుల నిర్వహణ వగైరాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది. 48 లక్షలమంది రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ కింద రూ. 13,500 చొప్పున అందించింది.  ఇతర రాష్ట్రాలు సాగు రంగంలో ఈ తరహా చర్యలు తీసుకుంటే రైతుల ఆత్మహత్యలు అరికట్టడం సాధ్యమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement