
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కి రూ. 13,500 కోట్లు ఎగనామం పెట్టి నిరుడు ఫిబ్రవరిలో చడీచప్పుడూ లేకుండా సకుటుంబ సమేతంగా విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని బుధవారం లండన్ పోలీసులు అరెస్టు చేయడం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరు ణంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. ‘చౌకీదార్ చోర్ హై...’ అంటూ కాంగ్రెస్ హోరెత్తిస్తుంటే... ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు మొదలుకొని బీజేపీ నాయకుల వరకూ అందరూ ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ‘చౌకీదార్’నే ఇంటిపేరు చేసుకున్నారు. ఈ రాజకీయ విన్యాసాల మాటెలా ఉన్నా ఆచూకీ లేకుండా పోయిన నీరవ్ మోదీ అరెస్టు కావటం మంచి పరిణామమే.
అయితే ఆయన్ను ఇప్పట్లో భారత్‌కి రప్పించడం అంత సులభం కాకపోవచ్చు. భారీ మొత్తంలో బ్యాంకుల్ని ముంచి దర్జాగా దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా సైతం ఇలాగే రెండేళ్లక్రితం లండన్‌లో అరెస్టయ్యాడు. దానిపై మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ వార్తలు వెలువడుతుండగానే బెయిల్‌పై బయటపడ్డాడు. ఇదంతా చూశాక నీరవ్ మోదీకి ధైర్యం వచ్చినట్టుంది. ఆయన్ను మార్గదర్శిగా తీసుకుని దేశం నుంచి నిష్క్రమించాడు. అయితే నీరవ్ మోదీకి మాల్యా మాదిరి అరెస్టయిన వెంటనే ఊరట దొరకలేదు. వెస్ట్‌మినిస్టర్ మేజి స్ట్రేట్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కనుక నెలాఖరు వరకూ జైల్లో గడపవలసి ఉంటుంది. ఆ తర్వాతే బెయిల్ విషయం తేలుతుంది.
నీరవ్ లండన్‌లో దర్జాగా ఉన్నాడని కనుక్కున్నది మన నిఘా సంస్థలు కాదు. విస్తృతమైన యంత్రాంగం, సమస్త వనరులు అందుబాటులో ఉన్న ప్రభుత్వానికి సాధ్యం కాని పనిని బ్రిటన్‌కు చెందిన దినపత్రిక ‘డెయిలీ టెలిగ్రాఫ్’ సాధించింది. నీరవ్ ఆ దేశ పౌరుడు కాదు. లండన్‌లో అందరూ గుర్తించే స్థాయి ప్రముఖుడు అంతకన్నా కాదు. అయినా ఆ పత్రికలో ఫ్యాషన్ విభాగంలో పనిచేస్తున్న పాత్రికేయుడు భారత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ఒకరు కొత్తగా వ్యాపారం ప్రారం భించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడన్న సమాచారాన్ని తెలుసుకుని సహచర పాత్రికేయుల్ని అప్రమత్తం చేసిన పర్యవసానంగా నీరవ్ బట్టబయలయ్యాడు.
ఇద్దరు ముగ్గురు పాత్రికేయులు సమన్వయం చేసుకోవడంతో సాధ్యమైన పని విస్తృత యంత్రాంగం ఉండే మన నిఘా సంస్థలకు చేతకాలేదంటే అది సిగ్గుపడాల్సిన విషయం. అయితే నీరవ్ ఫలానా చోట ఉన్నాడని తెలియక పోవచ్చుగానీ...లండన్ చేరుకుని ఉండొచ్చునని మన నిఘా సంస్థలు గుర్తించాయి. నీరవ్ దొరికితే నేరస్తుల మార్పిడి ఒప్పందం కింద మాకప్పగించాలని కోరుతూ బ్రిటన్‌కు లేఖ కూడా వెళ్లింది. కానీ దానికి అనుబంధంగా ఇవ్వాల్సిన ఇతర పత్రాల విషయంలో జాప్యం కావడం వల్ల అప్పగింత ప్రక్రియ మొదలు కావడానికి సమయం పడుతుందని మీడియా కథనాలు చెబుతున్నాయి. నీరవ్ అరెస్టుకు ఒకరోజు ముందు బ్రిటన్ ప్రభుత్వ వినతి మేరకు అక్కడి న్యాయస్థానం వారెంటు జారీ చేయడంవల్ల నీరవ్‌కు బెయిల్ దొరకడం కష్టమైంది.
ఇక్కడ నీరవ్ అక్రమంగా నిర్మించిన భవంతులను నేల కూలుస్తున్నారు. అతడి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ లండన్‌లో అతని వైభవం చూస్తే ఎలాంటివారికైనా కళ్లు తిరగాల్సిందే. అక్కడ అత్యంత ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన ఆకాశహర్మ్యంలో ఒక ఫ్లోర్‌లో సగభాగాన్ని అద్దెకు తీసుకుని నెలకు దాదాపు రూ. 16 లక్షలు చెల్లిస్తున్నాడని తేలింది. నిజానికి పీఎన్‌బీ కుంభకోణం 2017లో బద్దలు కావడానికి కొన్ని నెలల ముందు అమెరికాలోని న్యూయార్క్‌లో రెండు అపార్ట్‌మెంటులను నీరవ్ కుటుంబం కొనుగోలు చేసిందని, ఈ ఆస్తుల్ని ఒక ట్రస్టు పేరిట రిజిస్టర్ చేశారని నిరుడు వెల్లడైంది. అంటే మన దేశంలో ఆస్తులు స్వాధీనం చేసుకున్నా, బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసినా నీరవ్‌కు వచ్చిన నష్టం, కష్టం ఏమీ లేదన్నమాట! విజయ్ మాల్యా తరహాలో బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టే రూటులో నీరవ్ మోదీ పోలేదు.
అంతర్జాతీయంగా వ్యాపారం చేస్తున్న సంస్థకు బ్యాంకులు లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్(ఎల్‌ఓయూ)లు జారీ చేసే విధానాన్ని నీరవ్ తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఒక బ్యాంకు ఎల్‌ఓయూ జారీ చేసిందంటే దాన్ని సమర్పించిన వ్యక్తి తీర్చాల్సిన సొమ్ముకు పూచీ పడతామని అర్ధం. నిజానికి ఈ ఎల్‌ఓయూల్లో పేర్కొనే మొత్తానికి సమానమైన ఆస్తుల్ని బ్యాంకుకు హామీగా చూపినప్పుడే అవి జారీ అవుతాయి. కానీ అదేమీ లేకుండానే 2010 నుంచి ఇష్టానుసారం ఎల్‌ఓ యూల్ని నీరవ్ సమర్పించాడు. విదేశాల్లో ఎల్‌ఓయూను సమర్పించినప్పుడు దాన్ని స్వీకరించిన బ్యాంకు జారీ చేసిన బ్యాంకును సంప్రదించి నిర్ధారించుకుంటుంది. ఆ తర్వాతే అందులో చూపిన మొత్తాన్ని విడుదల చేస్తుంది. కానీ దొంగచాటుగా వీటిని పొంది విదేశాల్లోనూ, ఇక్కడా పలు బ్యాంకుల్లో సమర్పించి వేల కోట్ల రూపాయలు దోచేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే మన బ్యాంకింగ్ వ్యవస్థ డొల్లతనాన్ని బాగా ఇంచక్కా వినియోగించుకున్నాడు.
ఈ వ్యవహారంలో ఒక్క పీఎన్‌బీని మాత్రమే నిందించి ప్రయోజనం లేదు. ఇతర విభాగాలు సైతం ఇందులో దోషులే. నీరవ్ చేస్తున్న వ్యాపారంలోని లొసుగులను ఆదాయం పన్ను విభాగం కనిపెట్టి 2017 జూన్‌లోనే 10,000 పేజీల నివేదిక రూపొందించింది. నిబంధనల ప్రకారం ఆ నివేదిక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్‌ఐయూ)కు చేరాలి. దాన్నుంచి సీబీఐ, ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వగైరా సంస్థలకు వెళ్లాలి. ఈ సంస్థ లన్నిటి మధ్యా చక్కని సమన్వయం ఉంటే నీరవ్ మోదీ మోసాన్ని సకాలంలో గుర్తించి అరికట్టడం వీలయ్యేది. కానీ అది జరగకపోవడంతో నీరవ్ యధేచ్ఛగా పీఎన్‌బీని దోచుకున్నాడు. కనీసం నీరవ్ మోదీ పట్టుబడిన ఈ సమయంలోనైనా సమర్థవంతంగా వ్యవహరించి అతణ్ణి ఇక్కడకు తీసుకు రావడానికి అనువైన చర్యలు తీసుకుంటారని ఆశించాలి.